అరుణ్ పవార్
‘‘మన లక్ష్యం మంచిది అయినా వెళ్లేదారి కరెక్టుగా ఉన్నప్పుడే దేవుడి ఆశీస్సులు ఉంటాయని చెప్పే చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. ఈ సినిమా కథ వజ్రం చుట్టూ తిరుగుతుంది. గోవిందు అనే దొంగ తన ఊరికోసం ఏం చేశాడన్నదే కథ. దీనికితోడు గోవింద అన్నది దేవుడి పేరు కావడంతో ‘వజ్ర కవచధర గోవింద’ అనే టైటిల్ పెట్టాం’’ అని డైరెక్టర్ అరుణ్ పవార్ అన్నారు. సప్తగిరి, వైభవీ జోషీ జంటగా నటించిన చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ ఫేమ్ అరుణ్ పవార్ దర్శకత్వం వహించారు.
నరేంద్ర యడ్ల, జీవీఎన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మయ్య ఈనెల 14న విడుదల చేస్తున్నారు. అరుణ్‌పవార్ మాట్లాడుతూ– ‘‘మాది నెల్లూరు.. ఇంటర్ తర్వాత హైదరాబాద్ వచ్చి విజువల్ ఎఫెక్ట్స్ కోర్సు చేశా. డైరెక్టర్ త్రివిక్రమ్‌గారి వద్ద ‘అతడు’ చిత్రం నుంచి ‘అ..ఆ’ సినిమా వరకూ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో పనిచేశా. దర్శకత్వంపై ఇష్టంతో ‘బెస్ట్ యాక్టర్స్’ సినిమాని తీశా. అది అనుకున్నంత హిట్ అవలేదు. ఆ తర్వాత తీసిన ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ మంచి హిట్ అయింది. అందుకే ఈ చిత్రాన్ని నా తొలి సినిమాగా భావిస్తా. నేను ఏ డైరెక్టర్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేయలేదు. పదేళ్లలో దాదాపు 100 సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ చేశా.
షూటింగ్‌టైమ్‌లో డైరెక్టర్స్‌తో కలిసి ఉండటంతో మేకింగ్, డైరెక్షన్‌పై అవగాహన ఉంది. నేను చేసిన ఓ షార్ట్ ఫిల్మ్ నచ్చిన త్రివిక్రమ్‌గారు భవిష్యత్తులో మంచి డైరెక్టర్ అవుతావన్నారు. అంతేకాదు.. మేకింగ్ టెక్నిక్స్, కథలు రాసుకోవడం ఎలాగో చెప్పారాయన. పైగా మా ఇద్దరి విజన్ ఒక్కటే. అందుకే నా గురువుగా ఆయన్ని భావిస్తాను. వినోదాత్మకంగా రూపొందిన ‘వజ్ర కవచధర గోవింద’ చిత్రంలో భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ అన్నవి ఓ హాబీలా చేస్తా. విజువల్ ఎఫెక్ట్స్ కంటే డైరెక్షన్ మోస్ట్ చాలెంజింగ్ విజన్ అనుకుంటున్నా. ఓ ప్రేమ కథ రెడీ చేశా. డైరెక్టర్ బాబీగారు ఆ సినిమా నిర్మిస్తారు. ఇందు లో సాయిధరమ్ తేజ్ హీరో అనుకుంటున్నాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment