arun pawar
-
‘వజ్ర కవచధర గోవింద’ మూవీ రివ్యూ
టైటిల్ : వజ్ర కవచధర గోవింద జానర్ : కామెడీ డ్రామా తారాగణం : సప్తగిరి, వైభవీ జోషి, జస్పర్, అర్చన, విరేన్ తంబిదొరై సంగీతం : బల్గానిన్ దర్శకత్వం : అరుణ్ పవర్ నిర్మాత : నరేంద్ర యడ్ల, జీవీఎన్ రెడ్డి కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి తరువాత హీరోగా మారిన సప్తగిరి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా వజ్ర కవచధర గోవింద. సప్తగిరి హీరోగా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ సినిమాను తెరకెక్కించిన అరుణ్ పవార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కామెడి స్టార్‌ను మాస్ హీరోగా మార్చిందా..? హీరో పాత్రకు సప్తగిరి ఎంతవరకు న్యాయం చేశాడు..? కథ : సోమల అనే చిన్న గ్రామంలో ఉండే గోవింద్(సప్తగిరి) తన గ్రామ ప్రజలు పడే కష్టాలు చూడలేక దొంగగా మారతాడు. ఊళ్లో ఒక్కొక్కరు క్యాన్సర్‌తో చనిపోతుండటంతో వారిని కాపాడేందుకు చాలా డబ్బు కావాలనే ఉద్దేశంతో ఓ నిధిని వెతికేందుకు కొంతమందితో ఒప్పందం చేసుకుంటాడు. ఈ ప్రయత్నంలో వారికి 150 కోట్ల విలువైన మహేంద్ర నీలం అనే వజ్రం దొరుకుతుంది. ఆ వజ్రాన్ని అమ్మి పంచుకోవాలనుకుంటారు గోవింద్ అండ్ బ్యాచ్. అయితే వజ్రాన్ని ఎవరికీ దొరక్కుండా దాచిపెట్టిన గోవింద్ ఓ ప్రమాదంలో గతం మర్చిపోతాడు. వజ్రాన్ని దాచిన చోటు కూడా మర్చిపోతాడు. చివరకు గోవింద్‌కు గతం గుర్తుకు వచ్చిందా..? వజ్రాన్ని తిరిగి తీసుకొచ్చాడా..? ఈ కథతో బంగారప్పకు ఉన్న సంబంధం ఏంటి.? అన్నదే మిగతా కథ. నటీనటులు : కమెడియన్‌గా ఆకట్టుకున్న సప్తగిరి హీరోగా ప్రేక్షకులను కన్విన్స్ చేయలేకపోయాడు. ముఖ్యంగా యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌లో సప్తగిరి నటన తన ఇమేజ్, బాడీ లాంగ్వేజ్‌కు ఏ మాత్రం సూట్ అయినట్టుగా అనిపించదు. కామెడీ సీన్స్‌లో ఆకట్టుకున్నా.. అది పూర్తిగా సినిమాను నిలబెట్టే స్థాయిలో లేదు. హీరోయిన్ పాత్రకు ఏ మాత్రం ఇంపార్టెన్స్ లేకపోవటంతో వైభవీ జోషికి నటనకు పెద్దగా ఆస్కారం లేకుండా పోయింది. లుక్ పరంగానూ వైభవీ ఆకట్టుకోలేకపోయారు. విలన్‌గా జస్పర్ లుక్ బాగుంది. ఇతర పాత్రలో అర్చన, టెంపర్ వంశీ, జాన్ కొట్టోలి, విరేన్ తంబిదొరై తమ పరిధి మేరకు పరవాలేదనిపించారు. విశ్లేషణ : సప్తగిరికి మాస్ ఇమేజ్ తీసుకువచ్చేందుకు ప్రయత్నించిన దర్శకుడు అరుణ్ పవార్ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టాడు. సప్తగిరి ఇమేజ్ను పట్టించుకోకుండా ఇంట్రో సాంగ్, స్లోమేషన్ షాట్స్, యాక్షన్ సీన్స్‌తో సినిమాను తెరకెక్కించాడు. కథా కథనాల విషయంలోనూ దర్శకుడు తడబడ్డాడు. హీరో పాత్రను ఎస్టాబ్లిష్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకున్న దర్శకుడు, అసలు కథ మొదలయిన తరువాత కూడా కథనాన్ని నెమ్మదిగా నడిపించాడు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు, పాటలు ఏ మాత్రం ఆసక్తికరంగా లేకపోగా అసలు కథకు బ్రేకులు వేస్తూ విసిగిస్తాయి. సినిమాటోగ్రఫి ఆకట్టుకుంటుంది. సంగీతం, ఎడిటింగ్, నిర్మాణ విలువలు నిరాశపరుస్తాయి. ప్లస్ పాయింట్స్ : కొన్ని కామెడీ సీన్స్ మైనస్ పాయింట్స్ : కథా కథనాలు దర్శకత్వం ఎడిటింగ్ నిర్మాణ విలువలు - సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
అదిరిపోయిందిరా బాబు అంటారు
సప్తగిరి హీరోగా అరుణ్ పవార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘వజ్ర కవచధర గోవింద’. ఇందులో వైభవీ జోషి కథానాయికగా నటించారు. నరేంద్ర యడ్ల, జీవీఎన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా సప్తగిరి మాట్లాడుతూ– ‘‘సినిమా పట్ల బాగా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. సినిమాపై చాలా పాజిటివ్ వైబ్ ఉంది. దాదాపు 300 థియేటర్స్‌లో సినిమాను విడుదల చేస్తున్నాం. సినిమా పరిశ్రమలో ప్రొడ్యూసర్స్ దైవస్థానంలో ఉంటారని అంటారు. ఆ స్థానంలో ఉండి మాకు సహకరించిన నిర్మాతలకు ధన్యవాదాలు. హీరోయిన్గా వైభవి జోషి బాగా నటించారు. ఆమెకు మరిన్ని అవకాశాలు రావాలి. అలాగే మా సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన శ్రీకాంత్ అన్నకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో కామెడీతోపాటు మంచి ఎమోషన్ అంతకు మించిన బలమైన కథ ఉంది. మంచి క్లైమాక్స్ కుదిరింది. నిర్మాతలు సపోర్ట్ చేశారు. వారికి రెండు రోజుల్లోనే డబ్బులు వస్తాయి. సినిమా చూసిన వారు అదిరిపోయిందిరా బాబు అని అంటారు’’ అన్నారు అరుణ్ పవార్. ‘‘కష్టపడి సినిమా చేశాం. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు జీవీఎన్ రెడ్డి. హీరోయిన్ వైభవి జోషి, నిర్మాత నరేంద్ర, నటులు మంజు, రాజేంద్రన్, రాజేష్, ప్రసాద్ పాల్గొన్నారు. -
హీరోగానే కాదు... కామెడీ పాత్రలూ చేస్తా
‘‘హాస్యనటులు హీరోగా సక్సెస్ కాలేరనే మాటలను అంతగా నమ్మను. మంచి కథ, ఆలోచనా విధానం, సరైన ప్రణాళిక ఉంటే సక్సెస్ కావొచ్చు’’ అని సప్తగిరి అన్నారు. అరుణ్ పవార్ దర్శకత్వంలో సప్తగిరి హీరోగా నటించిన చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. వైభవి జోషి కథానాయికగా నటించారు. నరేంద్ర యడ్ల, జీవీఎన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మయ్య తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 14న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సప్తగిరి చెప్పిన విశేషాలు... ►కథ బాగాలేకపోతే ఏ సినిమా ఆడే పరిస్థితి లేదు. కథపై నమ్మకంతోనే ఈ సినిమా చేశా. ఇందులో గోవింద అనే దొంగ పాత్ర పోషించాను. క్యాన్సర్ బాధితులకు న్యాయం చేయాలనే ఓ దొంగ కథ ఇది. ఓ వజ్రం చుట్టూ కథ అంతా తిరుగుతుంది. ఇందులో మూడు గెటప్స్‌లో కనిపిస్తాను. కుక్క, పాము పాత్రలు ఈ చిత్రంలో ఆసక్తికరంగా ఉంటాయి. కర్నూలులోని బెలూన్గుహల్లో ప్రాణాలకు తెగించి సన్నివేశాలను చిత్రీకరించాం. ►హీరోగా ఇది నా మూడో సినిమా. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బీ’ సినిమాలు సందేశాత్మకం. ఈ సినిమాలోనూ క్యాన్సర్ బాధితుల సమస్యలను ప్రస్తావించాం. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ తీసిన అరుణ్ పవార్‌తో ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఓ సెంటిమెంట్లా కూడా భావిస్తున్నాను. ►నా గత సినిమాల్లో కామెడీ కంటెంట్ కాస్త తక్కువగా ఉండటానికి కారణం నాలోని అసిస్టెంట్ డైరెక్టరే. నా సినిమాలో ఏదో ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను. అలాగని డైరెక్షన్లో ఇన్వాల్వ్ కాను. నా అభిప్రాయాలు, సూచనలు పంచుకుంటానంతే. ఈ సినిమాలో సందేశంతో పాటు మంచి కామెడీ ఉంది. ఇంటర్వెల్ తర్వాత ‘జబర్దస్త్’ టీమ్ హంగామా ఉంటుంది. ►నిజానికి నేను కమెడియన్ అవుదామని ఇండస్ట్రీలోకి రాలేదు. ‘సింధూరం, భారతీయుడు’ సినిమాలు చూసి ప్రేరణ పొంది వచ్చాను. అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాను. కానీ నాకు కమెడియన్‌గా అవకాశాలు వచ్చాయి. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రం ఒక్కటే నాలో మంచి కమెడియన్ ఉన్నాడని నాకు తెలిసేలా చేసింది. హీరోగా మారిన తర్వాత నేను హాస్య పాత్రలు చేయనని వారే (దర్శక–నిర్మాతలను ఉద్దేశిస్తూ) డిసైడ్ అయ్యారు. కమెడియన్ పాత్రలు చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. ఇక సునీల్ అన్నగురించి నేను ప్రస్తావించలేను. అందరి జీవితాలు ఒకేలా ఉండవు. నాకు చేతనైనంతలో మా ఊరికి ఏదో సాయం చేస్తున్నాను. ఒక ఊరిని దత్తత తీసుకునేంత స్థాయికి రాలేదు. రావాలని కోరుకుంటున్నాను. ►ప్రస్తుతం సందీప్‌కిషన్ సినిమాలో హాస్య నటుడిగా చేస్తున్నాను. నేను హీరోగా ‘దెయ్యం పట్టింది, దెయ్యం పట్టింది 2’ సినిమాల్లో నటించబోతున్నాను. మరో రెండు సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వివరాలు వెల్లడిస్తా. -
మా ఇద్దరి విజన్ ఒక్కటే
‘‘మన లక్ష్యం మంచిది అయినా వెళ్లేదారి కరెక్టుగా ఉన్నప్పుడే దేవుడి ఆశీస్సులు ఉంటాయని చెప్పే చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. ఈ సినిమా కథ వజ్రం చుట్టూ తిరుగుతుంది. గోవిందు అనే దొంగ తన ఊరికోసం ఏం చేశాడన్నదే కథ. దీనికితోడు గోవింద అన్నది దేవుడి పేరు కావడంతో ‘వజ్ర కవచధర గోవింద’ అనే టైటిల్ పెట్టాం’’ అని డైరెక్టర్ అరుణ్ పవార్ అన్నారు. సప్తగిరి, వైభవీ జోషీ జంటగా నటించిన చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ ఫేమ్ అరుణ్ పవార్ దర్శకత్వం వహించారు. నరేంద్ర యడ్ల, జీవీఎన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మయ్య ఈనెల 14న విడుదల చేస్తున్నారు. అరుణ్‌పవార్ మాట్లాడుతూ– ‘‘మాది నెల్లూరు.. ఇంటర్ తర్వాత హైదరాబాద్ వచ్చి విజువల్ ఎఫెక్ట్స్ కోర్సు చేశా. డైరెక్టర్ త్రివిక్రమ్‌గారి వద్ద ‘అతడు’ చిత్రం నుంచి ‘అ..ఆ’ సినిమా వరకూ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో పనిచేశా. దర్శకత్వంపై ఇష్టంతో ‘బెస్ట్ యాక్టర్స్’ సినిమాని తీశా. అది అనుకున్నంత హిట్ అవలేదు. ఆ తర్వాత తీసిన ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ మంచి హిట్ అయింది. అందుకే ఈ చిత్రాన్ని నా తొలి సినిమాగా భావిస్తా. నేను ఏ డైరెక్టర్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేయలేదు. పదేళ్లలో దాదాపు 100 సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ చేశా. షూటింగ్టైమ్లో డైరెక్టర్స్‌తో కలిసి ఉండటంతో మేకింగ్, డైరెక్షన్‌పై అవగాహన ఉంది. నేను చేసిన ఓ షార్ట్ ఫిల్మ్ నచ్చిన త్రివిక్రమ్‌గారు భవిష్యత్తులో మంచి డైరెక్టర్ అవుతావన్నారు. అంతేకాదు.. మేకింగ్ టెక్నిక్స్, కథలు రాసుకోవడం ఎలాగో చెప్పారాయన. పైగా మా ఇద్దరి విజన్ ఒక్కటే. అందుకే నా గురువుగా ఆయన్ని భావిస్తాను. వినోదాత్మకంగా రూపొందిన ‘వజ్ర కవచధర గోవింద’ చిత్రంలో భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ అన్నవి ఓ హాబీలా చేస్తా. విజువల్ ఎఫెక్ట్స్ కంటే డైరెక్షన్ మోస్ట్ చాలెంజింగ్ విజన్ అనుకుంటున్నా. ఓ ప్రేమ కథ రెడీ చేశా. డైరెక్టర్ బాబీగారు ఆ సినిమా నిర్మిస్తారు. ఇందు లో సాయిధరమ్ తేజ్ హీరో అనుకుంటున్నాం’’ అన్నారు. -
ప్రాణాలకు తెగించి చేశాం
‘‘వజ్రం చుట్టూ తిరిగే కథ ‘వజ్ర కవచధర గోవింద’. ఇందులో నా పాత్ర పేరు గోవింద. వజ్రం వల్ల గోవిందకు నష్టం జరిగిందా? లాభం జరిగిందా? అన్నదే కథ. క్లీన్ ఎంటర్టైనర్గా ఉంటుంది’’ అని సప్తగిరి అన్నారు. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బీ’ చిత్రాల తర్వాత సప్తగిరి హీరోగా నటించిన చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. వైభవీ జోషీ కథానాయికగా నటించారు. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ ఫేమ్ అరుణ్ పవార్ దర్శకత్వం వహించారు. శివ శివమ్ ఫిలింస్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా మే 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సప్తగిరి మాట్లాడుతూ– ‘‘మన లక్ష్యం మంచిది అయినా వెళ్లేదారి కరెక్టుగా ఉన్నప్పుడే దేవుడి ఆశీస్సులు ఉంటాయని చెప్పే చిత్రమిది. కర్నూలు వద్ద ఉన్న బెలూన్ గుహల్లో ఆక్సిజన్ తక్కువ ఉన్న ప్రాంతంలో ప్రాణాలకు తెగించి కొన్ని సన్నివేశాలు తీశాం. ఈ సన్నివేశాల్లో వైభవీ జోషీ కూడా ధైర్యంగా పాల్గొన్నారు. తొలుత ఈ చిత్రానికి ‘సప్తగిరీశా గోవింద’ అని టైటిల్ అనుకున్నాం. ప్రస్తుతం సమాజంలో క్యాన్సర్ వ్యాధి బాధితులు ఎక్కువ మంది ఉన్నారు. పేద, మధ్య తరగతి వారు ఖరీదైన వైద్యం చేయించుకోలేక చనిపోతున్నారు. వీళ్లందరికీ తక్కువ ధరకే వైద్యం అందాలంటే మండలానికి ఒక క్యాన్సర్ ఆస్పత్రి ఉండాలని మా చిత్రం ద్వారా చూపిస్తున్నాం’’ అన్నారు. ‘‘వజ్రాన్ని గోవింద కవచంలా ఎలా ధరించాడు? దాంతో తన ఊరును ఏ విధంగా కాపాడుకున్నాడు? అన్నదే చిత్రకథ. వినోదం, ఎమోషన్స్, యాక్షన్, ఫాంటసీ.. ఇలా అన్ని అంశాలు ఉన్నాయి. ఈ పాత్రకి సప్తగిరి కాకుండా వేరెవరూ సరిపోరు’’ అన్నారు అరుణ్ పవార్. ‘‘సీడెడ్‌లో ఇప్పటి వరకూ ఎన్నో సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన నేను తొలిసారి ‘వజ్ర కవచధర గోవింద’ చిత్రం ప్రపంచవ్యాప్త విడుదల హక్కులను సింగిల్ పేమెంట్‌తో సొంతం చేసుకున్నా’’ అని డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మయ్య అన్నారు. ‘‘మాకిది తొలి చిత్రం. సినిమా చేస్తే ఎంత డబ్బులొస్తాయో? రావో? తెలియదు. కానీ, సప్తగిరి చెప్పడంతో, తనపై ఉన్న నమ్మకంతో ఈ సినిమా చేశాం’’ అని నిర్మాత జీవీఎన్ రెడ్డి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: ప్రవీణ్ వనమాలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సలాన బాలగోపాలరావు. -
నవ్వులు పంచే దొంగ
అతని పేరు గోవిందు. పేరుకి ఫన్నీ దొంగ అయినా అతనికో లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధన కోసం ఏం చేశాడనే కథతో రూపొందుతోన్న చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. సప్తగిరి, వైభవీ జోషీ జంటగా అరుణ్ పవార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. అరుణ్ పవార్ మాట్లాడుతూ–‘‘సప్తగిరితో నేను తెరకెక్కించిన ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. తాజాగా రూపొందిస్తున్న ‘వజ్ర కవచధర గోవింద’ సినిమా అంతకు మించి సక్సెస్ కావాలనే తపనతో కృషి చేస్తున్నాం. కడుపుబ్బా నవ్వించే అంశాలతోపాటు, మంచి యాక్షన్, ఎమోషన్, ఇతర వాణిజ్య అంశాలు మెండుగా ఉంటాయి. మా నిర్మాతలు కొత్తవారైనా ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు’’ అన్నారు. ‘‘హిలేరియస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. 80 శాతం షూటింగ్ పూర్తయింది. మిగిలిన సన్నివేశాలను కర్ణాటకలోని ఒక గుడిలో తెరకెక్కిస్తాం’’ అని నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి అన్నారు. ఈ చిత్రానికి కథ: జిటిఆర్ మహేంద్ర, సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: ప్రవీణ్ వనమాలి, ఎడిటింగ్: కిషోర్ మద్దాలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సలాన బాలగోపాలరావు. -
హీరోగా మారిన స్టార్ కమెడియన్
⇒ 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' మోషన్ పోస్టర్ విడుదల కమెడియన్ గా కడుపుబ్బా నవ్విస్తున్న స్టార్ కమెడియన్ సప్తగిరి ఇప్పుడు హీరోగానూ అలరించేందుకు సిద్ధమయ్యాడు. 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పవార్ దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్టర్ హోమియోపతి ద్వారా వైద్యరంగంలో సేవలందిస్తున్న డాక్టర్ కె.రవికిరణ్.. సాయి సెల్యూలాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకంపై తొలి ప్రయత్నంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కన్నడ బ్యూటీ రోషిణీ ప్రకాశ్ ఈ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఇటీవల పోలాండ్ లో పాటల చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' మోషన్ పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను మేర్లపాక గాందీ విడుదల చేశారు. 'కమెడియన్ గా బిజీ అవడంతో అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నాను. ఆ సమయంలో మాస్టర్స్ హోమియోపతి నిర్వహిస్తున్న రవికిరణ్‌గారి వైద్యంతో ఐదు రోజుల్లోనే రికవరీ అయ్యాను. అలా ఆ పరిచయంతో నా సినిమాకు అండగా నిలబడతానని మాటిచ్చి ఈసినిమాతో నిర్మాతగా మారారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవంతో ఈ సినిమాకు నేనే స్క్రిప్ట్ రాసుకున్నాను. ఈ సినిమాను, నన్ను ఎవరు హ్యాండిల్ చేస్తారోనని ఆలోచించి అందుకు తగ్గ వ్యక్తిగా అరుణ్ పవార్ ను ఎంచుకున్నాను. అరుణ్ ఈ సినిమాను చాలా చక్కగా తెరకెక్కించాడు' అని సప్తగిరి చెప్పాడు. గాంధీ మాట్లాడుతూ.. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' నుంచి సప్తగిరితో నాకు పరిచయం ఉంది. ఈ సినిమాతో సప్తగిరి హీరో కావడం ఆనందంగా ఉందన్నారు. నిర్మాత డా.కె.రవికిరణ్ మాట్లాడుతూ.. స్వతహాగా డాక్టరును అయినప్పటికీ సినిమాలపై ఉన్న ఆసక్తితో.. సప్తిగిరితో పరచయం వల్ల నిర్మాతగా మారాను. పోలీస్ వ్యవస్థ నేపథ్యంలో తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కించామని చెప్పారు. దర్శకుడు అరుణ్ పవార్ మాట్లాడుతూ.. మాస్ ఆడియెన్స్ పల్స్ తెలిసిన సప్తగిరిగారు.. నన్ను పిలిచి దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. సినిమా ఇంత బాగా రావడానికి సప్తగిరితో పాటు సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్ గారే కారణం. క్వాలిటీ విషయంలో ఆయన ఎక్కడా కాంప్రమైజ్ కాలేదన్నారు. బుల్గానిన్ మ్యూజిక్ అందించాడు. అలీ, పోసాని కృష్ణమురళి, శివప్రసాద్, షాయాజీ షిండే, తులసి, షకలక శంకర్ కీలకపాత్రలు పోషించారు. -
‘క్లోజ్ ఫ్రెండ్స్’స్టిల్స్