అభిమానుల కంటతడి సంతోషాన్నిచ్చింది
చెన్నై చిన్నది సమంత. అయితే ఇప్పుడామె చెన్నైకే పరిమితం కాదు.దక్షిణాది సినీ ప్రేమికుల కలలరాణి. ప్లాపుల నుంచి టాప్‌కు ఎదిగిన నాయకి. అపజయాలు విజయాలకు తొలిమెట్టు అన్న నానుడిని నిజం చేసిన నటి సమంత. నటుడు విజయ్‌తో నటించిన తొలి చిత్రం కత్తి, మలి చిత్రం తెరి చిత్రాలతో విజయ పథంలో దూసుకుపోతున్న సమంత అలాంటి విజయాన్ని తెలుగులో తొలి చిత్రం ఏం మాయ చేశావే తోనే సొంతం చేసుకున్నారు.
నటిగా ఉన్నత స్థాయిలో కొనసాగుతున్న సమంత ఒక మానవత్వం ఉన్న మనిషిగాను మహోపకారం చేస్తూ మన్ననలు అందుకుంటున్నారు. సమంత ఇప్పటికి 70 మంది గుండె సంబంధిత బాధితులకు ఉచితంగా శస్త్ర చికిత్స చేయించి మానవత్వాన్ని చాటుకున్నారు. దీని గురించి సమంత తెలుపుతూ తాను ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నటి నన్నారు. నటిగా ఆరేళ్లు పూర్తి చేసుకుంటున్న తాను సంపాదించిన దానిలో తనకు చేతనైన సాయాన్ని ఇతరులకు అందించాలని భావిస్తుంటానన్నారు.
ఇప్పటికి 70 మందికి ఉచిత గుండె శస్త్ర చికిత్స చేయించినా ఇకపై కూడా తన సేవాకార్యక్రమాలు కొనసాగుతాయన్నారు.ఇందు కోసం ప్రత్యూష ఫౌండేషన్ పేరుతో ట్రస్టును నెల కొలిపినట్లు వెల్లడించారు. తెరి చిత్రం సక్సెస్ మీట్‌లో పాల్గొనలేకపోయానని,అందుకు కారణం చేతి నిండా చిత్రాలతో రాత్రనకాపగలనకా నటిస్తూ బిజీగా ఉండడమే కారణం అన్నారు. అయితే తెరి చిత్రాన్ని తెలుగులో చూశానని, అందులో తాను చనిపోయిన సన్నివేశాన్ని చూసిన అభిమానులు కంటతడి పెట్టడం తనకు సంతోషాన్నినిచ్చిందన్నారు. అదే విజయంగా భావించానని అన్న సమంత గురువారం తన పుట్టిన రోజును జరుపుకున్నారు.