జయాపజయాలను పక్కన పెడితే సెల్వరాఘవన్ చిత్రాలు ఇతర చిత్రాలకు కచ్చితంగా భిన్నంగా ఉంటాయన్నది ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. అయితే ఈ మధ్య కాస్త వెనుకపడ్డ మాట వాస్తవమే. తాజాగా ఎన్‌జీకే చిత్రంతో మరోసారి తనదైన దర్శక శైలితో సత్తా చాటడానికి వస్తున్నారు.
నటుడు సూర్య కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో సాయిపల్లవి, రకుల్‌ప్రీత్‌సింగ్ నాయకిలుగా నటించారు. డ్రీమ్ వారియర్స్ ఫిలింస్ పతాకంపై ఎస్‌ఆర్.ప్రకాశ్, ఎస్‌ఆర్.ప్రభు నిర్మించిన ఎన్‌జీకే చిత్రం ఈ నెల 31వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇప్పుటికే చిత్ర పాటలు, ప్రచార చిత్రం విడుదలై మంచి స్పందన తెచ్చుకున్నాయి.
ఈ సందర్భంగా ఒక భేటీలో దర్శకుడు సెల్వరాఘవన్ మాట్లాడుతూ ఈ చిత్రానికి మంచి టీమ్ లభించడం చాలా సంతోషకరమైన విషయం అని పేర్కొన్నారు. 2010లో తన దర్శకత్వంలో రూపొంది విడుదలైన ఆయిరత్తిల్ ఒరువన్ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టినా, అది కమర్షియల్‌గా సక్సెస్ కాలేదన్నారు. ఆ చిత్రం విమర్శకులను మెప్పించినా, జనాల మధ్యకు చేరలేకపోయిందన్నారు. అందుకే ఆ చిత్రాన్ని మళ్లీ విడుదల చేయబోతున్నట్లు చెప్పారు.
ఇకపోతే ఆయిరత్తిల్ ఒరువన్–2 చేస్తే అందులో సూర్య, కార్తీ కలిసి నటిస్తారా? అన్న ప్రశ్నకు వారిద్దరూ కలిసి నటిస్తే చాలా బాగుంటుందని అన్నారు. అయితే దీని గురించి తాను చెప్పడం కంటే మీరే వారితో చెబితే ఇంకా బాగుంటుందని సెల్వరాఘవన్ పేర్కొన్నారు. మరి ఈ విషయంపై సూర్య, కార్తీలు ఎలా స్పందిస్తారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment