
ప్రముఖ నటి జ్యోతిలక్ష్మి కన్నుమూత
చెన్నై : 300లకు పైగా సినిమాలో నటించిన ప్రముఖ నటి, డ్యాన్సర్ జ్యోతిలక్ష్మి(63) అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె దక్షిణాది భాషలన్నింటితో పాటు హిందీ చిత్రాల్లో డ్యాన్సర్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో జ్యోతిలక్ష్మి పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. 80వ దశకంలో జ్యోతిలక్ష్మి పాట ఉంటే చాలు సినిమా హిట్ అన్న సెంటిమెంట్ ఉండేది. గాంధర్వ కన్య, సీతారాములు, కలుసుకోవాలని, బెబ్బులి, బంగారు బాబు, స్టేట్ రౌడి లాంటి చిత్రాల్లో ఆమె చేసిన పాటలకు మంచి గుర్తింపు వచ్చింది.
ఐటమ్ సాంగ్స్ తో ఊపు ఊపేసిన జ్యోతిలక్ష్మి పెళ్లి తరువాత సినిమాలకు దూరమయ్యారు.. చాలా కాలం పాటు మీడియా కంట పడకుండా ఉన్న జ్యోతిలక్ష్మి, తరువాత బుల్లితెరపై హుందాగా కనిపించే పాత్రల్లో నటించారు.గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, మంగళవారం ఉదయం చెన్నైలోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆ మృతికి పలువురు దక్షిణాది సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.