హీరోయిన్‌ని ఒక పాటకి, ఒక ఆటకి, స్కిన్‌షోకి పరిమితం చేస్తున్న కమర్షియల్ సినిమాట్రెండ్‌లో ..అమ్మాయిలోని ఇంటర్నల్ బ్యాటిల్‌ను.. ఎక్స్‌టర్నల్ ఛాలెంజెస్‌ను... మనసుకు హత్తుకునేలా చూపించిన కమర్షియల్ సినిమా! సీక్రెట్ సూపర్‌స్టార్ పాడే పాట అందరికీ నచ్చుతుంది... ఆమె గళమెత్తిన ప్రశ్నలు అందరినీ తాకుతాయి! అసోంలోని ‘నహీన్ అఫ్రిద్’ జీవితం ఈ సినిమాకు ప్రేరణ అనిపించింది! తెలుగు అనువాదం ఉంటే ఈ సినిమాను మనందరం చూడాలి.. అర్థంచేసుకోవాలి.. లేదా తెలుగు ప్రొడ్యూసర్లు ఇలాంటి సినిమాలు తీయాలి!!
సీక్రెట్ సూపర్‌స్టార్.. డ్రీమ్ దేఖ్‌నాతో బేసిక్ హోతా హై అంటుంది. అంటే ఈ దేశంలో ఆడపిల్లలకు కలలు కనే హక్కు కూడా లేదని చెప్పకనే చెప్తోంది. అవును.. ఈ దేశంలో డ్రీమ్ దేఖ్‌నా మనా హై ఆడపిల్లలకు! ఈ సినిమా అంతా ఇదే పోరాటం! ఆడపిల్ల పోరాటం! తన కలను సాకారం చేసుకోవడానికి పోరాటం! గృహ హింస నుంచి విముక్తి పొందడానికి పోరాటాం! స్వేచ్ఛ కోసం పోరాటం! చివరకు తన ఉనికినే కాపాడు కోవడం కోసం పోరాటం! తండ్రి ఆంక్షలకు విరుద్ధంగా మంచి గాయని కావాలని అభిలషించే అమ్మాయి కథ.. ఇంత చిన్న లైనులో అంత సారం చూపించిన సినిమా! నేను, మీరు.. మన ఇరుగుపొరుగు.. కుల, మత, వర్గ, లింగ వివక్ష లేకుండా దేశం ఇంకా వీలైతే ప్రపంచమంతా తమను తాము చూసుకునే సినిమా ఇది! జెండర్ మీద.. జెండర్ డిస్క్రమినేషన్ గురించి ఇంత సున్నితంగా మనసుకు హత్తుకునేలా.. అంతే గట్టిగా చెంపపెట్టులా.. తెరకెక్కిన దృశ్యం ఇదేనేమో! గుజరాత్‌లోని బరోడా... ఈ కథకు ప్రదేశం. ఒక మధ్యతరగతి ముస్లిం కుటుంబం.. కథాంశం! పదిహేనేళ్ల అమ్మాయి, అమ్మ, నాన్న, తమ్ముడు, నానమ్మ.. ఒక ఫ్రెండ్.. ఒక సినిమా మ్యూజిక్ డైరెక్టర్.. ముఖ్య భూమికలు.
స్టుపిడ్ కాదు..:
ఆ అమ్మాయి పేరు ఇన్సియా. ఈ అమ్మాయి కల చుట్టే అల్లుకున్న కథ ఇది. అసలు ఈ పాత్రకు ఇన్సియా అని పెట్టడంలోనే అర్థమవుతుంది ఈ సినిమా పరమార్థం! ఇన్సియా అంటే ఔరత్.. స్త్రీ! ఇన్సియా పదోతరగతి చదువుతుంటుంది. తండ్రి ఇంజనీర్. గల్ఫ్‌లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు. పురుషహంకారి. అమ్మాయిలకు చదువు చెప్పిస్తే అమ్మాయి సాధికారత సాధిస్తుంది అనే అభిప్రాయం కన్నా కట్టుకోబోయే వాడికి గౌరవం, సుఖం అనే అభిమతం ఉన్న మనిషి. అందుకే పిల్లతో.. ‘బాగా చదువుతున్నావా లేదా? నిన్ను ఇంత కష్టపడి చదివిస్తుంది ఎందుకు? చదువురాని మొద్దుని కట్టుకుని నేను బాధపడుతున్నట్టుగా నిన్ను కట్టుకునేవాడు ఇబ్బంది పడకూడదని’! అంటుంటాడు. ఇన్సియాకు గిటార్ అంటే ఇష్టం. పాట ప్రాణం.
బాగా పాడి.. మంచి సింగర్‌గా ప్రపంచం చేత ప్రశంసలు పొందాలని.. పాపులర్ కావాలనే కల.. లక్ష్యం. ల్యాప్‌టాప్.. ఇంటర్నెట్.. యూ ట్యూబ్ ద్వారా సంగీత సాగరంలో తనూ ఒక అలై పోవాలనే ఆశ! కూతురి కోరిక తల్లికి తెలుసు. కాని అమ్మ మనసే బిడ్డకు తెలియదు. అర్థం కాదు. అందుకే అమ్మాయి దృష్టిలో ఆమె స్టుపిడ్. ‘మా అమ్మ ఏక్‌దమ్ స్టుపిడ్ హై. చిన్నపిల్ల మనస్తత్వం. తనకేం కావాలో తనకు తెలయదు. అన్నీ చెప్పాలి’ అని అమ్మ గురించి చెప్తుంది స్నేహితుడితో. ఆ స్టుపిడే.. తన తండ్రి ఇచ్చిన బంగారు గొలుసు అమ్మేసి కూతురికి ల్యాప్‌టాప్ కొనిపెడుతుంది. యూ ట్యూబ్‌లో తన మొహం కనిపించకుండా పాటను ఎలా వినిపించాలో సలహా ఇస్తూ బుర్హా చూపిస్తుంది. ఆ స్టుపిడ్ ఐడియానే యూ ట్యూబ్‌లో లక్షల వ్యూస్‌ను ఇచ్చి సీక్రెట్ సూపర్‌స్టార్‌ను చేస్తుంది. అదే తర్వాత ఓ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ శక్తికుమార్ దర్శకత్వంలో పాట పాడే చాన్స్‌నిప్పిస్తుంది.
కాదు.. స్థితప్రజ్ఞురాలు:
ముందు ఆ మ్యూజిక్ డైరెక్టర్ మీద, అతని ప్రవర్తన మీదా ఆ అమ్మాయికి సదాభిప్రాయం ఉండదు. అసలు అతని పాటలంటేనే ఏవగించుకుంటుంది. శక్తికుమార్ సాంగ్స్ అన్నీ తన ఒరిజినల్ ట్యూన్స్‌ను తానే రీమిక్స్ చేస్తున్నట్టుంటాయి అన్న తల్లి‘ స్టుపిడ్’ మాటలతో శక్తికుమార్‌ను కన్విన్స్ చేస్తుంది. మనసుతో కాదు బాడీతో పాట పాడు అన్న అతనే మనసు పెట్టే పాడే పాటను రికార్డ్ చేసేలా చేస్తుంది. తండ్రి పెట్టే హింసకు బలవుతున్న తల్లికి ఎలాగైనా సరే విడాకులు ఇప్పించాలని లాయర్‌తో మాట్లాడి దరఖాస్తూ తెస్తుంది. అమ్మకు ఇచ్చి సంతకం చేయమంటుంది. ‘ఏంటిది?’ అని అడుగుతుంది తల్లి. విడాకుల కోసం అప్లికేషన్. చదువుకొని సంతకం చెయ్.. మనం ఇక్కడ ఉండొద్దు.. వెళ్లిపోదాం అని తల్లికి భరోసా ఇస్తుంది. కూతురు ఒంటరిగా ఫ్లయిట్లో ముంబై వెళ్లి, పాట కూడా పాడి, లాయర్‌ను కలిసి అరిందాతనం చేసిందని తెలిసి చెంపచెళ్లుమనిపిస్తుంది. బిడ్డ భద్రత పట్ల తల్లడిల్లుతుంది. ఏ ఆధారమూ లేకుండా విడాకులిచ్చేసి ఎలా బతుకుతామని ఆందోళన పడుతుంది.
