సంజయ్ దత్ జైలు శిక్ష తగ్గించే యోచనలో కేంద్రం
అక్రమ ఆయుధాల కేసులో జైలు జీవితం గడుపుతున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్కు శిక్ష తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ విషయంపై మహారాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. సంజయ్కు శిక్ష తగ్గించాలని పలువురు కాంగ్రెస్ నాయకులు ఇంతకుముందే కేంద్రాన్ని కోరారు. కేంద్రంలోనూ, మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నందున సంజయ్కు ఊరట లభించే అవకాశముంది.
ముంబై పేలుళ్ల సమయంలో సంజయ్ వద్ద కొన్ని ఆయుధాలు లభించాయి. వాటిలో ఏకే-57 లాంటి రైఫిళ్లు కూడా ఉన్నాయి. ఈ కేసులో సంజయ్కు ఐదేళ్ల జైలు శిక్షపడిన సంగతి తెలిసిందే. గత మే 26 నుంచి పుణె ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా ఇటీవల పెరోల్పై బయటకువచ్చాడు. సంజయ్ కాలికి చికిత్స చేయించుకోవడానికి, కుటుంబంతో గడిపేందుకు సెలవు మంజూరు చేశారు.