
మున్నాభాయ్ ఈజ్ బ్యాక్!
సంజయ్‌దత్ జైలు నుంచి విడుదలై మూడు నెలలైంది. మరి... కెమెరా ముందుకు ఎప్పుడు వస్తారు? అని ఆయన అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ సమయం వచ్చేసింది. చకచకా సినిమాలు చేసేయాలని సంజయ్ దత్ ఫిక్స్ అయిపోయారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ చిత్రంలో సంజయ్‌దత్‌కు మంచి ఫైట్లు ఉన్నాయట. ఆగస్టులో ప్రారంభం కానున్న ఈ సినిమా షూటింగ్ కోసం సంజయ్‌దత్ ఎన్‌ఎస్‌జీ కమాండో తరహాలో మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. అయితే ఈలోగా ఆయన ఓ యాడ్‌లో కనిపించే అవకాశం ఉంది.
ముంబైలోని మధ్ దీవిలో జరుగుతున్న ఈ యాడ్ షూటింగ్ కోసం కెమెరా ముందుకు వచ్చారు సంజయ్. దీంతో ఆ ప్రాంతం సందడిగా మారిపోయింది. అక్కడి స్థానికులు తమ ప్రాంతానికి సంజయ్‌దత్ వచ్చారని తెలిసి, ఆయన్ను చూడటానికి పోటీ పడ్డారు. సంజయ్ ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ, వాళ్లతో ఫొటోలు దిగి, ఆనందపరిచారట. కొంత విరామం తర్వాత సంజయ్ నటుడిగా మళ్లీ మేకప్ వేసుకోవడంతో ఆయన అభిమానులు ‘మున్నాభాయ్ ఈజ్ బ్యాక్’ అంటూ సంబరపడిపోతున్నారు.