సాక్షి, చాగల్లు: దర్శకుడు అవుదామని చిత్ర పరిశ్రమకు వచ్చి నటుడిని అయ్యానని హీరో, హాస్యనటుడు సప్తగిరి అన్నారు. గణపతి నవరాత్రుల సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు తెలగా సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తెలగా సంఘం వినాయకుడి ఆలయంలో పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం సప్తగిరి విలేకరులతో మాట్లాడుతూ తాను పరువు సినిమా ద్వారా చిత్రపరిశ్రమకు పరిచయమయ్యానని.. ఇప్పటివరకు 80 సినిమాల్లో హాస్యనటుడిగా నటించానని చెప్పారు. కమెడియన్‌గా మంచి గుర్తింపు లభించిందన్నారు. పరువు, ఎక్స్‌ప్రెస్ రాజా, ప్రేమకథా చిత్రం, మనం చిత్రాలు మంచి గుర్తింపును తెచ్చాయన్నారు. సప్తగిరి ఎల్‌ఎల్‌బీ, సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమాల్లో హీరోగా నటించానన్నారు.
తొలుత సినీ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసినట్టు చెప్పారు. ఎ ఫిల్మ్ బై అరవింద్, బొమ్మరిల్లు, పరుగు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశానన్నారు. డైరెక్షన్ అంటే తనకు చాలా ఇష్టమని, డైరెక్టర్ అవుదామనే ఈ పరిశ్రమలోకి వచ్చానని చెప్పారు. నిర్మాత దిల్‌రాజు తననెంతగానో ప్రోత్సహించారన్నారు. ఎక్స్‌ప్రెస్ రాజాలో నటనకు నంది అవార్డు వచ్చిందని చెప్పారు. చిత్ర పరిశ్రమకు రావాలనుకునే యువత బాగా కష్టపడాలని, కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. టాలెంట్ చాలా మందికి ఉంటుందని, అయితే వ్యక్తిత్వం, మంచి గుణాలు ఉన్నవారు తప్పనిసరిగా విజయం సాధిస్తారన్నారు.
తన సొంతూరు తిరుపతి అని చెప్పారు. ప్రేక్షకుల ఆదరాభిమానాలే నటులకు నిజమైన గుర్తింపు అన్నారు. చాగల్లులో దర్శకుడు వీవీ వినాయక్ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించగా పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. సప్తగిరిని చూసేందుకు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. మాజీ సర్పంచ్ గండ్రోతు సురేంద్రకుమార్, జుట్టా కొండలరావు, గవర సర్వారాయుడు, తెలగా సంఘం పెద్దలు సప్తగిరి వెంట ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment