ఎట్టకేలకు దిగొచ్చిన ‘కట్టప్ప’
చెన్నై: కన్నడిగుల ఆందోళనతో ‘కట్టప్ప’ దిగొచ్చాడు. కన్నడ ప్రజలకు వ్యతిరేకంగా 9 ఏళ్ల క్రితం తాను చేసిన వ్యాఖ్యలపై తమిళ నటుడు సత్యరాజ్ క్షమాపణ చెప్పారు. తాను కన్నడ ప్రజలకు వ్యతిరేకం కాదని, వివాదానికి ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు. తన వ్యాఖ్యలు బాహుబలి-2 సినిమా విడుదలకు అడ్డంకి కారాదని ఆకాంక్షించారు.
తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడివుంటే క్షమించాలని వేడుకున్నాడు. బాహుబలి-2 సినిమాను అడ్డుకోవద్దని కన్నడీగులను కోరాడు. ఈ మేరకు లేఖ చదువుతూ వీడియో విడుదల చేశాడు. తమిళ ప్రజల సంక్షేమం కోసం మాట్లాడుతూనేవుంటానని, సినిమాల్లో అవకాశాలు పోయినా లెక్కచేయనని చెప్పారు. కావేరి నదీ జలాల వివాదం నేపథ్యంలో తమకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సత్యరాజ్ క్షమాపణ చెప్పకుంటే బాహుబలి-2 సినిమాను అడ్డుకుంటామని కన్నడ సంఘాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే.
తమ సినిమాను అడ్డుకోవద్దని కన్నడ ప్రజలను దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి స్వయంగా కోరాడు. భారీ వ్యయంతో తెరకెక్కిన తమ సినిమాను అడ్డుకుంటే తీవ్రంగా నష్టపోతామని తెలిపాడు. రిలీజ్ అడ్డుకుంటే అందరూ నష్టపోవాల్సి వస్తుందని, బాహుబలి తొలి భాగాన్ని ఆదరించినట్టుగానే కన్నడ ప్రేక్షకులు బాహుబలి-2 కూడా ఆదరించాలని విజ్ఞప్తి చేశాడు.