చెన్నై : హీరో కథా చిత్రాల్లో నటించమంటున్నారని చెప్పారు నటి జ్యోతిక. ఇంతకు ముందు కోలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా రాణించిన ఈమె నటుడు సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత నటనకు కామా పెట్టారు. అయితే ఇద్దరు పిల్లల తల్లి అయిన జ్యోతిక సుమారు ఏడేళ్ల తరువాత మళ్లీ నటనపై దష్టి సారించారు. 36 వయదు చిత్రం ద్వారా కథలో సెంట్రిక్ పాత్రలో నటించి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత వరుసగా కథానాయకికి ప్రాముఖ్యత ఉన్న చిత్రాలనే చేశారు. తాజాగా ఆమె నటించిన చిత్రం జాక్‌పాట్. ఇందులో ప్రముఖ నటి రేవతి ప్రధాన పాత్రలో నటించగా యోగిబాబు, ఆనంద్‌రాజ్, మన్సూర్ అలీఖాన్, మొట్టరాజేంద్రన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. గలేభకావళి వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన కల్యాణ్ దర్శకత్వం వహించిన చిత్రం జాక్‌పాట్. కాగా నటుడు సూర్య తన 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించారు. వినోదమే ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని శుక్రవారం తెరపైకి రానుంది. కాగా ఈ చిత్రం ద్వారా యాక్షన్ అవతారం ఎత్తిన నటి జ్యోతికతో సాక్షి భేటీ అయింది. ఆ ముచ్చట్లేమిటే చూద్దాం.
ప్ర: జాక్‌పాట్ చిత్రం గురించి చెప్పండి?
జ: ఇది యాక్షన్, వినోదం, ప్రేమ, సెంటిమెట్ ఇలా అన్ని మసాలాలతో వండిన జనరంజక చిత్రంగా ఉంటుంది. నేను ఇంతకు ముందెప్పుడూ చేయనటువంటి పాత్రను జాక్‌పాట్ చిత్రంలో చేశాను. నాతో పాటు రేవతి ప్రధాన పాత్రలో నటించారు. దర్శకుడు కల్యాణ్ చిత్రాన్ని చాలా లావిష్‌గా తెరపై ఆవిష్కరించారు. హీరోలకు బిల్డప్ ఇచ్చే షాట్‌ను ఈ చిత్రంలోనూ పేక్షకులు చూసి ఎంజాయ్ చేస్తారు.
ప్ర: స్టార్ హీరో చేయాల్సిన కథలో మీరు నటిం చారని ఆడియో వేడుకలో సూర్య చెప్పారు. దీని గురించి మీరేమంటారు?
జ: అలాంటి యాక్షన్ సన్నివేశాలతో కూడిన కమర్శియల్ కథా చిత్రంగా జాక్‌పాట్ ఉంటుంది. ఒక హీరో చేసేవన్నింటినీ దర్శకుడు ఈ చిత్రంలో నాతో చేయించారు. పైట్స్, పాటలు అన్నీ ఒక కమర్శియల్ చిత్రంలో మాదిరి ఉంటాయి.
ప్ర: రాక్షసి లాంటి ఒక సందేశంతో కూడిన చిత్రంలో నటించిన మీరు ఇలాంటి కమర్శియల్ చిత్రంలో నటించడానికి కారణం?
జ: కథలను ఎంచుకోవడంలో నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. దర్శకుడు కల్యాణ్ చెప్పిన ఈ చిత్ర కథ బాగా నచ్చింది. అందుకే నటించడానికి అంగీకరించాను. సినిమాలో చక్కని సందేశం ఉంటుంది.
ప్ర: బయట నిర్మాణ సంస్థలకు సొంత నిర్మాణ సంస్థకు ఏదైనా డిఫెరెంట్‌గా ఫీలవుతున్నారా?
జ: నేను రీఎంట్రీ అయిన తరువాత బయట సంస్థల్లో నాచియార్ లాంటి రెండు మూడు చిత్రాల్లోనే నటించాను. అయినా 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌లో నటించడం నాకు చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. ప్లానింగ్ బాగుంటుంది. తదుపరి కూడా సొంత నిర్మాణంలోనే వరుసగా రెండు చిత్రాలు చేయనున్నాను.
ప్ర: ఈ సంస్థలో నటిస్తున్నందుకు పారితోషికం పుచ్చుకుంటున్నారా?
జ: (నవ్వుతూ) పారితోషికం ఏముంది? అంతా ఒక ఇంటికేగా వెళుతుంది. అయినా నాకు పారితోషికం ఇస్తున్నారు.
ప్ర: మీ ఇంటిలోనే ముగ్గురు హీరోలు ఉన్నారు. ముఖ్యంగా శివకుమార్ జాక్‌పాట్ చిత్రం చూసి ఏమన్నారు?
జ: బాగుంది. ఇకపై ఇలాంటి యాక్షన్ చిత్రాలే చెయ్యమని అన్నారు.
ప్ర: మీకు డ్రీమ్ పాత్ర ఏమైనా ఉందా?
జ: అలాంటిదేమీ లేదు. వచ్చిన కథల్లో నచ్చినవి చేసుకుపోవడమే.
ప్ర: రాక్షసి చిత్రానికి మీరు ఎదుర్కొన్న విమర్శలు, ప్రశంసల గురించి?
జ: చాలా మంది ప్రశంసించారు. ముఖ్యంగా పలు గ్రామాలకు చెందిన ఉపాధ్యాయులు ఫోన్లు, ఉత్తరాల ద్వారా ప్రశంచించారు. వాస్తవ సంఘటనలకు అద్దం పట్టింది రాక్షసి చిత్రం. అగరం పౌండేషన్ ద్వారా ఎందరో పేద విద్యార్థులను చదివిస్తున్నాం. విద్యావిధానం గురించి మాకు తెలుసు. కాబట్టి నిజాలనే చిత్రంలో చూపించాం.
ప్ర: వివాహానికి ముందు తర్వాత కూడా ప్రముఖ కథానాయకిగా కొనసాగడం అన్నది అరుదైన విషయమే. అందుకు మీ ప్రతిభే కారణం అని భావిస్తున్నారా?
జ: నిజం చెప్పాలంటే నాకంటే ప్రతిభావంతులు చాలా మంది ఉన్నారు. నేను కథానాయకిగా రాణిస్తున్నానంటే నా భర్త ప్రోత్సాహం, దైవానుగ్రహమే కారణం.
ప్ర: నటిగా పలు చిత్రాలు చేసిన అనుభవం ఉంది. దర్శకత్వం చేసే ఆలోచన ఉందా?
జ: దర్శకత్వం గురించి నాకేమీ తెలియదు. కాబట్టి ఆ ఆలోచన లేదు. నటిగానే ఇంకా పేరు తెచ్చుకోవాలన్నదే నా కోరిక అని జ్యోతిక పేర్కొన్నారు. కాగా ఈ చిత్రం ఇదే పేరుతో వారం తరువాత తెలుగులోనూ విడుదల కానుంది.
హీరో కథా చిత్రాల్లో నటించమంటున్నారు
Published Thu, Aug 1 2019 8:28 AM | Last Updated on Thu, Aug 1 2019 8:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment