Secret Superstar
-
‘సీక్రెట్ సూపర్‌స్టార్’ జైత్రయాత్ర
న్యూఢిల్లీ: చైనాలో ఆమిర్‌ఖాన్ ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ జైత్రయాత్ర కొనసాగుతోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ సినిమా 100 మిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించే దిశగా దూసుకెళ్తోంది. జనవరి 19న చైనాలో విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 584.60 కోట్లు (91.29 మిలియన్ డాలర్లు) వసూలు చేసినట్టు ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. తాజాగా విడుదలైన కొత్త సినిమాలను తట్టుకుని చైనా బాక్సాఫీస్ వద్ద అగ్రస్థానంలో కొనసాగుతోందని తెలిపారు. గతేడాది అక్టోబర్ 19న భారత్‌లో ఈ చిత్రం విడుదలైంది. 2017లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన రెండో భారతీయ సినిమాగా నిలిచింది. ఆమిర్‌ఖాన్ సినిమాలకు చైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇంతకుముందు ఆయన ప్రధానపాత్రలో నటించిన ‘దంగల్’ కూడా చైనాలో అనూహ్య విజయాన్ని దక్కించుకుంది. ఇప్పుడు ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ను అదేస్థాయిలో ఆదరిస్తున్నారు. జైరా వసీమ్, మెహర్ విజ్, రాజ్ అరున్, తిర్థ్ శర్మ తదితరులు నటించిన ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. -
బంపర్ హిట్: బడ్జెట్ 15 కోట్లు, కలెక్షన్ 450 కోట్లు!
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఆమిర్‌ఖాన్ సినిమాలకు చైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన ప్రధానపాత్రలో నటించిన ‘దంగల్’కు అనూహ్య విజయాన్ని అందించిన చైనా ఆడియన్స్ తాజాగా ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ను అదేస్థాయిలో ఆదరిస్తున్నారు. జనవరి 19న చైనాలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. వారం రోజుల్లోనే రూ. 264.61 కోట్ల భారీ వసూళ్లు సాధించింది. ‘దంగల్’ సినిమాను మించి ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ తొలిరోజు రికార్డు వసూళ్లు రాబట్టడం విశేషం. తొలిరోజే ఈ సినిమా భారీస్థాయిలో 6.79 మిలియన్ డాలర్లు (రూ. 43.35 కోట్లు) రాబట్టింది. భారత్‌లో ఓ మోస్తరుగా ఆడిన ఈ చిత్రానికి చైనాలో భారీ ఓపెనింగ్స్ రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘దంగల్’ తో చైనాలో ఆమిర్‌ఖాన్ ఇమేజ్ శిఖరస్థాయికి చేరింది. ఆయనకు ఉన్న పాపులారిటీ కారణంగానే ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ భారీ ఓపెనింగ్ కలెక్షన్లు రాబట్టింది. మున్ముందు వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 450 కోట్లు రాబట్టినట్టుగా అంచనా. కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బంఫర్ వసూళ్లు సాధిస్తుండటంతో బయ్యర్ల పంట పండింది. జైరా వసీమ్, మెహర్ విజ్, రాజ్ అరున్, తిర్థ్ శర్మ తదితరులు నటించిన ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. #SecretSuperstar continues to work wonders in China... Week 1 should close at $ 45 million+, which is SPLENDID... Fri $ 6.90 mn Sat $ 10.55 mn Sun $ 9.90 mn Mon $ 5.02 mn Tue $ 4.88 mn Wed $ 4.41 mn Total: $ 41.66 million [₹ 264.61 cr] — taran adarsh (@taran_adarsh) 25 January 2018 -
చైనాలో ఎదురులేని ఆమిర్..మరో భారీ రికార్డు
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్‌కు చైనా వాసులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే ఆమిర్ ఖాన్ ’దంగల్’ చైనాలో రికార్డుస్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టింది. రెజ్లింగ్ నేపథ్యంగా తెరకెక్కిన ‘దంగల్’ సినిమా చైనాలో 1200కోట్లకుపైగా (193 మిలియన్ డాలర్లు) వసూలు చేసింది. ఆమిర్ ఖాన్ తాజా సినిమా ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ కూడా చైనాలో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. తొలిరోజే ఈ సినిమా భారీస్థాయిలో 6.79 మిలియన్ డాలర్లు (రూ. 43.35 కోట్లు) వసూలు చేసింది. తద్వారా శుక్రవారం విడుదలైన ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ చైనా బాక్సాఫీస్ వద్ద నంబర్ స్థానాన్ని సొంతం చేసుకుంది. ‘దంగల్’ సినిమాను మించి ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ తొలిరోజు రికార్డు వసూళ్లు రాబట్టడం విశేషం. ఇది సెన్సేషనల్ హిట్ అంటూ సినీ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. జైరా వసీం, ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో కామెడీ డ్రామాగా తెరకెక్కిన ‘సీక్రెట్ సూపర్‌స్టార్’కు అక్కడి వెబ్సైట్లు 9.6 వరకు రేటింగ్‌లు ఇచ్చాయి. దీంతో చైనా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పట్ల అమితమైన క్రేజ్ నెలకొంది. చైనాలో సాధించిన భారీ వసూళ్లతో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ సినిమాగా ‘దంగల్’ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. -
దంగల్ బాటలో సీక్రెట్ సూపర్ స్టార్
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ కీలక పాత్రలో తెరకెక్కిన సీక్రెట్ సూపర్ స్టార్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే భారత్‌తో పాటు ఓవర్సీస్ లో మంచి వసూళ్లను సాధిస్తున్న ఈ సినిమాను త్వరలో చైనాలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత నటుడు ఆమిర్ ఖాన్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వెల్లడించారు. ఆమిర్ హీరోగా తెరకెక్కిన దంగల్ గతంలో చైనాలో రిలీజ్ అయి అక్కడ కూడా వసూళ్ల సునామి సృష్టించింది. ఇప్పుడు అదే బాటలో సీక్రెట్ సూపర్ స్టార్ కూడా మరోసారి సత్తా చాటుతుందన్న నమ్మకంతో ఉన్నాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. జైరా వసీం ప్రధాన పాత్రలో తెరకెక్కిన సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాకు అద్విత్ చందన్ దర్శకుడు. అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఘన విజయం సాధించటంతోపాటు రికార్డ్ కలెక్షన్లతో సత్తా చాటింది. ఇప్పుడు మరిన్ని రికార్డ్ ల మీద కన్నేసిని ఆమిర్ టీం సీక్రెట్ సూపర్‌స్టార్ ను చైనాలో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఒక అమ్మాయి గళం
హీరోయిన్ని ఒక పాటకి, ఒక ఆటకి, స్కిన్‌షోకి పరిమితం చేస్తున్న కమర్షియల్ సినిమాట్రెండ్లో ..అమ్మాయిలోని ఇంటర్నల్ బ్యాటిల్‌ను.. ఎక్స్టర్నల్ ఛాలెంజెస్ను... మనసుకు హత్తుకునేలా చూపించిన కమర్షియల్ సినిమా! సీక్రెట్ సూపర్‌స్టార్ పాడే పాట అందరికీ నచ్చుతుంది... ఆమె గళమెత్తిన ప్రశ్నలు అందరినీ తాకుతాయి! అసోంలోని ‘నహీన్ అఫ్రిద్’ జీవితం ఈ సినిమాకు ప్రేరణ అనిపించింది! తెలుగు అనువాదం ఉంటే ఈ సినిమాను మనందరం చూడాలి.. అర్థంచేసుకోవాలి.. లేదా తెలుగు ప్రొడ్యూసర్లు ఇలాంటి సినిమాలు తీయాలి!! సీక్రెట్ సూపర్‌స్టార్.. డ్రీమ్ దేఖ్నాతో బేసిక్ హోతా హై అంటుంది. అంటే ఈ దేశంలో ఆడపిల్లలకు కలలు కనే హక్కు కూడా లేదని చెప్పకనే చెప్తోంది. అవును.. ఈ దేశంలో డ్రీమ్ దేఖ్నా మనా హై ఆడపిల్లలకు! ఈ సినిమా అంతా ఇదే పోరాటం! ఆడపిల్ల పోరాటం! తన కలను సాకారం చేసుకోవడానికి పోరాటం! గృహ హింస నుంచి విముక్తి పొందడానికి పోరాటాం! స్వేచ్ఛ కోసం పోరాటం! చివరకు తన ఉనికినే కాపాడు కోవడం కోసం పోరాటం! తండ్రి ఆంక్షలకు విరుద్ధంగా మంచి గాయని కావాలని అభిలషించే అమ్మాయి కథ.. ఇంత చిన్న లైనులో అంత సారం చూపించిన సినిమా! నేను, మీరు.. మన ఇరుగుపొరుగు.. కుల, మత, వర్గ, లింగ వివక్ష లేకుండా దేశం ఇంకా వీలైతే ప్రపంచమంతా తమను తాము చూసుకునే సినిమా ఇది! జెండర్ మీద.. జెండర్ డిస్క్రమినేషన్ గురించి ఇంత సున్నితంగా మనసుకు హత్తుకునేలా.. అంతే గట్టిగా చెంపపెట్టులా.. తెరకెక్కిన దృశ్యం ఇదేనేమో! గుజరాత్‌లోని బరోడా... ఈ కథకు ప్రదేశం. ఒక మధ్యతరగతి ముస్లిం కుటుంబం.. కథాంశం! పదిహేనేళ్ల అమ్మాయి, అమ్మ, నాన్న, తమ్ముడు, నానమ్మ.. ఒక ఫ్రెండ్.. ఒక సినిమా మ్యూజిక్ డైరెక్టర్.. ముఖ్య భూమికలు. స్టుపిడ్ కాదు..: ఆ అమ్మాయి పేరు ఇన్సియా. ఈ అమ్మాయి కల చుట్టే అల్లుకున్న కథ ఇది. అసలు ఈ పాత్రకు ఇన్సియా అని పెట్టడంలోనే అర్థమవుతుంది ఈ సినిమా పరమార్థం! ఇన్సియా అంటే ఔరత్.. స్త్రీ! ఇన్సియా పదోతరగతి చదువుతుంటుంది. తండ్రి ఇంజనీర్. గల్ఫ్‌లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు. పురుషహంకారి. అమ్మాయిలకు చదువు చెప్పిస్తే అమ్మాయి సాధికారత సాధిస్తుంది అనే అభిప్రాయం కన్నా కట్టుకోబోయే వాడికి గౌరవం, సుఖం అనే అభిమతం ఉన్న మనిషి. అందుకే పిల్లతో.. ‘బాగా చదువుతున్నావా లేదా? నిన్ను ఇంత కష్టపడి చదివిస్తుంది ఎందుకు? చదువురాని మొద్దుని కట్టుకుని నేను బాధపడుతున్నట్టుగా నిన్ను కట్టుకునేవాడు ఇబ్బంది పడకూడదని’! అంటుంటాడు. ఇన్సియాకు గిటార్ అంటే ఇష్టం. పాట ప్రాణం. బాగా పాడి.. మంచి సింగర్‌గా ప్రపంచం చేత ప్రశంసలు పొందాలని.. పాపులర్ కావాలనే కల.. లక్ష్యం. ల్యాప్‌టాప్.. ఇంటర్నెట్.. యూ ట్యూబ్ ద్వారా సంగీత సాగరంలో తనూ ఒక అలై పోవాలనే ఆశ! కూతురి కోరిక తల్లికి తెలుసు. కాని అమ్మ మనసే బిడ్డకు తెలియదు. అర్థం కాదు. అందుకే అమ్మాయి దృష్టిలో ఆమె స్టుపిడ్. ‘మా అమ్మ ఏక్దమ్ స్టుపిడ్ హై. చిన్నపిల్ల మనస్తత్వం. తనకేం కావాలో తనకు తెలయదు. అన్నీ చెప్పాలి’ అని అమ్మ గురించి చెప్తుంది స్నేహితుడితో. ఆ స్టుపిడే.. తన తండ్రి ఇచ్చిన బంగారు గొలుసు అమ్మేసి కూతురికి ల్యాప్‌టాప్ కొనిపెడుతుంది. యూ ట్యూబ్‌లో తన మొహం కనిపించకుండా పాటను ఎలా వినిపించాలో సలహా ఇస్తూ బుర్హా చూపిస్తుంది. ఆ స్టుపిడ్ ఐడియానే యూ ట్యూబ్‌లో లక్షల వ్యూస్‌ను ఇచ్చి సీక్రెట్ సూపర్‌స్టార్‌ను చేస్తుంది. అదే తర్వాత ఓ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ శక్తికుమార్ దర్శకత్వంలో పాట పాడే చాన్స్నిప్పిస్తుంది. కాదు.. స్థితప్రజ్ఞురాలు: ముందు ఆ మ్యూజిక్ డైరెక్టర్ మీద, అతని ప్రవర్తన మీదా ఆ అమ్మాయికి సదాభిప్రాయం ఉండదు. అసలు అతని పాటలంటేనే ఏవగించుకుంటుంది. శక్తికుమార్ సాంగ్స్ అన్నీ తన ఒరిజినల్ ట్యూన్స్‌ను తానే రీమిక్స్ చేస్తున్నట్టుంటాయి అన్న తల్లి‘ స్టుపిడ్’ మాటలతో శక్తికుమార్ను కన్విన్స్ చేస్తుంది. మనసుతో కాదు బాడీతో పాట పాడు అన్న అతనే మనసు పెట్టే పాడే పాటను రికార్డ్ చేసేలా చేస్తుంది. తండ్రి పెట్టే హింసకు బలవుతున్న తల్లికి ఎలాగైనా సరే విడాకులు ఇప్పించాలని లాయర్‌తో మాట్లాడి దరఖాస్తూ తెస్తుంది. అమ్మకు ఇచ్చి సంతకం చేయమంటుంది. ‘ఏంటిది?’ అని అడుగుతుంది తల్లి. విడాకుల కోసం అప్లికేషన్. చదువుకొని సంతకం చెయ్.. మనం ఇక్కడ ఉండొద్దు.. వెళ్లిపోదాం అని తల్లికి భరోసా ఇస్తుంది. కూతురు ఒంటరిగా ఫ్లయిట్లో ముంబై వెళ్లి, పాట కూడా పాడి, లాయర్‌ను కలిసి అరిందాతనం చేసిందని తెలిసి చెంపచెళ్లుమనిపిస్తుంది. బిడ్డ భద్రత పట్ల తల్లడిల్లుతుంది. ఏ ఆధారమూ లేకుండా విడాకులిచ్చేసి ఎలా బతుకుతామని ఆందోళన పడుతుంది. ‘పెళ్లిచేసేటప్పుడు నా బిడ్డంకేం కావాలో అని మా నాన్నా అడగలేదు అప్పుడు... అమ్మకేం నచ్చుతుందో అని ఆలోచించకుండా కూతురు విడాకులిప్పిస్తోందిప్పుడు’ అని ఓ కామెంట్ పాస్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తల్లి. స్టుపిడ్ అమ్మీ.. అని అమ్మ అజ్ఞానాన్ని తిట్టుకుంటుంది బిడ్డ. అప్పుడు.. సినిమా అంతా సనాతన సంప్రదాయ వాదిగా కనిపించే దాది(నానమ్మ) ‘నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు.. ఆడపిల్లవని కడుపులోనే చంపేయమన్నాడు మీ నాన్న. మీ అమ్మ వినలేదు. ఇక్కడే ఉంటే నిన్ను ఎక్కడ చంపేస్తాడో మీ నాన్న అని ఇంట్లోంచి వెళ్లిపోయి నిన్ను కన్నాక పొత్తిళ్లలో పెట్టుకొని వచ్చింది. ‘ఈసారికి వదిలేశా.. కాని ఇంకోసారి ఆడపిల్లను కంటే మాత్రం ఊరుకోను’ అని హెచ్చరించాడు మీ నాన్న. అలా నిన్ను బతికించుకుంది. అందుకే ఇన్సియా అని పేరుపెట్టుకుంది’ వాళ్లమ్మ కడుపులో దాచుకున్న రహస్యాన్ని మనవరాలికి చెప్తుంది. ఇన్సియా కళ్లల్లో నీళ్లు. అమ్మ స్టుపిడ్ కాదు. స్థితప్రజ్ఞురాలు అని అర్థ్థమవుతుంది. ఆమె స్థయిర్యం తెలుస్తుంది. పశ్చాత్తాప భారంతో అమ్మ దగ్గరకు వెళ్లబోతుంటే ఆపుతుంది దాది.. ఈ రహస్యం నీకు తెలిసినట్టుగా ఉండకు. నీకు తెలియకుండా ఉండాలని మీ అమ్మ కోరిక. నీకు తెలయకపోవడంలోనే ఆమె సంతోషం. నీకు తెలిస్తే నాకు తృప్తి’ అంటుంది. అప్పుడు గ్రహిస్తుంది దాదిలోని స్త్రీవాదిని ఆ మనవరాలు. ఆత్మగౌరవం తోడుగా..: తండ్రి ప్రయత్నాలు ఫలించి సౌదీలో ఉద్యోగం దొరుకుతుంది. కుటుంబమంతా సౌదీకి వలసవెళ్లాలని తండ్రి ప్లాన్. ఆ హింసను అక్కడా భరించడం ఎందుకు? మనం ఇక్కడే ఉందామని కూతురు మొండిపట్టు. మధ్యలో సతమతమవుతుంది తల్లి. దాది చెప్పిన మాట విన్నాక చివరకు అమ్మకు ఇబ్బంది కలగకుండా ఉండాలను కుంటుంది. అందుకే సౌదీ వెళ్లడానికి ఒప్పుకుంటుంది. అక్కడే ఇన్సియాకు సంబంధం కూడా చూస్తాడు తండ్రి. తల్లి మథన పడుతుంది. కాని ఇన్సియా ఒప్పుకుంటుంది. సౌదీ ప్రయాణానికి సన్నద్ధమవుతారు. ముంబై నుంచి కనెక్టింగ్ ఫ్లయిట్. చెకిన్ వ్యవహారాలను చకచక చేస్తున్న కూతురి చొరవను, ధైర్యాన్ని చూసి అబ్బుర పడుతుంది తల్లి. ముంబైలో చెకిన్ లగేజ్ ఎక్కువైంది కాబట్టి నాలుగున్నవేలు అదనంగా కట్టాలని చెప్పడంతో కూతురి గిటార్‌ను తీసేసి ట్రాష్‌లో పడేసి రమ్మంటాడు తండ్రి. తల్లి సర్దిచెప్పబోతుంది. వినడు. బాధతో భారంగా గిటార్‌ను చెత్తబుట్టలో వేసేస్తుంది ఇన్సియా. అంతకుముందు.. చదువును నిర్లక్ష్యం చేస్తుందని గిటార్ తంత్రులను విరగొట్టేస్తాడు. అప్పుడూ నిస్సహాయంగానే ఉంటుంది. ల్యాప్‌టాప్‌ను బయటకు విసిరేయమంటాడు. అప్పుడూ ఆ కుటుంబ పెద్దకు ఎదురు చెప్పే సాహసం చేయరు ఎవరూ. కాని ఈసారి తల్లి ఊరుకోదల్చుకోదు. ఇన్సియా ముచ్చటపడుతోందని ఆ పిల్లకు ఆరేళ్లప్పుడు కొనిచ్చింది ఆ గిటార్‌ను. ఆట,పాట, చదువు, సంధ్య అన్నీ ఆ గిటారే ఆ బిడ్డకు. ఇన్సియా జీవితంలో అదో భాగం. కాదు అదే ఆ పిల్ల జీవితం. మొట్టమొదటిసారి భర్తకు ఎదురుతిరుగుతుంది. అహం దెబ్బతిన్న భర్త ఎయిర్పోర్ట్ అని కూడా చూడకుండా కొట్టడానికి చెయ్యెత్తుతాడు. ‘చుట్టూ కెమెరాలున్నాయి.. గృహహింస కింద కేస్ పెడతాను జాగ్రత్త’ అని హెచ్చరిస్తుంది. ‘మమ్మల్ని, మా ఆశలు, ఆశయాలను గౌరవించలేని మనిషితో ఉండలేమ’ని చెప్తుంది. పెట్టెలో దాచుకున్న బిడ్డ తెచ్చిన విడాకుల అప్లికేషన్ మీద సంతకం చేస్తుంది. ఏంటిది అంటాడు భర్త. ‘చదువొచ్చిన మనిషి కదా మీరు.. చదువుకోండి’ అంటూ పిల్లలిద్దర్నీ తీసుకొని అత్తగారికీ వీడ్కోలు చెప్పి బయటకొచ్చేస్తుంది. ఈసారి అబ్బురంగా చూడ్డం ఇన్సియా వంతవుతుంది. భార్యాభర్తల ప్రాబ్లం: ఆ తర్వాత అవార్డ్ ఫంక్షన్, ఇన్సియాకు అవార్డు రావడం.. ఈ క్లైమాక్స్ అంతా రొటీన్. ఇన్సియా స్నేహితుడి పాత్ర.. మారుతున్న కాలానికి.. లేదా మారాల్సిన మగపిల్లల అభిప్రాయాలకు ప్రతీక. తల్లి, తండ్రి విడాకులను అమోదించలేని ఇష్యూగా కాకుండా.. భార్యభర్తల ప్రాబ్లంగా ఆ పిల్లాడు అర్థం చేసుకున్నట్టు, అదొక సాధారణ విషయంగా పరిగణిస్తున్నట్టు చూపించడం అభినందనీయం. ‘మా నాన్న చెడ్డవాడేం కాదు.. అమ్మకు, నాన్నకు అభిప్రాయభేదాలు అంతే’ అంటాడు. భార్యభర్తలు విడిపోయినా.. ఆ ఇద్దరిలో ఏ ఒకరిపట్లా ఇంకొకరు విషబీజాలు నాటొద్దు అనే హెచ్చరిక అది. సమాజం వినాల్సిన, సమాజానికి కావల్సిన హెచ్చరిక! ఇక ఇన్సియా తమ్ముడిగా నటించిన గుడ్డు (కబీర్) కూడా సూపర్బ్. ఆ ఇంటి యజమానిలా ఈ బుడతడు తయారు కావద్దని ఇంట్లోని ఆడవాళ్లంతా ప్రయత్నిస్తుంటారు. వాడిని తప్ప ఆ కుటుంబ పెద్ద ఎవరినీ ఇష్టపడడు. అయినా వాడు మనిషిలాగే పెరుగుతుంటుంటాడు. అమ్మను, అక్కను, దాదీని ప్రేమించే, గౌరవించే పిల్లాడిగా. దీనికి చిన్న ఉదాహరణ.. అక్కకు ఇష్టమైన ల్యాప్‌టాప్ తండ్రి కోపానికి బలై ఒకటో అంతస్తు నుంచి పడి.. విరిగి ముక్కలైతే... ఏరి అతికించి అక్కకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని పడే తాపత్రయం వాడిలో సున్నితత్వాన్ని చూపిస్తుంది. ఎక్స్టెండెడ్ కేమియో: లాస్ట్.. బట్ నాట్ లీస్ట్ ఆమిర్‌ఖాన్! ఏ హీరో చేయడానికి ఒప్పుకోని, సాహసం చేయని రోల్. ఎక్స్టెండెడ్ కేమియో. ఇంతకన్నా చెప్పలేం.. ఎందుకంటే ఎంత చెప్పినా అసంపూర్తిగానే అనిపిస్తుంది తప్ప చూస్తేకాని ఆ పాత్ర డెప్త్ తెలియదు. పాటలు.. అన్నీ బాగున్నా ఇన్సియా తల్లి కోసం యూ ట్యూబ్‌లో పాడిన పాట అద్భుతం. అది విన్న ప్రతి కూతురూ అమ్మ గురించి ఫీలయ్యే పాట. ఆమిర్‌ఖాన్ లాంటి స్టార్ ప్రొడక్షన్ సంస్థ కాబట్టి ఈ సినిమాకు మంచి మార్కులు వేయట్లేదు. ప్రస్తుత కాలానికి కావల్సిన విలువలను చూపించిన సినిమా.. కాబట్టే గుడ్ మార్క్స్. ఆ గట్స్ ఈ స్టార్ ప్రొడక్షన్ సంస్థకే ఉందని మళ్లీ నిరూపించింది ఈ సినిమా. కనుకే ఆమిర్ఖాన్కూ కుడోస్. అఫ్కోర్స్ కిరణ్ రావు! ఆమె అతని వెనక లేకపోతే అతను ఇన్‌కంప్లీట్ మ్యాన్.. అండ్ ఈ సినిమాలో కూడా ఏదో తెలియన వెలితి ఉండేది. కాస్ట్ అండ్ క్య్రూ: ఇన్సియా.. జైరా వసిమ్ (దంగల్ ఫేమ్). నటన అద్భుతం. ఆమె తల్లి నజ్మాగా మెహెర్ విజ్ నటించారు. అనేకంటే జీవించారు అంటే బాగుంటుంది. ఇన్సియా తండ్రి ఫరూఖ్ మాలిక్‌గా రాజ్ అర్జున్ అభినయం సూపర్బ్. ఇక ఇన్సియా ఫ్రెండ్ చింతన్గా తీర్థ్ శర్మ, ఇన్సియా తమ్ముడిగా కబిర్ షేక్, నానమ్మగా ఫరూఖ్ జఫర్.. అందరూ ఆ పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ సినిమాను నడిపించిన కెప్టెన్ (దర్శకుడు) అద్వైత్ చందన్. – శరాది -
ఆ మూవీకి రవితేజ 'ఫిదా'!
సాక్షి, హైదరాబాద్ : 'రాజా ది గ్రేట్' మూవీతో మరో సక్సెస్ అందుకున్న టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజ ఓ బాలీవుడ్ మూవీని ప్రశంసల్లో ముంచెత్తారు. బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ లేటెస్ట్ మూవీ 'సీక్రెట్ సూపర్ స్టార్'ను తాను నిన్న చూశానని మూవీ అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియా ద్వారా రవితేజ తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. 'సీక్రెట్ సూపర్ స్టార్' చూశాను. నిజాయితీతో కూడిన గొప్ప సినిమా ఇది. అందరూ ఈ మూవీని ప్రేమిస్తారు. జైరా వసీంతో పాటు అందులో కీలకపాత్రల్లో నటించిన వారి ఫెర్మార్మెన్స్ చాలా బాగుంది. దర్శకుడు అద్వైత్ చందన్ తెలివితేటల్ని మనం గుర్తించాలి. టాలెంట్, కఠోరశ్రమ ఉంటే ఇలాంటి ప్రయత్నాల్ని ప్రపంచం కచ్చితంగా గుర్తిస్తుంది. అలాంటి మూవీలు విజయాన్ని సాధిస్తాయని' సీక్రెట్ సూపర్‌స్టార్ యాష్ స్టాగ్‌తో వరుస ట్వీట్లు చేశారు హీరో రవితేజ. గాయనిగా ఎదగాలనుకుంటున్న ఓ ముస్లిం బాలిక కుటుంబం నుంచి, సమాజం నుంచి ఎదుర్కొన్న అడ్డంకులు నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమాకు అద్వైత్ చౌహాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రముఖ సంగీత దర్శకుడిగా నటిస్తున్న ఆమిర్ స్వయంగా ఆమిర్ ఖాణ్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై చిత్రాన్ని నిర్మించారు. జైరా వసీం ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. -
'సీక్రెట్ సూపర్ స్టార్' సినిమా రివ్యూ
టైటిల్ : సీక్రెట్ సూపర్ స్టార్ తారాగణం : ఆమిర్ ఖాన్, జైరా వసీమ్, మెహర్ విజ్, రాజ్ అరున్, తిర్థ్ శర్మ దర్శకుడు : అద్వైత్ చందన్ జానర్ : డ్రామా చిత్ర నిడివి : 2:30 గంటలు సాక్షి, హైదరాబాద్ : తన చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా ఎప్పుడూ సామాజిక అంశాలనే ఇతివృత్తంగా తీసుకొని చిత్రాలు నిర్మించే ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్. ఆయన స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తూ గతంలో రైతుల సమస్యలు, సామాజిక రుగ్మతలపై చిత్రాలను నిర్మించి అందించిన ఆయన మరోసారి సామాజిక అంశాన్నే ఇతివృత్తంగా తీసుకొని ఒక కొత్త డైరెక్టర్‌తో చేసిన ప్రయోగం సీక్రెట్ సూపర్‌స్టార్. దంగల్ భారీ విజయం సాధించిన తర్వాత మరోసారి ఆయన స్వయంగా నటించిన చిత్రం సీక్రెట్ సూపర్ స్టార్. ఈ చిత్రంలో ఆయన పాత్ర ఏమిటి? ఈ సినిమా నేపథ్యం ఏమిటి? ఈ చిత్రం ద్వారా మరోసారి సమాజానికి సందేశం ఇవ్వడంలో విజయం సాధించారా అనే విషయాలు తెలుసుకునేందుకు ఇప్పుడు కథలోకి వెళదాం. కథ: బరోడా ప్రాంతానికి చెందిన ఇన్సియా మాలి(జైరా వసీమ్) అనే 15 ఏళ్ల బాలికకు ఒక ఆశయంతో ముందుకెళ్లాలని ఉంటుంది. కానీ ఉదాసీనత లేని తండ్రి ప్రవర్తన, అతడికి కొడుకుపై మాత్రమే ఉండే ప్రేమ కారణంగా అది కాస్త నీరుగారిపోతుంది. ఆమె తల్లి కూడా తండ్రి బాధితురాలే. ఇంట్లో ఎప్పుడూ మనశ్శాంతి లేకుండా గొడవపడే స్వభావం అతడిది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్సియా