‘పెళ్లిచేసేటప్పుడు నా బిడ్డంకేం కావాలో అని మా నాన్నా అడగలేదు అప్పుడు... అమ్మకేం నచ్చుతుందో అని ఆలోచించకుండా కూతురు విడాకులిప్పిస్తోందిప్పుడు’ అని ఓ కామెంట్ పాస్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తల్లి. స్టుపిడ్ అమ్మీ.. అని అమ్మ అజ్ఞానాన్ని తిట్టుకుంటుంది బిడ్డ. అప్పుడు.. సినిమా అంతా సనాతన సంప్రదాయ వాదిగా కనిపించే దాది(నానమ్మ) ‘నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు.. ఆడపిల్లవని కడుపులోనే చంపేయమన్నాడు మీ నాన్న. మీ అమ్మ వినలేదు. ఇక్కడే ఉంటే నిన్ను ఎక్కడ చంపేస్తాడో మీ నాన్న అని ఇంట్లోంచి వెళ్లిపోయి నిన్ను కన్నాక పొత్తిళ్లలో పెట్టుకొని వచ్చింది. ‘ఈసారికి వదిలేశా.. కాని ఇంకోసారి ఆడపిల్లను కంటే మాత్రం ఊరుకోను’ అని హెచ్చరించాడు మీ నాన్న. అలా నిన్ను బతికించుకుంది. అందుకే ఇన్సియా అని పేరుపెట్టుకుంది’ వాళ్లమ్మ కడుపులో దాచుకున్న రహస్యాన్ని మనవరాలికి చెప్తుంది. ఇన్సియా కళ్లల్లో నీళ్లు. అమ్మ స్టుపిడ్ కాదు. స్థితప్రజ్ఞురాలు అని అర్థ్థమవుతుంది. ఆమె స్థయిర్యం తెలుస్తుంది. పశ్చాత్తాప భారంతో అమ్మ దగ్గరకు వెళ్లబోతుంటే ఆపుతుంది దాది.. ఈ రహస్యం నీకు తెలిసినట్టుగా ఉండకు. నీకు తెలియకుండా ఉండాలని మీ అమ్మ కోరిక. నీకు తెలయకపోవడంలోనే ఆమె సంతోషం. నీకు తెలిస్తే నాకు తృప్తి’ అంటుంది. అప్పుడు గ్రహిస్తుంది దాదిలోని స్త్రీవాదిని ఆ మనవరాలు.
ఆత్మగౌరవం తోడుగా..:
తండ్రి ప్రయత్నాలు ఫలించి సౌదీలో ఉద్యోగం దొరుకుతుంది. కుటుంబమంతా సౌదీకి వలసవెళ్లాలని తండ్రి ప్లాన్. ఆ హింసను అక్కడా భరించడం ఎందుకు? మనం ఇక్కడే ఉందామని కూతురు మొండిపట్టు. మధ్యలో సతమతమవుతుంది తల్లి. దాది చెప్పిన మాట విన్నాక చివరకు అమ్మకు ఇబ్బంది కలగకుండా ఉండాలను కుంటుంది. అందుకే సౌదీ వెళ్లడానికి ఒప్పుకుంటుంది. అక్కడే ఇన్సియాకు సంబంధం కూడా చూస్తాడు తండ్రి. తల్లి మథన పడుతుంది. కాని ఇన్సియా ఒప్పుకుంటుంది. సౌదీ ప్రయాణానికి సన్నద్ధమవుతారు. ముంబై నుంచి కనెక్టింగ్ ఫ్లయిట్. చెకిన్ వ్యవహారాలను చకచక చేస్తున్న కూతురి చొరవను, ధైర్యాన్ని చూసి అబ్బుర పడుతుంది తల్లి. ముంబైలో చెకిన్ లగేజ్ ఎక్కువైంది కాబట్టి నాలుగున్నవేలు అదనంగా కట్టాలని చెప్పడంతో కూతురి గిటార్‌ను తీసేసి ట్రాష్‌లో పడేసి రమ్మంటాడు తండ్రి. తల్లి సర్దిచెప్పబోతుంది. వినడు. బాధతో భారంగా గిటార్‌ను చెత్తబుట్టలో వేసేస్తుంది ఇన్సియా.
అంతకుముందు.. చదువును నిర్లక్ష్యం చేస్తుందని గిటార్ తంత్రులను విరగొట్టేస్తాడు. అప్పుడూ నిస్సహాయంగానే ఉంటుంది. ల్యాప్‌టాప్‌ను బయటకు విసిరేయమంటాడు. అప్పుడూ ఆ కుటుంబ పెద్దకు ఎదురు చెప్పే సాహసం చేయరు ఎవరూ. కాని ఈసారి తల్లి ఊరుకోదల్చుకోదు. ఇన్సియా ముచ్చటపడుతోందని ఆ పిల్లకు ఆరేళ్లప్పుడు కొనిచ్చింది ఆ గిటార్‌ను. ఆట,పాట, చదువు, సంధ్య అన్నీ ఆ గిటారే ఆ బిడ్డకు. ఇన్సియా జీవితంలో అదో భాగం. కాదు అదే ఆ పిల్ల జీవితం. మొట్టమొదటిసారి భర్తకు ఎదురుతిరుగుతుంది. అహం దెబ్బతిన్న భర్త ఎయిర్‌పోర్ట్ అని కూడా చూడకుండా కొట్టడానికి చెయ్యెత్తుతాడు. ‘చుట్టూ కెమెరాలున్నాయి.. గృహహింస కింద కేస్ పెడతాను జాగ్రత్త’ అని హెచ్చరిస్తుంది. ‘మమ్మల్ని, మా ఆశలు, ఆశయాలను గౌరవించలేని మనిషితో ఉండలేమ’ని చెప్తుంది. పెట్టెలో దాచుకున్న బిడ్డ తెచ్చిన విడాకుల అప్లికేషన్ మీద సంతకం చేస్తుంది. ఏంటిది అంటాడు భర్త. ‘చదువొచ్చిన మనిషి కదా మీరు.. చదువుకోండి’ అంటూ పిల్లలిద్దర్నీ తీసుకొని అత్తగారికీ వీడ్కోలు చెప్పి బయటకొచ్చేస్తుంది. ఈసారి అబ్బురంగా చూడ్డం ఇన్సియా వంతవుతుంది.
భార్యాభర్తల ప్రాబ్లం:
ఆ తర్వాత అవార్డ్ ఫంక్షన్, ఇన్సియాకు అవార్డు రావడం.. ఈ క్లైమాక్స్ అంతా రొటీన్. ఇన్సియా స్నేహితుడి పాత్ర.. మారుతున్న కాలానికి.. లేదా మారాల్సిన మగపిల్లల అభిప్రాయాలకు ప్రతీక. తల్లి, తండ్రి విడాకులను అమోదించలేని ఇష్యూగా కాకుండా.. భార్యభర్తల ప్రాబ్లంగా ఆ పిల్లాడు అర్థం చేసుకున్నట్టు, అదొక సాధారణ విషయంగా పరిగణిస్తున్నట్టు చూపించడం అభినందనీయం. ‘మా నాన్న చెడ్డవాడేం కాదు.. అమ్మకు, నాన్నకు అభిప్రాయభేదాలు అంతే’ అంటాడు. భార్యభర్తలు విడిపోయినా.. ఆ ఇద్దరిలో ఏ ఒకరిపట్లా ఇంకొకరు విషబీజాలు నాటొద్దు అనే హెచ్చరిక అది. సమాజం వినాల్సిన, సమాజానికి కావల్సిన హెచ్చరిక! ఇక ఇన్సియా తమ్ముడిగా నటించిన గుడ్డు (కబీర్) కూడా సూపర్బ్. ఆ ఇంటి యజమానిలా ఈ బుడతడు తయారు కావద్దని ఇంట్లోని ఆడవాళ్లంతా ప్రయత్నిస్తుంటారు. వాడిని తప్ప ఆ కుటుంబ పెద్ద ఎవరినీ ఇష్టపడడు. అయినా వాడు మనిషిలాగే పెరుగుతుంటుంటాడు. అమ్మను, అక్కను, దాదీని ప్రేమించే, గౌరవించే పిల్లాడిగా. దీనికి చిన్న ఉదాహరణ.. అక్కకు ఇష్టమైన ల్యాప్‌టాప్ తండ్రి కోపానికి బలై ఒకటో అంతస్తు నుంచి పడి.. విరిగి ముక్కలైతే... ఏరి అతికించి అక్కకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని పడే తాపత్రయం వాడిలో సున్నితత్వాన్ని చూపిస్తుంది.
ఎక్స్‌టెండెడ్ కేమియో:
లాస్ట్.. బట్ నాట్ లీస్ట్ ఆమిర్‌ఖాన్! ఏ హీరో చేయడానికి ఒప్పుకోని, సాహసం చేయని రోల్. ఎక్స్‌టెండెడ్ కేమియో. ఇంతకన్నా చెప్పలేం.. ఎందుకంటే ఎంత చెప్పినా అసంపూర్తిగానే అనిపిస్తుంది తప్ప చూస్తేకాని ఆ పాత్ర డెప్త్ తెలియదు. పాటలు.. అన్నీ బాగున్నా ఇన్సియా తల్లి కోసం యూ ట్యూబ్‌లో పాడిన పాట అద్భుతం. అది విన్న ప్రతి కూతురూ అమ్మ గురించి ఫీలయ్యే పాట. ఆమిర్‌ఖాన్ లాంటి స్టార్ ప్రొడక్షన్ సంస్థ కాబట్టి ఈ సినిమాకు మంచి మార్కులు వేయట్లేదు. ప్రస్తుత కాలానికి కావల్సిన విలువలను చూపించిన సినిమా.. కాబట్టే గుడ్ మార్క్స్. ఆ గట్స్ ఈ స్టార్ ప్రొడక్షన్ సంస్థకే ఉందని మళ్లీ నిరూపించింది ఈ సినిమా. కనుకే ఆమిర్‌ఖాన్‌కూ కుడోస్. అఫ్‌కోర్స్ కిరణ్ రావు! ఆమె అతని వెనక లేకపోతే అతను ఇన్‌కంప్లీట్ మ్యాన్.. అండ్ ఈ సినిమాలో కూడా ఏదో తెలియన వెలితి ఉండేది.
కాస్ట్ అండ్ క్య్రూ:
ఇన్సియా.. జైరా వసిమ్ (దంగల్ ఫేమ్). నటన అద్భుతం. ఆమె తల్లి నజ్మాగా మెహెర్ విజ్ నటించారు. అనేకంటే జీవించారు అంటే బాగుంటుంది. ఇన్సియా తండ్రి ఫరూఖ్ మాలిక్‌గా రాజ్ అర్జున్ అభినయం సూపర్బ్. ఇక ఇన్సియా ఫ్రెండ్ చింతన్‌గా తీర్థ్ శర్మ, ఇన్సియా తమ్ముడిగా కబిర్ షేక్, నానమ్మగా ఫరూఖ్ జఫర్.. అందరూ ఆ పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ సినిమాను నడిపించిన కెప్టెన్ (దర్శకుడు) అద్వైత్ చందన్.
– శరాది
Comments
Please login to add a commentAdd a comment