
ఏడీఎంకేలో సమంత?
క్రేజీ బ్యూటీస్‌లో నటి సమంత ఒకరని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంతకుముందు టాలీవుడ్‌లో ఏలిన ఈ చెన్నై చిన్నది ఇప్పుడు పూర్తిగా కోలీవుడ్‌పైనే దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం తమిళ టాప్ హీరోలందరితోను వరుసగా జత కట్టేస్తున్న సమంత తాజాగా ఏడీఎంకేలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏడీఎంకే అనగానే రాజకీయాలు గుర్తు కొస్తున్నాయా? అలాంటి ఆలోచన రావడంతో తప్పులేదు.
ఎందుకంటే ఇటీవల నటి త్రిష అన్నాడీఎంకేలో చేరబోతున్నారనే ప్రచారం హల్‌చల్ చేసింది. ఆ ప్రచారాన్ని నేనా? రాజకీయాల్లోనా? అంటూ ఖండించిన త్రిష ఆ తరువాత అతి కొద్ది రోజుల్లోనే మరో 15 ఏళ్ల తరువాత రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేకపోలేదంటూ చెన్నైలో ఒక సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా అన్నారు. క్షణ క్షణం బుల్ జవరాలి చిత్తముల్ అన్నట్లు ఈ హీరోయిన్లు ఎప్పుడు? ఎలా? మాట్లాడుతారో తెలియదు. ఇకపోతే ఏడీఎంకేలో సమంత చేరనున్నారా? అనగానే ఈ అమ్మడికి రాజకీయ ఆశా? అనే ఆసక్తి కలగక మానదు.
అయితే ప్రస్తుతానికి ఈ బ్యూటీ న్యూస్ రాజకీయాలకు సంబంధించి కాదు. ఆర్య, బాబిసింహా, రానా, శ్రీదివ్య, పార్వతి మీనన్ నటిస్తున్న చిత్రం అర్జున్ దివ్య మట్రుమ్ కార్తీక్. దీన్ని షార్ట్‌కట్‌లో ఏడీఎంకే అంటున్నారు. మలయాళం మాతృక అయిన ఈ చిత్రాన్ని తమిళంలో పీవీపీ సినిమా సంస్థ నిర్మిస్తోంది. కాగా మలయాళంలో నటి నిత్యామీనన్ పోషించిన అతిథి పాత్రను తమిళంలో సమంత నటించనున్నారన్నది తాజా సమాచారం.