బ్రహ్మయ్య, అరుణ్ పవార్, సప్తగిరి, జీవీఎన్ రెడ్డి
‘‘వజ్రం చుట్టూ తిరిగే కథ ‘వజ్ర కవచధర గోవింద’. ఇందులో నా పాత్ర పేరు గోవింద. వజ్రం వల్ల గోవిందకు నష్టం జరిగిందా? లాభం జరిగిందా? అన్నదే కథ. క్లీన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది’’ అని సప్తగిరి అన్నారు. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్‌ఎల్‌బీ’ చిత్రాల తర్వాత సప్తగిరి హీరోగా నటించిన చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. వైభవీ జోషీ కథానాయికగా నటించారు. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ ఫేమ్ అరుణ్ పవార్ దర్శకత్వం వహించారు. శివ శివమ్ ఫిలింస్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా మే 17న విడుదల కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సప్తగిరి మాట్లాడుతూ– ‘‘మన లక్ష్యం మంచిది అయినా వెళ్లేదారి కరెక్టుగా ఉన్నప్పుడే దేవుడి ఆశీస్సులు ఉంటాయని చెప్పే చిత్రమిది. కర్నూలు వద్ద ఉన్న బెలూన్ గుహల్లో ఆక్సిజన్ తక్కువ ఉన్న ప్రాంతంలో ప్రాణాలకు తెగించి కొన్ని సన్నివేశాలు తీశాం. ఈ సన్నివేశాల్లో వైభవీ జోషీ కూడా ధైర్యంగా పాల్గొన్నారు. తొలుత ఈ చిత్రానికి ‘సప్తగిరీశా గోవింద’ అని టైటిల్ అనుకున్నాం.
ప్రస్తుతం సమాజంలో క్యాన్సర్ వ్యాధి బాధితులు ఎక్కువ మంది ఉన్నారు. పేద, మధ్య తరగతి వారు ఖరీదైన వైద్యం చేయించుకోలేక చనిపోతున్నారు. వీళ్లందరికీ తక్కువ ధరకే వైద్యం అందాలంటే మండలానికి ఒక క్యాన్సర్ ఆస్పత్రి ఉండాలని మా చిత్రం ద్వారా చూపిస్తున్నాం’’ అన్నారు. ‘‘వజ్రాన్ని గోవింద కవచంలా ఎలా ధరించాడు? దాంతో తన ఊరును ఏ విధంగా కాపాడుకున్నాడు? అన్నదే చిత్రకథ. వినోదం, ఎమోషన్స్, యాక్షన్, ఫాంటసీ.. ఇలా అన్ని అంశాలు ఉన్నాయి. ఈ పాత్రకి సప్తగిరి కాకుండా వేరెవరూ సరిపోరు’’ అన్నారు అరుణ్ పవార్.
‘‘సీడెడ్‌లో ఇప్పటి వరకూ ఎన్నో సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన నేను తొలిసారి ‘వజ్ర కవచధర గోవింద’ చిత్రం ప్రపంచవ్యాప్త విడుదల హక్కులను సింగిల్ పేమెంట్‌తో సొంతం చేసుకున్నా’’ అని డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మయ్య అన్నారు. ‘‘మాకిది తొలి చిత్రం. సినిమా చేస్తే ఎంత డబ్బులొస్తాయో? రావో? తెలియదు. కానీ, సప్తగిరి చెప్పడంతో, తనపై ఉన్న నమ్మకంతో ఈ సినిమా చేశాం’’ అని నిర్మాత జీవీఎన్ రెడ్డి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: ప్రవీణ్ వనమాలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సలాన బాలగోపాలరావు.
Comments
Please login to add a commentAdd a comment