టైటిల్ : వజ్ర కవచధర గోవింద
జానర్ : కామెడీ డ్రామా
తారాగణం : సప్తగిరి, వైభవీ జోషి, జస్పర్, అర్చన, విరేన్ తంబిదొరై
సంగీతం : బల్గానిన్
దర్శకత్వం : అరుణ్ పవర్
నిర్మాత : నరేంద్ర యడ్ల, జీవీఎన్ రెడ్డి
కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి తరువాత హీరోగా మారిన సప్తగిరి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా వజ్ర కవచధర గోవింద. సప్తగిరి హీరోగా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ సినిమాను తెరకెక్కించిన అరుణ్ పవార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కామెడి స్టార్‌ను మాస్ హీరోగా మార్చిందా..? హీరో పాత్రకు సప్తగిరి ఎంతవరకు న్యాయం చేశాడు..?
కథ :
సోమల అనే చిన్న గ్రామంలో ఉండే గోవింద్(సప్తగిరి) తన గ్రామ ప్రజలు పడే కష్టాలు చూడలేక దొంగగా మారతాడు. ఊళ్లో ఒక్కొక్కరు క్యాన్సర్‌తో చనిపోతుండటంతో వారిని కాపాడేందుకు చాలా డబ్బు కావాలనే ఉద్దేశంతో ఓ నిధిని వెతికేందుకు కొంతమందితో ఒప్పందం చేసుకుంటాడు. ఈ ప్రయత్నంలో వారికి 150 కోట్ల విలువైన మహేంద్ర నీలం అనే వజ్రం దొరుకుతుంది. ఆ వజ్రాన్ని అమ్మి పంచుకోవాలనుకుంటారు గోవింద్ అండ్ బ్యాచ్. అయితే వజ్రాన్ని ఎవరికీ దొరక్కుండా దాచిపెట్టిన గోవింద్ ఓ ప్రమాదంలో గతం మర్చిపోతాడు. వజ్రాన్ని దాచిన చోటు కూడా మర్చిపోతాడు. చివరకు గోవింద్‌కు గతం గుర్తుకు వచ్చిందా..? వజ్రాన్ని తిరిగి తీసుకొచ్చాడా..? ఈ కథతో బంగారప్పకు ఉన్న సంబంధం ఏంటి.? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
కమెడియన్‌గా ఆకట్టుకున్న సప్తగిరి హీరోగా ప్రేక్షకులను కన్విన్స్ చేయలేకపోయాడు. ముఖ్యంగా యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌లో సప్తగిరి నటన తన ఇమేజ్, బాడీ లాంగ్వేజ్‌కు ఏ మాత్రం సూట్ అయినట్టుగా అనిపించదు. కామెడీ సీన్స్‌లో ఆకట్టుకున్నా.. అది పూర్తిగా సినిమాను నిలబెట్టే స్థాయిలో లేదు. హీరోయిన్ పాత్రకు ఏ మాత్రం ఇంపార్టెన్స్ లేకపోవటంతో వైభవీ జోషికి నటనకు పెద్దగా ఆస్కారం లేకుండా పోయింది. లుక్ పరంగానూ వైభవీ ఆకట్టుకోలేకపోయారు. విలన్‌గా జస్పర్ లుక్ బాగుంది. ఇతర పాత్రలో అర్చన, టెంపర్ వంశీ, జాన్ కొట్టోలి, విరేన్ తంబిదొరై తమ పరిధి మేరకు పరవాలేదనిపించారు.
విశ్లేషణ :
సప్తగిరికి మాస్ ఇమేజ్ తీసుకువచ్చేందుకు ప్రయత్నించిన దర్శకుడు అరుణ్ పవార్ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టాడు. సప్తగిరి ఇమేజ్‌ను పట్టించుకోకుండా ఇంట్రో సాంగ్, స్లోమేషన్ షాట్స్, యాక్షన్ సీన్స్‌తో సినిమాను తెరకెక్కించాడు. కథా కథనాల విషయంలోనూ దర్శకుడు తడబడ్డాడు. హీరో పాత్రను ఎస్టాబ్లిష్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకున్న దర్శకుడు, అసలు కథ మొదలయిన తరువాత కూడా కథనాన్ని నెమ్మదిగా నడిపించాడు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు, పాటలు ఏ మాత్రం ఆసక్తికరంగా లేకపోగా అసలు కథకు బ్రేకులు వేస్తూ విసిగిస్తాయి. సినిమాటోగ్రఫి ఆకట్టుకుంటుంది. సంగీతం, ఎడిటింగ్, నిర్మాణ విలువలు నిరాశపరుస్తాయి.
ప్లస్ పాయింట్స్ :
కొన్ని కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్ :
కథా కథనాలు
దర్శకత్వం
ఎడిటింగ్
నిర్మాణ విలువలు
- సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్.
Comments
Please login to add a commentAdd a comment