
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు దుర్గా నాగేశ్వర రావు బుధవారం హైదరాబాద్, రామాంతపూర్‌లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. బొట్టు కాటుక, సుజాత, స్వర్గం,పసుపు-పారాణి వంటి విజయవంతమైన కుటుంబ కథా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన వయసు 87 ఏళ్లు. విజయ బాపినీడు నిర్మించిన 'విజయ' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. గతంలో దర్శక రత్న దాసరి నారాయణరావు వద్ద పలు చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. అప్పటి ప్రముఖ నటుడు చిలకలపూడి సీతారామంజనేయులుకు, నాగేశ్వరరావు స్వయానా మేనల్లుడు.
దర్శకుల సంఘం సంతాపం..
బుధవారం తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ముగ్గురు దివంగత దర్శకులకు నివాళులు అర్పించింది. దుర్గా నాగేశ్వరరావుతో పాటు, కొద్ది రోజుల క్రితం మరణించిన మరో ప్రముఖ దర్శకుడు ఈరంకి శర్మ, సీనియర్ కో డైరెక్టర్ రామ సూరిలకు దర్శకుల సంఘం శ్రద్ధాంజలి ఘటించింది. ప్రధాన కార్యదర్శి రామ్ ప్రసాద్ , సీనియర్ సభ్యుడు రాజేంద్రప్రసాద్‌ల ఆధ్వర్యంలో ఈ సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా ఈరంకి శర్మ ద్వారా వెండి తెరకు పరిచయమైన నటులు జీవీ నారాయణ రావు, హేమ సుందర్, రూపా దేవిలు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కర్యక్రమంలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత కానూరి, దర్శకులు ధవళ సత్యం, సీవీ రావు, పర్వతనేని సాంబశివరావు, గార సత్యంలు దివంగత దర్శకులతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment