అలా చేయడం నాకు నచ్చదు | Samantha About U Turn Movie | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 2 2018 10:13 AM | Last Updated on Sun, Sep 2 2018 10:13 AM

Samantha About U Turn Movie - Sakshi

నాకు గ్లిజరిన్‌ వేసుకుని నటించడం నచ్చదని అన్నారు నటి సమంత. వివాహనంతరం అగ్రనటిగా రాణిస్తున్న ఈ బ్యూటీ నాటి మేటి నటీమణులను గుర్తుకు తెస్తున్నారు. ఇటీవల సమంత తమిళ, తెలుగు భాషల్లో నటించిన చిత్రాలన్నీ సక్సెస్‌లే. అలాంటి నటి తాజాగా మరో మైల్‌రాయిని టచ్‌ చేశారు. ఇప్పటివరకూ స్టార్‌ హీరోలకు సపోర్టింగ్‌ పాత్రల్లోనే నటిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్న ఈ సుందరి తాజాగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు ఓకె చెప్తున్నారు.

కన్నడంలో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న  యూటర్న్‌ చిత్రం అదే పేరుతో సమంత కథానాయకిగా తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కింది. కన్నడ చిత్ర దర్శకుడు పవన్‌కుమార్‌నే ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ సంస్థ అధినేత శ్రీనివాస సింధూరి, వీవై.కంబైన్స్, పీఆర్‌ 8 క్రియేషన్స్‌ అధినేత రాంబాబు బండారు కలిసి నిర్మిస్తున్న చిత్రం యూటర్న్‌.

సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆది, రాహుల్‌ రవీంద్రన్, నరేన్, భూవిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని క్రియేటివ్‌ ఎంటర్‌టెయిన్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ద్వారా ధనుంజయన్‌ విడుదల చేయనున్నారు. చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 13వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ శుక్రవారం సాయంత్రం చెన్నైలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

చిత్ర దర్శకుడు పవన్‌కుమార్‌ మాట్లాడుతూ కన్నడ చిత్రం యూటర్న్‌ను మరింత మెరుగు పరిచి తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కించినట్లు తెలిపారు. చిత్రం చివరి 30 నిమిషాలు చాలా థ్రిల్లర్‌గా ఉంటుందన్నారు. కన్నడంలో ట్రైలర్‌ విడుదల సమయంలోనే సమంత ఈ చిత్రం గురించి తనతో మాట్లాడారని, ఆమె కోసమే ఈ రీమేక్‌ చిత్రానికి తాను దర్శకత్వం వహించానని తెలిపారు. సమంత, రాహుల్‌ రవీంద్రన్‌ల నుంచి తాను తమిళ భాషను కొంచెం కొంచెం నేర్చుకున్నానని దర్శకుడు పవన్‌కుమార్‌ తెలిపారు.

నటి సమంత మాట్లాడుతూ యూటర్న్‌ ట్రైలర్‌ విడుదల రోజే 2 మిలియన్ల వీయూస్‌ పొందిందని, అంత మంది ప్రేక్షకులు ఆదరిస్తారని తానూ ఊహించలేదని అన్నారు. ఇందులో హీరో, హీరోయిన్‌ అంటూ ప్రత్యేకంగా ఎవరూ ఉండరన్నారు. కథే పెద్ద హీరో అని పేర్కొన్నారు. కన్నడ చిత్రం లూసియా చూసినప్పుడే ఆ చిత్ర దర్శకుడు పవన్‌కుమార్‌కు తాను వీరాభిమానిని అయిపోయానన్నారు. అప్పుడే ఆయన దర్శకత్వంలో ఒక చిత్రం చేయాలని ఆశపడ్డానన్నారు. ఈ చిత్రం ద్వారా అది నెరవేరడం సంతోషంగా ఉందని అన్నారు.

యూటర్న్‌ థ్రిల్లర్‌ కథా చిత్రం మాత్రమే కాదని, ఇదే పెద్ద జర్నీ అని చెప్పారు. ఇందులో అన్ని రకాల భావోద్రేకాలు ఉంటాయన్నారు. అదే విధంగా చిత్ర షూటింగ్‌ను ఏకధాటిగా ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని తమిళంలో ధనుంజయన్‌ విడుదల చేయడంతో మంచి చేతిలో పడ్డట్టు భావిస్తున్నానన్నారు. తనకు యథార్థంతో కూడిన పాత్రల్లో నటించడం చాలా ఇష్టం అన్నారు. అదే తనని చిత్రంలోకి తీసుకొచ్చిందని చెప్పారు. 

యూటర్న్‌ చిత్రంలో ఎమోషన్‌ సన్నివేశాలు చాలా ఉంటాయని చెప్పారు. తనకు గ్లిజరిన్‌ వేసుకుని నటించడం నచ్చదన్నారు. అలా కష్టపడి ఒక సన్నివేశంలో నటించిన తరువాత మరో భాష కోసం అదే సన్నివేశంలో నటించాల్సి ఉంటుందని, అది చాలా ఛాలెంజ్‌ అనిపించిందని అన్నారు. హీరోల కష్టమేమిటో ఈ చిత్రంతో తాను అనుభవ పూర్వకంగా గ్రహించానని సమంత పేర్కొన్నారు. ఈ సమావేశంలో దర్శకుడు శివ అతిథిగా పాల్గొన్నారు. నటుడు ఆది, రాహుల్‌ రవీంద్రన్, నిర్మాత ధనుంజయన్‌ చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement