సాక్షి, విజయవాడ : త్వరలోనే అల్లరి ప్రియుడు వంటి కమర్షియల్ సినిమా తీసేందుకు కసరత్తు చేస్తున్నానని, గరడ వేగ సినిమా సీక్వెల్ కూడా చేస్తానని సినీనటుడు రాజశేఖర్ ప్రకటించారు. రాజశేఖర్ నటించిన ‘గరుడ వేగ’ సినిమా విజయోత్సవ సభ విజయవాడలోని ట్రెండ్ సెట్‌మాల్‌లోని కేపిటల్ సినిమాలో నిన్న (గురువారం) జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమా విడుదలకు ముందు తన తల్లి, బావమరిది చనిపోయారని, ఆ బాధ నుంచి చిత్ర విజయం ఊరట ఇచ్చిందని పేర్కొన్నారు.
రాజశేఖర్ భార్య, నటి జీవిత మాట్లాడుతూ తాను విజయవాడ ఆడపడుచునేనని అన్నారు. తన తల్లి, అత్తగారి ఊరు విజయవాడేనని, సత్యనారాయణపురంలోనే ఉండేవారిమని ఆమె గుర్తుచేసుకున్నారు. గరుడ వేగ మిగిలిన సినిమాలకు భిన్నంగా ఉంటుందని, రొటీన్‌గా పాటలు, ఫైట్‌లు లేకుండా ఉన్నా ప్రేక్షకులు ఆదరించటం సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు. చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తార్ మాట్లాడుతూ హైదరాబాదుకు దీటుగా విజయవాడ అభివృద్ధి చెందడం సినీవర్గాలను ఆకట్టుకుంటోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జీవిత, రాజశేఖర్ దంపతుల కుమార్తెలు శివాని, శివాత్మిక, అలంకార్ ప్రసాద్, సురేష్ మూవీస్ ప్రతినిధి ముళ్లపూడి భగవాన్, కేపిటల్ సినిమాస్ మేనేజర్ కె.కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment