
పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రంగంలో పనిచేస్తారు. కానీ.. కొంతమంది ఎంచుకున్న పనికే వన్నె తెస్తారు. సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల. ఈ పేర్లు ప్రస్తావించకుండా భారతీయ చలనచిత్ర పరిశ్రమ గొప్పతనాన్ని చెప్పడం సాధ్యం కాదంటే అతిశయోక్తికాదు. ఇక తెలుగు సినిమా చరిత్రలో వీరి పాత్ర చెప్పాలంటే అది సువర్ణాక్షరాలతో లిఖించదగిన ప్రస్థానం. ఒకరు తిరుగులేని సూపర్‌స్టా్టర్, మరొకరు కళారంగంలో స్త్రీ శక్తిని, సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన స్టార్. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంచుకున్న రంగంలో ఇద్దరూ ఇద్దరే.
1943 మే 31న గుంటూరు జిల్లాలో బుర్రిపాలెంలో వీరరాఘవయ్య, నాగరత్నమ్మ దంపతులకు జన్మించిన ఘట్టమనేని శివరామకృష్ణ, సూపర్‌స్టార్ కృష్ణగా ఎదగడంలో ఎన్నో ఎత్తుపల్లాలు... ఒడిదుడుకులు... ఇంకెన్నో సాహసాలు. ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో డిగ్రీ చదువుతున్నపుడు, ‘చేసిన పాపం కాశీకి వెళ్లినా...’ అనే నాటకంతో మొదలైన నటనాభిలాష, 1965లో తేనెమనసులు సినిమాతో హీరోగా వెండితెరకు చేరింది.బంగారు వర్ణంతో మెరిసిపోతూ.. సన్నని మీసకట్టుతో.. అమాయకంగా, అందంగా ఇంట్లో పెద్దకొడుకులా కనిపించే కృష్ణను చూసి తెలుగు ప్రేక్షకులు మురిసిపోయారు.
సీతారామరాజు గెటప్ వేసినా... సింహాసనం మీద కూర్చున్నా...కౌబాయ్‌గా కనిపించినా... జేమ్స్ బాండ్‌గా మెరిపించినా... చారిత్రకం, పౌరాణికం, జానపదం, సాంఘికం ఏ జానరైనా, ఏ పాత్ర వేసినా అది సూపర్‌హిట్... అందుకే అతను టాలీవుడ్ సూపర్‌స్టార్ అయ్యారు. హీరోగా కృష్ణ చేసిన తొలి చిత్రమే తెలుగులో పూర్తిస్థాయి కలర్‌లో తీసిన తొలి సాంఘిక చిత్రం. ఇది యాదృచ్ఛికంగా జరిగింది. ఆ తర్వాత ఆయన ఎన్నో విషయాల్లో తొలివ్యక్తిగా నిలిచారు. సాహసానికి చిరునామాగా పేరు తెచ్చుకున్న ఈ బుర్రిపాలెం బుల్లోడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఆవిష్కరణలకు నాంది పలికారు.
ఈస్ట్‌మన్ కలర్, కలర్‌స్కోప్, 70 ఎమ్ ఎమ్, డిటిఎస్ సౌండ్ సిస్టమ్ వంటి ఆధునిక సాంకేతిక పోకడల్ని టాలీవుడ్‌కి పరిచయం చేసింది ఈ నటశేఖరుడే. ఇక తెలుగువారికి తొలి జేమ్స్ బాండ్, తొలి కౌబాయ్ ఆయనే. ఒకే ఏడాది హీరోగా 18 సినిమాలు రిలీజైన ఏకైక సూపర్ బిజీ... సూపర్ స్టార్ ఆయననొక్కరే. కెరీర్లో 25సార్లు ద్విపాత్రాభినయం, ఏడు సార్లు త్రిపాత్రాభినయంతో అలరించిన ఈ సూపర్‌స్టార్ 17 చిత్రాలకు దర్శకత్వం వహించారు. డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్‌గా సేవలందించడంతో పాటు పద్మాలయా బ్యానర్‌పై తెలుగు, హిందీ, తమిళంలో ఎన్నో మరపురాని చిత్రాలను నిర్మించారు.
తొలి నుంచి కాంగ్రెస్ అభిమానిగా ఉన్న కృష్ణ రాజకీయాల్లోనూ అడుగుపెట్టారు. 1989లో ఏలూరు నుంచి పార్లమెంటుకి ఎన్నికయ్యారు. రాజీవ్‌గాంధీ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన కృష్ణగారు... రాజీవ్ మరణంతో రాజకీయాలు వదిలేశారు. పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టిన ఈ సూపర్‌స్టార్ ఐదుపదులు దాటిన తర్వాత కూడా మెగా హీరోలతో పోటీ పడి రెండు సార్లు సంక్రాంతి విన్నర్ ట్రోఫీ ఎత్తుకు పోయారు. ఇండస్ట్రీలో పట్టుదలతో కష్టపడితే పెద్ద హీరో అనిపించుకోవచ్చు కానీ... మంచి మనిషి అనిపించుకోవడం అందరికీ సాధ్యం కాదు. కృష్ణ అది సాధించారు.
విజయనిర్మల వెండితెరపై కృష్ణ విజయనిర్మల ’సాక్షి’ వేదికగానే పరిచయమయ్యారు. 1967లో సాక్షి చిత్రంలో తొలిసారి జంటగా నటించిన వీరిద్దరూ ఆ తర్వాత నిజజీవితంలోనూ ఒకటయ్యారు. తమ కెరీర్లో 47 చిత్రాల్లో కలిసి నటించారు. 11 యేళ్ల వయసులో ‘పాండురంగ మహత్యం’ చిత్రంతో బాలనటిగా వెండితెరకు పరిచయమయ్యారు విజయనిర్మల. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో రెండువందలకు పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి తిరుగులేని గుర్తింపు సాధించుకున్నారు. నటనకు మాత్రమే పరిమితం కాకుండా, తనలో ఉన్న దర్శకత్వ ప్రతిభతో ఆణిముత్యాల్లాంటి సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకుల మెప్పుపొందారు.
44 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు.350కి పైగా చిత్రాల్లో నటించిన కృష్ణ తెలుగు సినిమా చరిత్రలోనే ఆ ఘనత సాధించిన ఏకైక కథానాయకుడిగా చరిత్ర సృష్టిస్తే... ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా విజయనిర్మల అరుదైన ఘనతను సాధించారు. వెండితెరపై ఈ కళాజంటది అర్ధశతాబ్దపు ప్రయాణం. కళకు అంకితమై తెరకు గౌరవం పెంచిన ఈ దంపతులను ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2017 జీవిత సాఫల్య పురస్కారం’తో సత్కరించడం గొప్ప గౌరవంగా భావిస్తోంది సాక్షి.
Comments
Please login to add a commentAdd a comment