నవంబర్ మాదిరే డిసెంబర్ కూడా టాలీవుడ్‌ని నష్టాల్లో ముంచేసింది. పుష్పరాజ్ ఒక్కడే బాక్సాఫీస్‌ని షేక్ చేశాడు. మిగతావాళ్లంతా చడీచప్పుడు లేకుండా ఇయర్ ఎండ్‌ని ముగించారు.
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2(Pushpa 2) మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు తగ్గట్టే పుష్ప 2 మూవీ భారీ హిట్ అయింది. ఇప్పటి వరకు దాదాపు 1700 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది రికార్డు సృష్టిస్తోంది. సౌత్ కంటే నార్త్‌లో ఈ సినిమాకు భారీ స్పందన వస్తోంది. ప్రస్తుతం ఉన్న ఊపును బట్టి చూస్తే.. ఈజీగా 2000 కోట్ల క్లబ్‌లో చేరుతుందని ట్రేండ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటించగా, ఫహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, రావు రమేశ్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
పుష్పరాజ్ దెబ్బకి రెండు వారాల పాటు కొత్త సినిమాలేవి రిలీజ్ కాలేదు. డిసెంబర్ 15న ఫియర్ అనే మూవీ వచ్చింది. వేదిక ప్రధాన పాత్రలో నటించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్..ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఫియర్ రిలీజ్‌కు ఒక రోజు ముందు అంటే మిస్ యూ అంటూ సిద్ధార్థ్ తెలుగు ప్రేక్షకుల దగ్గరకు వచ్చాయి. అయితే సినిమాలో ఏదో మిస్ అయిందని ఆడియన్స్ తిరస్కరించారు.
ఇక డిసెంబర్ 20న బచ్చాల మల్లితో అల్లరి నరేశ్(Allari Naresh) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విలేజ్ బ్యాగ్రౌండ్, రా అండ్ రస్టిక్ వాతావరణం.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న సబ్జెక్ట్‌తో వచ్చినా..ఆడియన్స్ తిరస్కరించారు.
అదే రోజు(డిసెంబర్ 20) తమిళ మూవీ విడుదల పార్ట్ 2, హాలీవుడ్ ఫిల్మ్ ముఫాసా కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. విడుదల 2కు టాలీవుడ్‌లో సక్సెస్ టాక్ రాలేదు కానీ.. ముఫాసా మాత్రం ఆకట్టుకుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం సినిమాకు ప్లస్ అయింది. మరో కన్నడ చిత్రం యూఐ కూడా డిసెంబర్ 20వ తేదినే విడుదలైంది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ ఫ్లాప్‌ని మూటగట్టుకుంది.
ఇక ఈ ఏడాది క్రిస్మస్ పండగను టాలీవుడ్ మిస్ చేసుకుంది. ఈ పండక్కీ ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ కాలేదు. పుష్ప 2 కోసమే పెద్ద సినిమాలు క్రిస్మస్ బరి నుంచి తప్పుకున్నాయి. ఈ గ్యాప్‌ని ఓ చిన్న సినిమా యూజ్ చేసుకుంది. డిసెంబర్ 25న శ్రికాకుళం షెర్లాక్ హోమ్స్ అనే ఓ చిన్న చిత్రం విడుదైంది. వెన్నెల కిశోర్ టైటిల్ రోల్‌లో, అనన్య నాగళ్ల, రవితేజ మహద్యం ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ డిటెక్టివ్ కథ.. తెలుగు ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది.
ఈ ఏడాది చివరి వారం (డిసెంబర్ 27) డ్రింకర్ సాయి, లీగల్లీ వీర్, వారధి సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిల్లో డ్రింకర్ సాయిపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. కానీ రిలీజ్ తర్వాత ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేదని అంటున్నారు. ఇక మిగతా సినిమాలు రిలీజ్ అయిన విషయం కూడా అంతగా తెలియదు. మొత్తంగా డిసెంబర్ కూడా టాలీవుడ్‌కు నష్టాలనే మిగిల్చాయి. ఇక ఇప్పుడు ఆశలన్నీ సంక్రాంతి సినిమాలపైనే ఉన్నాయి. ఈ సంక్రాంతి బరిలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలయ్య ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాలు ఉన్నాయి. వీటిల్లో ఏది సంక్రాంతి హిట్‌గా నిలుస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment