దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నది సామెత. చిత్ర పరిశ్రమలో నటీనటులకు ఈ సామెత బాగా వర్తిస్తుంది. క్రేజ్ ఉన్నప్పుడే వరుసగా సినిమాలు చేసి అటు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించడంతో పాటు ఇటు బ్యాంక్ బ్యాలెన్స్‌లు కూడా పెంచుకోవాలి. అయితే పలువురు హీరోయిన్లు 2024ని మిస్ అయ్యారు. వారు నటించిన ఒక్క సినిమా కూడా ఈ ఏడాది విడుదల కాకపోవడం విశేషం. ఈ ఏడాది వెండితెరపై కనిపించని హీరోయిన్ల జాబితా డజనుకుపైగానే ఉంది. నయనతార, సమంత, అనుష్క, తమన్నా, త్రిష, సాయి పల్లవి, కీర్తీ సురేష్, పూజా హెగ్డే, శ్రుతీహాసన్, నిత్యా మీనన్, సంయుక్తా మీనన్, రాశీ ఖన్నా, నిధీ అగర్వాల్, మెహరీన్... వంటి పలువురు హీరోయిన్లు 2024ని మిస్ అయ్యారు. ఆ వివరాల్లోకి...
202
రెండు సినిమాలతో జేజెమ్మ
తెలుగు చిత్ర పరిశ్రమలో జేజమ్మగా ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకున్నారు అనుష్క. ఆ మధ్య వరుస సినిమాలు చేసిన అనుష్క నాలుగేళ్లుగా కాస్త నెమ్మదించారు. 2020లో వచ్చిన ‘నిశ్శబ్దం’ సినిమా తర్వాత మూడేళ్ల అనంతరం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (2023) చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఆమె. అయితే 2024ని మాత్రం పూర్తిగా మిస్ అయ్యారు అనుష్క.
‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తర్వాత తెలుగులో ఆమె కమిటైన చిత్రం ‘ఘాటీ’. ఈ మూవీకి క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వేదం’ (2010) మంచి హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్‌లోని ‘ఘాటీ’ని యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. నవంబరు 7న అనుష్క పుట్టినరోజు సందర్భంగా ‘ఘాటీ’ సినిమా నుంచి విడుదల చేసిన ఆమె ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది.
ఒడిశాలోని ఒక మహిళ జీవితంలో జరిగిన వాస్తవ ఘటనల నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ రూ΄÷ందుతోంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఇదిలా ఉంటే ‘కథనార్–ది వైల్డ్ సోర్సెరర్’ అనే సినిమా ద్వారా మలయాళ పరిశ్రమలో ఎంట్రీ ఇస్తున్నారు అనుష్క. ‘ఘాటీ’, ‘కథనార్–ది వైల్డ్ సోర్సెరర్’ సినిమాలు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. ఈ రెండు సినిమాలతో 2025లో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు అనుష్క.
వచ్చే ఏడాదైనా...
సౌత్‌లోని స్టార్ హీరోయిన్ల జాబితాలో సమంతది ప్రత్యేక స్థానం. అందం, అభినయంతో దక్షిణాదిలోనే కాదు... ఉత్తరాదిలోనూ తనకంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారామె. ఆ మధ్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆమె ఈ మధ్య స్లో అయ్యారు. 2023లో ‘శాకుంతలం, ఖుషి’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ 2024లో మాత్రం వెండితెరపై కనిపించలేదు.
అయితే ‘సిటాడెల్ హనీ–బన్నీ’ అనే వెబ్ సిరీస్ ద్వారా వెబ్ ప్రేక్షకులను మాత్రం అలరించారామె. విజయ్ దేవరకొండకి జోడీగా సమంత నటించిన ‘ఖుషి’ సినిమా తర్వాత ఆమె కమిటైన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘మా ఇంటి బంగారం’. తన పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 28న ఈ సినిమాని ప్రకటించారు సమంత. అంతేకాదు... తన సొంత ప్రొడక్షన్ హౌస్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మించనున్నట్లు ఆమె ప్రకటించడం విశేషం.
బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. మెడలో నల్లపూసలు, చీర కట్టు, పెద్ద బొట్టుతో ఉన్న సమంత లుక్ చూస్తే ఆమె గృహిణి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. అయితే ఆమె చేతిలో గన్, ముఖం మీద రక్తపు మరకలు, ఆమె వెనకాల టెడ్డీ బేర్, స్టవ్ మీద ప్రెజర్ కుక్కర్... ఇవన్నీ చూస్తే ఈ సినిమాలో మరొక కోణం కూడా ఉందని స్పష్టం అవుతోంది. అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించలేదు. మరి 2025లో అయినా సమంత వెండితెర ప్రేక్షకులను అలరిస్తారా? లేదా అనేదానిపై స్పష్టత లేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ అనే హిందీ వెబ్ సిరీస్ చేస్తున్నారు సమంత.
డాక్యుమెంటరీతో మాత్రమే...
దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ అనగానే నయనతార పేరును టక్కున చెబుతారు ఆమె అభిమానులు. ఓ వైపు హీరోలకి జోడీగా కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ ఫుల్ స్వింగ్‌లో దూసుకెళుతున్నారీ బ్యూటీ. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు ఎనిమిది సినిమాలు ఉన్నాయి. వాటిల్లో ఐదు తమిళ, రెండు మలయాళ, ఒకటి కన్నడ చిత్రం ఉంది. కాగా చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వం వహించిన ‘గాడ్ ఫాదర్’ (2022) సినిమాలో చిరంజీవి సోదరిగా నటించారు నయనతార. ఆ చిత్రం విడుదలై రెండేళ్లు దాటినా మరో తెలుగు సినిమా కమిట్ కాలేదామె. ఇతర భాషల్లో ఫుల్ బిజీగా ఉండటం వల్లనో లేకుంటే సరైన కథ కుదరకనో ఆమె తెలుగు సినిమాకి పచ్చజెండా ఊపలేదు. ఆ విధంగా దక్షిణాదిలోనే అగ్ర కథానాయికగా దూసుకెళుతున్న నయనతార కూడా 2024లో ప్రేక్షకులను పలకరించలేక΄ోయారు. ఆమె నటించిన ఏ సినిమా కూడా ఈ ఏడాది విడుదల కాక΄ోవడంతో ఆమె ఫ్యాన్స్‌కి నిరాశ తప్పలేదు. అయితే 2025లో మాత్రం దాదాపు అరడజనుకు పైగా సినిమాలతో ఆమె ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే... ఓటీటీలో ప్రసారమవుతున్న ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీతో ఈ ఏడాది నయనతార కనిపించడం ఆమె అభిమానులకు ఓ చిన్న ఊరట.
ప్రత్యేక పాటతో...
చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకు పైగా ప్రయాణం త్రిషది. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో నటించి, తనకంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్‌ని సొంతం చేసుకున్నారామె. అందం, అభినయంలో ఇప్పటికీ నేటి తరం యువ హీరోయిన్లకు గట్టి ΄ోటీ ఇస్తున్నారు త్రిష. ఓ వైపు హీరోలకు జోడీగా నటిస్తూనే, మరోవైపు ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లోనూ నటిస్తూ బిజీగా దూసుకెళుతున్న ఆమె నటించిన ఏ చిత్రం కూడా ఈ ఏడాది విడుదల కాలేదు. అయితే విజయ్ హీరోగా రూ΄÷ందిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’ (గోట్) సినిమాలో మాత్రం ఓ ప్రత్యేక ΄ాటలో నటించారు త్రిష. అలాగే ‘బృంద’ అనే ఓ వెబ్ సిరీస్‌తో బుల్లితెర ప్రేక్షకులను పలకరించారామె. అవి మినహా 2024లో పూర్తి స్థాయిలో ఆమె ప్రేక్షకులను అలరించలేదు. అయితే వచ్చే ఏడాది పలు చిత్రాలతో తెరపై కనిపించనున్నారు. ప్రస్తుతం నాలుగు తమిళ చిత్రాలు, రెండు మలయాళ సినిమాలతో ΄ాటు తెలుగులో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు త్రిష. ‘స్టాలిన్’ (2006) సినిమా తర్వాత చిరంజీవి–త్రిష కలిసి నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’ కావడం విశేషం. ఇదిలా ఉంటే... 2025లో త్రిష నటించిన ఐదారు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా అని స్పష్టం అవుతోంది.
2023లో మూడు... ఈ ఏడాది నో
నటి, గాయని, మ్యూజిక్ కం΄ోజర్... ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు సొంతం చేసుకున్నారు శ్రుతీహాసన్. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా దూసుకెళుతున్నారామె. 2023లో తెలుగులో ఆమె నటించిన ‘వాల్తేరు వీరయ్య (చిరంజీవి), వీరసింహారెడ్డి (బాలకృష్ణ), సలార్: పార్ట్ 1– సీజ్‌ఫైర్ (ప్రభాస్) ’ వంటి సినిమాలు విడుదలయ్యాయి. ఆ మూడు సినిమాలతో గత ఏడాది హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ 2024లో మాత్రం తన అభిమానులను నిరాశపరిచారు. ఈ ఏడాది ఆమె నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ‘కూలీ’ చిత్రంలో నటిస్తున్నారు శ్రుతీహాసన్. అలాగే ‘చెన్నై స్టోరీ’లోనూ నటిస్తున్నారామె. ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ రెండు సినిమాలు 2025లో ప్రేక్షకుల ముందుకు వస్తాయని తెలుస్తోంది.
వచ్చే ఏడాది స్ట్రయిట్ సినిమాతో...
2021లో ‘లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, ‘విరాట పర్వం’ చిత్రాలతో తెలుగు తెరపై కనిపించారు సాయి పల్లవి. ఆ తర్వాత తెలుగులో స్ట్రయిట్ సినిమా ఒప్పుకోలేదు. 2022లో ఆమె నటించిన తమిళ చిత్రం ‘గార్గీ’ తెలుగులోనూ విడుదలైంది. ఇక తమిళ చిత్రం ‘అమరన్’ తెలుగులోనూ విడుదల కావడంతో ఈ ఏడాది ఆ విధంగా తెలుగు ప్రేక్షకులను పలకరించారీ బ్యూటీ. సాయి పల్లవి నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘తండేల్’ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. సో... 2025లో స్ట్రయిట్ తెలుగు చిత్రంలో కనిపిస్తారామె. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది.
వచ్చే ఏడాది నాలుగు చిత్రాలతో...
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో గోపికమ్మా, బుట్ట బొమ్మగా స్థానం సం΄ాదించుకున్నారు పూజా హెగ్డే. నాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ (2014) సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమయ్యారామె. పదేళ్ల కెరీర్‌లో మహేశ్‌బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, వరుణ్ తేజ్, అఖిల్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ వంటి హీరోలకి జోడీగా నటించారు పూజా హెగ్డే. ‘ఆచార్య’ (2022) సినిమాలో రామ్‌చరణ్‌తో జతకట్టిన ఈ బ్యూటీ తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. అయితే ‘ఎఫ్ 3’ చిత్రంలో ఓ ΄ాటలో నర్తించారు. 2023లో ఆమె నటించిన ఒకే ఒక హిందీ చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ రిలీజైంది. అయితే ఈ ఏడాది మాత్రం పూజ నటించిన ఏ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే ప్రస్తుతం ఆమె చేతిలో మాత్రం రెండు హిందీ సినిమాలు, రెండు తమిళ చిత్రాలున్నాయి. 2024 గ్యాప్‌ని 2025లో భర్తీ చేయనున్నారు పూజ. వచ్చే ఏడాది నాలుగు చిత్రాల్లో పూజా హెగ్డే కనిపించే చాన్స్ ఉంది.
ఇదిలా ఉంటే... తమన్నా, నిత్యా మీనన్, సంయుక్తా మీనన్, నిధీ అగర్వాల్, మెహరీన్ వంటి తారలు నటించిన ఏ భాషా చిత్రం కూడా 2024లో విడుదల కాలేదు. కీర్తీ సురేష్, రాశీ ఖన్నా, ప్రియమణి వంటి వారు 2024లో తెలుగు ప్రేక్షకులకు దూరమయ్యారు. కానీ, ఇతర భాషల ప్రేక్షకులను అలరించారు.
– డేరంగుల జగన్
Comments
Please login to add a commentAdd a comment