
సాక్షి, హైదరాబాద్ : తమిళనాడే కాకుండా దక్షిణాది రాష్ట్రాల ప్రజల హృదయాలను గెలిచిన వ్యక్తి జయలలిత అని బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. సినీ, రాజకీయ, సేవా రంగాల్లో ఆమె విశిష్ట గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు. జయలలిత జీవిత కథ ఆధారంగా జయం మూవీస్ పతాకంపై దర్శకుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ‘శశిలలిత’ (ది స్ట్రోమ్) రూపొందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు వర్షన్ ఫస్ట్‌లుక్, పోస్టర్, టీజర్‌ను సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జగదీశ్వర రెడ్డి శనివారం ఆవిష్కరించారు. శశిలలిత సినిమా వాస్తవాలకు దగ్గరగా ఉంటుందని ఆశిస్తున్నట్లు సుధాకర్ రెడ్డి తెలిపారు. ‘శశిలలిత’ నిర్మించడం అభినందనీయమని ప్రశంసలు కురిపించారు.
జయలలిత ముగిసిన చరిత్ర కాదని, ఆమె ప్రజల గుండెల్లో ఎప్పుడూ బతికి ఉంటారని చిత్ర దర్శకుడు జగదీశ్వరరెడ్డి అన్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా, నిజాల్ని ప్రేక్షకులకు చెప్పేందుకే సినిమా తీస్తున్నట్లు తెలిపారు. జయలలిత క్యారెక్టర్‌లో కాజల్ దేవ్‌గన్, శశికళ పాత్రలో అమలాపాల్ నటిస్తున్నారని వెల్లడించారు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో చిత్రం నిర్మిస్తున్నట్టు వివరించారు. వచ్చేనెలలో సినిమా రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో కో–డైరెక్టర్ శివకుమార్, రైటర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment