kethireddy jagadiswara reddy
-
‘శశిలలిత’ నిర్మించడం అభినందనీయం
సాక్షి, హైదరాబాద్ : తమిళనాడే కాకుండా దక్షిణాది రాష్ట్రాల ప్రజల హృదయాలను గెలిచిన వ్యక్తి జయలలిత అని బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. సినీ, రాజకీయ, సేవా రంగాల్లో ఆమె విశిష్ట గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు. జయలలిత జీవిత కథ ఆధారంగా జయం మూవీస్ పతాకంపై దర్శకుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ‘శశిలలిత’ (ది స్ట్రోమ్) రూపొందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు వర్షన్ ఫస్ట్‌లుక్, పోస్టర్, టీజర్‌ను సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జగదీశ్వర రెడ్డి శనివారం ఆవిష్కరించారు. శశిలలిత సినిమా వాస్తవాలకు దగ్గరగా ఉంటుందని ఆశిస్తున్నట్లు సుధాకర్ రెడ్డి తెలిపారు. ‘శశిలలిత’ నిర్మించడం అభినందనీయమని ప్రశంసలు కురిపించారు. జయలలిత ముగిసిన చరిత్ర కాదని, ఆమె ప్రజల గుండెల్లో ఎప్పుడూ బతికి ఉంటారని చిత్ర దర్శకుడు జగదీశ్వరరెడ్డి అన్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా, నిజాల్ని ప్రేక్షకులకు చెప్పేందుకే సినిమా తీస్తున్నట్లు తెలిపారు. జయలలిత క్యారెక్టర్లో కాజల్ దేవ్గన్, శశికళ పాత్రలో అమలాపాల్ నటిస్తున్నారని వెల్లడించారు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో చిత్రం నిర్మిస్తున్నట్టు వివరించారు. వచ్చేనెలలో సినిమా రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో కో–డైరెక్టర్ శివకుమార్, రైటర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
నరసింహా రెడ్డిని జాతీయ వీరుడిగా గుర్తించాలి.
ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిని జాతీయ వీరుడిగా గుర్తించాలని తమిళనాడు తెలుగు యువశక్తి ప్రెసిడెంట్ కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి వినతి పత్రాన్నిపంపారు. దీనికి ప్రధాని వెంటనే స్పందించి దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని కార్యలయం సంబధిత శాఖను కోరడం చాలా సంతోషంగా ఉందని కేతిరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. వినతి పత్రంలో పేర్కొన్న అంశాలు: ► ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని జాతీయ వీరుడిగా గుర్తించాలి. ► అన్ని బాషలలోపాఠ్య పుస్తకాలలో ఉయ్యాలవాడ జీవిత చరిత్రను పెట్టాలని కోరారు. ► ఆయన విగ్రహాన్ని పార్టమెంట్తో సహా అన్ని రాష్ట్రాలలోని రాజధానుల్లో, తెలుగు రాష్ట్రాలలోని ముఖ్యమైన పట్టణాలలో ఏర్పాటు చేయాలి. ► నరసింహా రెడ్డి పుట్టిన, వర్ధంతి రోజున జాతీయ సెలవు దినంగా ప్రకటించాలి. ► ఉయ్యాలవాడలో ఆయన చనిపోయిన ప్రదేశంలో మెమోరియల్ హాల్‌ను ఏర్పాటు చేయాలి. ► ఆయనకు గుర్తుగా పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయాలని పేర్కొన్నారు. -
తెలుగుశక్తికి ఓట్లతో విముక్తి
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితమీద పోటీచేస్తున్న తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి గురువారం నాడు హోసూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన ఎన్నికల గుర్తు అయిన ఆటోరిక్షాకు ఓటేయాలని హోసూరు ప్రాంతంలో ఉన్న తెలుగువారిని అభ్యర్థించారు. 'నిర్బంధపు చెరలో తెలుగుశక్తి.. మీ ఓటుతో దానికి విముక్తి' అనే నినాదంతో ఆయన తన ప్రచారాన్ని కొనసాగించారు. దశాబ్దాలుగా తమిళనాడులో తెలుగు ప్రజలు అణచివేతకు గురవుతున్నారని, మైనారిటీలుగా ఉన్న తమిళులు మెజారిటీ అయిన తెలుగు వారిపై పెత్తనం సాగించడం సహించరాని విషయమని చెప్పారు. హోసూరు ప్రాంతంలో ఉన్న తెలుగువారిని కలిసి.. తనకు ఓట్లేసి గెలిపించాలని కోరారు.