టైటిల్ : సీక్రెట్ సూపర్ స్టార్
తారాగణం : ఆమిర్ ఖాన్, జైరా వసీమ్, మెహర్ విజ్, రాజ్ అరున్, తిర్థ్ శర్మ
దర్శకుడు : అద్వైత్ చందన్
జానర్ : డ్రామా
చిత్ర నిడివి : 2:30 గంటలు
సాక్షి, హైదరాబాద్ :
తన చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా ఎప్పుడూ సామాజిక అంశాలనే ఇతివృత్తంగా తీసుకొని చిత్రాలు నిర్మించే ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్. ఆయన స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తూ గతంలో రైతుల సమస్యలు, సామాజిక రుగ్మతలపై చిత్రాలను నిర్మించి అందించిన ఆయన మరోసారి సామాజిక అంశాన్నే ఇతివృత్తంగా తీసుకొని ఒక కొత్త డైరెక్టర్‌తో చేసిన ప్రయోగం సీక్రెట్ సూపర్‌స్టార్. దంగల్ భారీ విజయం సాధించిన తర్వాత మరోసారి ఆయన స్వయంగా నటించిన చిత్రం సీక్రెట్ సూపర్ స్టార్. ఈ చిత్రంలో ఆయన పాత్ర ఏమిటి? ఈ సినిమా నేపథ్యం ఏమిటి? ఈ చిత్రం ద్వారా మరోసారి సమాజానికి సందేశం ఇవ్వడంలో విజయం సాధించారా అనే విషయాలు తెలుసుకునేందుకు ఇప్పుడు కథలోకి వెళదాం.
కథ:
బరోడా ప్రాంతానికి చెందిన ఇన్సియా మాలి(జైరా వసీమ్) అనే 15 ఏళ్ల బాలికకు ఒక ఆశయంతో ముందుకెళ్లాలని ఉంటుంది. కానీ ఉదాసీనత లేని తండ్రి ప్రవర్తన, అతడికి కొడుకుపై మాత్రమే ఉండే ప్రేమ కారణంగా అది కాస్త నీరుగారిపోతుంది. ఆమె తల్లి కూడా తండ్రి బాధితురాలే. ఇంట్లో ఎప్పుడూ మనశ్శాంతి లేకుండా గొడవపడే స్వభావం అతడిది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్సియా తిరిగి తన ఆశయాన్ని బతికించుకుంటుందా? కఠినమైన మనస్తత్వం ఉన్న తండ్రి నుంచి తల్లిని రక్షించుకుంటుందా? ఒక వేళ తన డ్రీమ్‌ను బతికించుకుంటే అందుకు సహాయపడింది ఎవరు? అందుకు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది అనేది మిగతా కథ.
సినిమా సమీక్ష:
ఆమిర్ ఖాన్ చిత్ర నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఈ సినిమా రూపొందడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. పైగా దంగల్ చిత్రంలో తనకు కూతురుగా (చిన్నప్పటి పాత్రలో) నటించిన జైరా వసీమ్‌తో కలిసి ఆమిర్ మరోసారి నటించడం ప్రేక్షకుల్లో థియేటర్ వైపు రావడానికి మరింత ఆసక్తిని రేపింది. ఈ సినిమాలో శక్తి కుమార్ అనే మ్యూజిక్ డైరెక్టర్‌పాత్రలో నటించిన ఆమిర్ ఖాన్ తెరమీదకు వచ్చిన ప్రతిసారి చాలా వినూత్నంగా కనిపించారు. ఆయన హావభావాలు, చిన్నారి ఇన్సియాకు మార్గదర్శకత్వం చేసే ప్రతిసారి ఆయన మోడ్రన్ మాస్టర్‌ను తలిపిస్తుంటారు. ముఖ్యంగా ఆయన హెయిర్ స్టైల్ డ్రెస్సింగ్ విధానం చాలా బాగుంది. దర్శకుడు అద్వైత్ చవాన్‌కు ఈ సినిమా తొలిచిత్రమే అయిన అదరగొట్టేశారు. ఆమిర్ ఖాన్ అడుగుజాడల్లోనే నడిచి ఆయన మార్గదర్శకత్వంలోనే ముందుకెళుతున్న ఆయన ఒక హృదయాన్ని హత్తుకునే చిత్రమే ఇచ్చారని చెప్పాలి. సినిమాలో సంతోషం, దుఃఖం, భావోద్వేగం, ఎవరికివారుగా తమకు అపాధించుకునే అంశాలువంటివి సమపాళ్లలో ఉండేలా జాగ్రత్తపడ్డారు.
ఇక సినిమా కథ విషయానికి వచ్చినప్పుడు సహజంగా ప్రతి ఇంట్లో జరిగే విషయాలే అనిపిస్తుంది. ఏం జరుగుతుందో ముందే ఊహించగలిగినప్పటికీ చూపించిన విధానం మాత్రం సూపర్. ప్రేమలేని దాంపత్యంలో ఒక భర్తతో భార్య ఎలాంటి ఇబ్బందులకు గురవుతుందో, ఆ వాతావరణంలో పెరిగే పిల్లలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారో మన జీవితాల్లో చూసినట్లే ఉంటుంది. ముఖ్యంగా ఓ మంచి గాయని అవ్వాలనుకున్న ఇన్సియా మాలికి తండ్రి అడ్డు చెప్పడం, కర్కషంగా వ్యవహరించడం, తండ్రికి ఎదురు చెప్పే సాహసం చేయడం, భర్తకు తెలియకుండా భార్య కూతురుకు సాయం చేయడంవంటి సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటాయి. తండ్రి ప్రవర్తన, తల్లి పడుతున్న ఇబ్బందులు చూస్తూ తాను ఎదుర్కొనే మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో చూపించడంలో జైరా వసీమ్ సక్సెస్ అయింది. ఈ సన్నివేశాల్లో చాలా అద్భుతంగా నటించింది. కఠినమైన పరిస్థితుల్లో తన లక్ష్యంకోసం పోరాడి విజయం సాధించేందుకు పడే తపన ప్రతి ఒక్క నేటి విద్యార్థిని విద్యార్థులకు స్ఫూర్తి దాయకంగా ఉంటుంది. తల్లిదండ్రులకైతే కనువిప్పు కలిగిస్తుంది. సంప్రదాయాలు, కట్టుబాట్లు అంటూ ఇన్సియాను ఆమె తండ్రి అణిచివేసే సందర్భాల్లో జైరా నటన మిస్మరేజింగ్ అని చెప్పక తప్పదు. ఇక ఉదాసీనత లేని భర్త వ్యవహారన్ని భరించే భార్య పాత్రలో నజ్మా(మెహర్), ఆమె కొడుకుగా గుడ్డు (కబీర్) పాత్రలో చాలా బాగా నటించారు.
తుది పలుకు : ఈ సీక్రెట్ సూపర్‌స్టార్‌లో మీ పిల్లల్ని చూసుకోవచ్చు
- యం. నాగేశ్వరరావు, సాక్షి, ఇంటర్నెట్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment