‘రాజుగాడు’ సినిమా డైరెక్టర్ సంజనారెడ్డి
లెక్చరర్.. ఇంజినీర్.. ఓ డైరెక్టర్
ఆమె విద్యార్థులకు దిశా నిర్దేశం చేసిన లెక్చరర్.. కంప్యూటర్‌తో దోస్తీ చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. వార్తలతో మమేకమైన జర్నలిస్ట్.. మరిప్పుడు ఓ డైరెక్టర్. విభిన్న వృత్తుల్లో తనదైన ప్రతిభ చూపిన సంజనారెడ్డి మెగా ఫోన్ పట్టారు. ‘రాజుగాడు’ సినిమాతో వెండి తెరపై నవ్వులు పూయించేందుకు సిద్ధమయ్యారు. నేడు ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా ఆమె ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలివీ...
హైదరాబాద్ (శ్రీనగర్ కాలనీ) : మా స్వస్థలం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని వమరవల్లి గ్రామం. డిగ్రీ వరకు అక్కడే చదివాను. మాది వ్యవసాయ కుటుంబం. మేము ఇద్దరం అమ్మాయిలం. చిన్నప్పుడు ఇంట్లో న్యూస్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. సినిమాలు కూడా చూడలేదు. డిగ్రీ తర్వాత ఎమ్మెస్సీ మ్యాథమేటిక్స్ ఆంధ్రా యూనివర్సిటీలో చేశాను.
‘ఖుషీ’ ఎఫెక్ట్...
వేసవి సెలవుల కోసం వైజాగ్‌లోని బంధువుల ఇంటికి వెళ్లాం. అప్పుడే ‘ఖుషీ’ సినిమా విడుదలైంది. నాకు సినీ ప్రపంచాన్ని పరిచయం చేసింది ‘ఖుషీ’ సినిమానే. నెల రోజులు వైజాగ్‌లో ఉంటే సంగం–శరత్ థియేటర్‌లో 27సార్లు ఈ సినిమా చూశాను. ఆ సమయంలో విడుదలైన ‘ప్రియమైన నీకు’ ఏడుసార్లు చూశారు. ఖుషీ చిత్రంలో ప్రతి సీన్ నన్ను ప్రభావితం చేసింది. అప్పట్లో ఎక్కడ చూసినా పవన్‌కల్యాణ్ యాటిట్యూడ్‌తో ఉండేవాళ్లం. సినిమాలపై అమితమైన ఇష్టం ఇక్కడి నుంచే ప్రారంభమైంది.
ముచ్చటగా మూడు వృత్తుల్లో...
ఎమ్మెస్సీ పూర్తయిన తర్వాత ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు పాఠాలు బోధించాను. ఆరు నెలలు లెక్చరర్‌గా పని చేశాక, హైదరాబాద్ వచ్చేశాను. సిటీలో మైక్రోసాఫ్ట్‌లో 8 నెలలు పని చేశాను. సాఫ్ట్‌వేర్ సాఫ్ట్‌గా ఉండడంతో.. సినిమాల మీద ఆసిక్తితో న్యూస్ రీడర్ అవుదామని ఎలక్ట్రానిక్ మీడియాలో చేరాను. కానీ జర్నలిస్ట్‌గా ప్రయాణం ప్రారంభిచాను. రెండేళ్లు మీడియాలో చేశాను. ఎంతోమంది బాలీవుడ్, టాలీవుడ్ నటులను ఇంటర్వ్యూ చేయడంతో భయం పోయింది. టాప్ హీరోలు, డైరెక్టర్లతో సరదాగా మాట్లాడేదాన్ని. అప్పుడు పూరి జగన్నాథ్ ఇండస్ట్రీకి రావచ్చుగా... అని సలహా ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని నెలలకు డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ ‘రౌడీ’ సినిమాకు ఓ 10 రోజులు అసిస్టెంట్‌గా పనిచేశాను. ఆ తర్వాత నటి అమల అక్కినేనితో యాడ్ ఫిలిం చేశాను. అది సక్సెస్ అవడంతో దర్శకత్వంపై అడుగులు వేసి కథ రాసుకున్నాను.
‘రాజుగాడు’ షూటింగ్‌లో...
ఇదీ ‘రాజుగాడు’...
కొద్దిపాటి అనుభవంతో కథలు రాసుకుంటున్న సమయంలో ఓ ఫ్రెండ్ ద్వారా రాజ్‌తరుణ్ పరిచయమయ్యారు. ‘క్లెప్టోమేనియా’ కాన్సెప్ట్‌తో రాసుకున్న కామెడీ కథ రాజ్‌తరుణ్‌కు నచ్చడంతో నిర్మాత అనిల్ సుంకరను కలిశాం. ఆయన మా కథను నమ్మి, సినిమా నిర్మించేందుకు ముందుకొచ్చారు. యూనిట్ సభ్యుల సహకారంతో పూర్తిస్థాయి కామెడీతో సినిమాను రూపొందించాం. ఇది తప్పకుండా అందరినీ మెప్పిస్తుందని ఆశిస్తున్నాను.
‘కరణం’ బయోపిక్ తీస్తా...
నాకు కామెడీ, యాక్షన్ సినిమాలు చాలా ఇష్టం. యాక్షన్, పైట్స్ ఉంటేనే సినిమా మరింత ఇష్టంగా చూస్తాను. కరణం మల్లేశ్వరి బయోపిక్ తీయాలని ఉంది. కథ కూడా సిద్ధం చేసుకున్నాను. కథానాయిక కోసం ఎదురుచూస్తున్నాను. ఆమె స్వర్ణం ఎలా చేజార్చుకుంది? ఆమె కష్టాలు–ఇష్టాలు ప్రజలకు తెలియజేయాలి. హిందీ, తెలుగుతో పాటు మరిన్ని భాషల్లో ఈ సినిమాను నిర్మించాలని ఉంది. ఇక నటుల్లో పవన్‌కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, సిటీలో ట్యాంక్‌బండ్ ఇష్టం. జర్నలిస్ట్‌గా చేసినప్పుడు హైదరాబాద్ మొత్తం చుట్టేశాను.
మహిళా దర్శకులు రావాలి...
మహిళల్లో చాలా ప్రతిభ ఉంది. కానీ దర్శకత్వం వైపు అడుగులు వేయడం లేదు. డైరెక్షన్‌లో స్త్రీ–పురుష భేదం అనేది ఉండదు. సరికొత్త ఆలోచనలతో ఇష్టంగా పనిచేస్తే చాలు. మహిళలు భయాన్ని వదిలి, కష్టపడితే కచ్చితంగా ఇందులో రాణించొచ్చు. ముందుగా ఇండస్ట్రీ అనే భయాన్ని వదిలిపెట్టాలి. మేం చేస్తామని ముందుకు రావాలి. నేను ఒంటరిగా ఐదు దేశాలు చుట్టేశాను. దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్న సమయంలో దాచుకున్న డబ్బుతో కారు కొనాలా? ట్రావెల్‌కి వెళ్లాలా? అనే సందిగ్ధంలో ట్రావెలింగ్‌కి వెళ్లాను. సింగపూర్, చైనా, మలేసియా, బ్యాంకాక్‌లను చుట్టేశాను.
Comments
Please login to add a commentAdd a comment