
కోర్టు బోను ఎక్కిన సల్మాన్ ఖాన్
ముంబై: 2002 హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ శుక్రవారం కోర్టు మెట్లుఎక్కారు. కోర్టు బోనులో నిలబడి తన సాక్ష్యాన్ని వినిపించారు. తుది వాదనలు ప్రారంభించేందుకు వీలుగా సల్మాన్ సాక్ష్యాన్ని నమోదు చేయాల్సిందిగా ఇటీవల కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు ఈ సందర్భంగా మీడియాను నిషేధించాలన్న సల్మాన్ పిటిషన్ ను న్యాయమూర్తి దేశ్ పాండే తిరస్కరించారు. అయితే విచారణ పూర్తయ్యేవరకు వివరాలు వెల్లడి చేయొద్దని మీడియాను కోరారు.
2002లో మద్యం మత్తులో కారు నడిపి ఫుట్పాత్ మీద నిద్రిస్తున్నఒకరు మరణించడానికి, నలుగురు గాయపడేందుకు కారణమైన కేసులో సల్మాన్ ఖాన్ నిందితుడిగా విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే సల్మాన్ కారు నడిపినట్లు ప్రాంతీయ రవాణా అధికారి ఒకరు ముంబై సెషన్స్ కోర్టుకు నివేదించారు. సల్మాన్ 2004లో లైసెన్స్ పొందారంటూ అందుకు సంబంధించిన రికార్డులను కోర్టుకు సమర్పించారు. కాగా, సల్మాన్ మద్యం సేవించినట్టుగా రక్త పరీక్షల్లో నిర్ధారణ అయిందని పోలీసులు వాదిస్తున్నారు. అంటే, లైసెన్సు లేకుండా, తాగి కారు నడిపి మరీ ప్రమాదం చేసినట్లుగా ఆరోపణలను సల్మాన్ ఎదుర్కొంటున్నాడన్న మాట.