తిరిగి తన ఆశయాన్ని బతికించుకుంటుందా? కఠినమైన మనస్తత్వం ఉన్న తండ్రి నుంచి తల్లిని రక్షించుకుంటుందా? ఒక వేళ తన డ్రీమ్‌ను బతికించుకుంటే అందుకు సహాయపడింది ఎవరు? అందుకు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది అనేది మిగతా కథ. సినిమా సమీక్ష: ఆమిర్ ఖాన్ చిత్ర నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఈ సినిమా రూపొందడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. పైగా దంగల్ చిత్రంలో తనకు కూతురుగా (చిన్నప్పటి పాత్రలో) నటించిన జైరా వసీమ్‌తో కలిసి ఆమిర్ మరోసారి నటించడం ప్రేక్షకుల్లో థియేటర్ వైపు రావడానికి మరింత ఆసక్తిని రేపింది. ఈ సినిమాలో శక్తి కుమార్ అనే మ్యూజిక్ డైరెక్టర్పాత్రలో నటించిన ఆమిర్ ఖాన్ తెరమీదకు వచ్చిన ప్రతిసారి చాలా వినూత్నంగా కనిపించారు. ఆయన హావభావాలు, చిన్నారి ఇన్సియాకు మార్గదర్శకత్వం చేసే ప్రతిసారి ఆయన మోడ్రన్ మాస్టర్‌ను తలిపిస్తుంటారు. ముఖ్యంగా ఆయన హెయిర్ స్టైల్ డ్రెస్సింగ్ విధానం చాలా బాగుంది. దర్శకుడు అద్వైత్ చవాన్‌కు ఈ సినిమా తొలిచిత్రమే అయిన అదరగొట్టేశారు. ఆమిర్ ఖాన్ అడుగుజాడల్లోనే నడిచి ఆయన మార్గదర్శకత్వంలోనే ముందుకెళుతున్న ఆయన ఒక హృదయాన్ని హత్తుకునే చిత్రమే ఇచ్చారని చెప్పాలి. సినిమాలో సంతోషం, దుఃఖం, భావోద్వేగం, ఎవరికివారుగా తమకు అపాధించుకునే అంశాలువంటివి సమపాళ్లలో ఉండేలా జాగ్రత్తపడ్డారు. ఇక సినిమా కథ విషయానికి వచ్చినప్పుడు సహజంగా ప్రతి ఇంట్లో జరిగే విషయాలే అనిపిస్తుంది. ఏం జరుగుతుందో ముందే ఊహించగలిగినప్పటికీ చూపించిన విధానం మాత్రం సూపర్. ప్రేమలేని దాంపత్యంలో ఒక భర్తతో భార్య ఎలాంటి ఇబ్బందులకు గురవుతుందో, ఆ వాతావరణంలో పెరిగే పిల్లలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారో మన జీవితాల్లో చూసినట్లే ఉంటుంది. ముఖ్యంగా ఓ మంచి గాయని అవ్వాలనుకున్న ఇన్సియా మాలికి తండ్రి అడ్డు చెప్పడం, కర్కషంగా వ్యవహరించడం, తండ్రికి ఎదురు చెప్పే సాహసం చేయడం, భర్తకు తెలియకుండా భార్య కూతురుకు సాయం చేయడంవంటి సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటాయి. తండ్రి ప్రవర్తన, తల్లి పడుతున్న ఇబ్బందులు చూస్తూ తాను ఎదుర్కొనే మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో చూపించడంలో జైరా వసీమ్ సక్సెస్ అయింది. ఈ సన్నివేశాల్లో చాలా అద్భుతంగా నటించింది. కఠినమైన పరిస్థితుల్లో తన లక్ష్యంకోసం పోరాడి విజయం సాధించేందుకు పడే తపన ప్రతి ఒక్క నేటి విద్యార్థిని విద్యార్థులకు స్ఫూర్తి దాయకంగా ఉంటుంది. తల్లిదండ్రులకైతే కనువిప్పు కలిగిస్తుంది. సంప్రదాయాలు, కట్టుబాట్లు అంటూ ఇన్సియాను ఆమె తండ్రి అణిచివేసే సందర్భాల్లో జైరా నటన మిస్మరేజింగ్ అని చెప్పక తప్పదు. ఇక ఉదాసీనత లేని భర్త వ్యవహారన్ని భరించే భార్య పాత్రలో నజ్మా(మెహర్), ఆమె కొడుకుగా గుడ్డు (కబీర్) పాత్రలో చాలా బాగా నటించారు. తుది పలుకు : ఈ సీక్రెట్ సూపర్స్టార్లో మీ పిల్లల్ని చూసుకోవచ్చు - యం. నాగేశ్వరరావు, సాక్షి, ఇంటర్నెట్ డెస్క్