‘‘హాస్యనటులు హీరోగా సక్సెస్ కాలేరనే మాటలను అంతగా నమ్మను. మంచి కథ, ఆలోచనా విధానం, సరైన ప్రణాళిక ఉంటే సక్సెస్ కావొచ్చు’’ అని సప్తగిరి అన్నారు. అరుణ్ పవార్ దర్శకత్వంలో సప్తగిరి హీరోగా నటించిన చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. వైభవి జోషి కథానాయికగా నటించారు. నరేంద్ర యడ్ల, జీవీఎన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మయ్య తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 14న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సప్తగిరి చెప్పిన విశేషాలు...
►కథ బాగాలేకపోతే ఏ సినిమా ఆడే పరిస్థితి లేదు. కథపై నమ్మకంతోనే ఈ సినిమా చేశా. ఇందులో గోవింద అనే దొంగ పాత్ర పోషించాను. క్యాన్సర్ బాధితులకు న్యాయం చేయాలనే ఓ దొంగ కథ ఇది. ఓ వజ్రం చుట్టూ కథ అంతా తిరుగుతుంది. ఇందులో మూడు గెటప్స్‌లో కనిపిస్తాను. కుక్క, పాము పాత్రలు ఈ చిత్రంలో ఆసక్తికరంగా ఉంటాయి. కర్నూలులోని బెలూన్‌గుహల్లో ప్రాణాలకు తెగించి సన్నివేశాలను చిత్రీకరించాం.
►హీరోగా ఇది నా మూడో సినిమా. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్‌ఎల్‌బీ’ సినిమాలు సందేశాత్మకం. ఈ సినిమాలోనూ క్యాన్సర్ బాధితుల సమస్యలను ప్రస్తావించాం. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ తీసిన అరుణ్ పవార్‌తో ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఓ సెంటిమెంట్‌లా కూడా భావిస్తున్నాను.
►నా గత సినిమాల్లో కామెడీ కంటెంట్ కాస్త తక్కువగా ఉండటానికి కారణం నాలోని అసిస్టెంట్ డైరెక్టరే. నా సినిమాలో ఏదో ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను. అలాగని డైరెక్షన్‌లో ఇన్‌వాల్వ్ కాను. నా అభిప్రాయాలు, సూచనలు పంచుకుంటానంతే. ఈ సినిమాలో సందేశంతో పాటు మంచి కామెడీ ఉంది. ఇంటర్వెల్ తర్వాత ‘జబర్దస్త్’ టీమ్ హంగామా ఉంటుంది.
►నిజానికి నేను కమెడియన్ అవుదామని ఇండస్ట్రీలోకి రాలేదు. ‘సింధూరం, భారతీయుడు’ సినిమాలు చూసి ప్రేరణ పొంది వచ్చాను. అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాను. కానీ నాకు కమెడియన్‌గా అవకాశాలు వచ్చాయి. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రం ఒక్కటే నాలో మంచి కమెడియన్ ఉన్నాడని నాకు తెలిసేలా చేసింది. హీరోగా మారిన తర్వాత నేను హాస్య పాత్రలు చేయనని వారే (దర్శక–నిర్మాతలను ఉద్దేశిస్తూ) డిసైడ్ అయ్యారు. కమెడియన్ పాత్రలు చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. ఇక సునీల్ అన్నగురించి నేను ప్రస్తావించలేను. అందరి జీవితాలు ఒకేలా ఉండవు. నాకు చేతనైనంతలో మా ఊరికి ఏదో సాయం చేస్తున్నాను. ఒక ఊరిని దత్తత తీసుకునేంత స్థాయికి రాలేదు. రావాలని కోరుకుంటున్నాను.
►ప్రస్తుతం సందీప్‌కిషన్ సినిమాలో హాస్య నటుడిగా చేస్తున్నాను. నేను హీరోగా ‘దెయ్యం పట్టింది, దెయ్యం పట్టింది 2’ సినిమాల్లో నటించబోతున్నాను. మరో రెండు సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వివరాలు వెల్లడిస్తా.
హీరోగానే కాదు... కామెడీ పాత్రలూ చేస్తా
Published Wed, Jun 12 2019 4:23 AM | Last Updated on Wed, Jun 12 2019 4:23 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment