ఇంతకీ 'సర్దార్' కలెక్షన్లు ఎంతో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంతా తానై తీసిన 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా విడుదల కావడానికి ముందు బోలెడంత హైప్ క్రియేట్ చేసింది. నిజానికి ఆ సినిమా విడుదలకు ముందే మొత్తం బిజినెస్ 100 కోట్లు చేసింది. గబ్బర్‌సింగ్ విజయంతో ఈ సినిమా మీద భారీ అంచనాలతో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు పోటీలు పడి సినిమాను కొనేశారు. కానీ, వంద కోట్లు వసూలు చేయలేక.. బాక్సాఫీసు వద్ద సినిమా చతికిలపడింది. సినిమాను తెలుగు, హిందీ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కూడా విడుదల చేసినా, అంతా కలిపి సినిమాకు వచ్చినది కేవలం రూ. 52.92 కోట్లు మాత్రమేనన్నది టాలీవుడ్ టాక్.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్లు సినిమా థియేటర్ హక్కులను రూ. 87 కోట్లు పెట్టి కొన్నారు. కానీ, ఈ రెండు రాష్ట్రాలలో కలిపి అందులో సగం కూడా రాలేదు. దాంతో వాళ్లంతా నష్టాల్లో కూరుకుపోయారు. ఇటీవల లోఫర్ సినిమా నష్టాల విషయంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ మీద డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. మరిప్పుడు వాళ్లు ఈ సినిమా దర్శకుడు బాబీని అడుగుతారా, లేక సినిమాకు అంతా తానే అయిన పవన్‌ను అడుగుతారా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న. అయితే.. ఎస్‌జే సూర్యతో తాను చేయబోతున్న నెక్స్ట్ సినిమాతో ఈ సినిమా నష్టాలకు పరిహారం ఇస్తానని పవన్ వారికి హామీ ఇచ్చారని టాక్.
ఏరియాల వారీగా సర్దార్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి...
నైజాం - రూ .12.05 కోట్లు, సీడెడ్ - రూ. 8.40 కోట్లు, నెల్లూరు - రూ. 1.73 కోట్లు, కృష్ణా - రూ. 2.96 కోట్లు, గుంటూరు - రూ. 4.10 కోట్లు, వైజాగ్ - రూ. 4.15 కోట్లు, తూర్పుగోదావరి - రూ. 3.80 కోట్లు, పశ్చిమగోదావరి - రూ. 3.75 కోట్లు... మొత్తం ఏపీ, తెలంగాణ కలిపి రూ. 40.94 కోట్లు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల టాక్.
ఇతర ప్రాంతాల్లో.. కర్ణాటక రూ. 5.10 కోట్లు, మిగిలిన దేశం అంతా కలిపి రూ. 1.53 కోట్లు, ఓవర్సీస్ - రూ. 5.35 కోట్లు. ఇది కూడా కలుపుకొంటే మొత్తం కలిపి సర్దార్ గబ్బర్ సింగ్ వసూలు చేసింది రూ. 52.92 కోట్లని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.