అక్రమ ఆయుధాల కేసులో ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడి పుణె ఎరవాడ జైల్లో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తనకు పెరోల్ గడువును పెంచాల్సిందిగా చేసిన విజ్ఞప్తికి అధికారులు సానుకూలంగా స్పందించారు. సంజయ్ కోరిక మేరకు మరో 14 రోజులు మెడికల్ లీవ్ మంజూరు చేశారు. ఆయన కాలికి చికిత్స చేయించుకునేందుకు కోసం ఈ నెల 1న 14 రోజుల మంజూరు చేశారు. ఈ గడువు నేటితో ముగియడంతో సంజయ్ పెరోల్ పొడగించాలని కోరాడు. కుటుంబంతో గడిపేందుకు, కాలికి చికిత్స చేయించుకోవడానికి మరికొంత సమయం అవసరమని ఆయన విన్నవించాడు.
అక్రమ ఆయుధాల కేసులో ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడిన సంజయ్ దత్.. ఈ సంవత్సరం మే 16వ తేదీ నుంచి పుణెలోని ఎరవాడ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ముంబై పేలుళ్ల సమయంలో సంజయ్ వద్ద కూడా కొన్ని ఆయుధాలు లభించాయి. వాటిలో ఏకే-57 లాంటి రైఫిళ్లు కూడా ఉన్నాయి. ఆత్మరక్షణ కోసమే వాటిని ఉంచుకున్నట్లు చెప్పినా, వాటికి తగిన లైసెన్సు లేకపోవడంతో సంజూబాబాపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు సుదీర్ఘ కాలం పట్టడంతో ఇటీవలే సంజయ్దత్ జైల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే.