సల్మాన్‌ను దోషిగా నిర్ధారించడంతో బాలీవుడ్ నిర్మాతల్లో గుబులు
సాక్షి, ముంబయి : కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను జోథ్‌పూర్ కోర్టు దోషిగా నిర్ధారించడంతో బాలీవుడ్‌లో దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. సల్మాన్ హీరోగా రూ వందల కోట్లతో పలు సినిమాలు రూపొందుతుండటంతో ఆయా చిత్ర నిర్మాతల్లో ఉత్కంఠ నెలకొంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద సల్మాన్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించారు. బాలీవుడ్ కండలవీరుడు ప్రస్తుతం రెమోడిసౌజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రేస్ 3 దుబాయ్ షెడ్యూల్‌ను ఇటీవల పూర్తి చేశారు. ఈద్ సందర్భంగా ఈ మూవీ జూన్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రేస్ 3తో పాటు అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో అతుల్ అగ్నిహోత్రి నిర్మిస్తున్న భరత్ మూవీకి పనిచేయాల్సి ఉంది. భరత్ తర్వాత సోనాక్షి సిన్హాతో కలిసి దబాంగ్ 3 సెట్స్‌లో అడుగుపెడతారు. కిక్ 2లో కూడా సల్మాన్ నటించేందుకు రంగం సిద్ధమైంది. ఇంతవరకూ షూటింగ్‌కు వెళ్లని ఈ మూవీని 2019 క్రిస్మస్‌కు రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలతో పాటు మరికొద్ది నెలల్లో ప్రసారమయ్యే టెలివిజన్ సో దస్ కా దమ్‌ను సల్మాన్ నిర్వహిస్తున్నారు. ఇక రియాల్టీ షో బిగ్ బాస్‌లో తిరిగి సల్మాన్‌ను ప్రవేశపెట్టాలని మేకర్లు భావిస్తున్నారు. కృష్ణజింకల కేసులో సల్మాన్‌ను జోధ్‌పూర్ కోర్టు దోషిగా నిర్ధారించడంతో ఈ ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకమైంది.
Comments
Please login to add a commentAdd a comment