మచ్చీ... ‘రోబో’ అప్‌డేట్ అయ్యి వస్తున్నాడు.... భారతీయుడు విశ్వరూపం చూపిస్తాడట. ఈసారి పందెంకోడి మళ్లీ బరిలోకి దిగాడు... సామి దూకుడు పెంచాడు... మారి మమ్మమ్మాస్...సీక్వెల్ మచ్చీ సీక్వెల్... ఈ ఏడాది తమిళంలో సీక్వెల్స్ జోరు సాగుతోంది... ‘2.0’, ‘విశ్వరూపం 2’ఆల్రెడీ రిలీజ్‌కు రెడీ అయ్యాయి.... ఆన్ సెట్స్‌లో పదికి పైగా సీక్వెల్స్ ఉన్నాయి. సీక్వెల్స్ మావా సీక్వెల్స్.
మరోసారి ఇండియన్ విశ్వరూపం
కొడుకు మీద ఉన్న ప్రేమకన్నా, దేశభక్తే మిన్న అని చెప్పాడు భారతీయుడు. శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్, ఉర్మిళ, మనీషా కోయిరాల ముఖ్య తారలుగా తమిళ్, హిందీ భాషల్లో రూపొందిన చిత్రం ‘భారతీయుడు’ (1996). ఆల్మోస్ట్ ఎనిమిది కోట్లతో నిర్మించిన ఈ సినిమా 30 కోట్లను అప్పట్లోనే కొల్లగొట్టింది. ఈ సినిమాకు బెస్ట్ యాక్టర్ విభాగంలో కమల్‌హాసన్ స్టేట్ అండ్ నేషనల్ అవార్డులు అందుకున్నారు. అంతేనా బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ విభాగంలో ఈ సినిమాను ఆస్కార్ నామినేషన్‌కు పంపించారు.
భారతీయుడు
అంత క్రేజ్ ఉండబట్టే... ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో పడ్డారు దర్శకుడు శంకర్ అండ్ కమల్‌హాసన్. సీక్వెల్ ఎనౌన్స్ చేసిన వెంటనే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ముందు ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించాలనుకున్నారు. ఆ తర్వాత తప్పుకున్నారు. దాంతో ఫస్ట్ పార్ట్‌ని నిర్మించిన ఏయం రత్నం సీక్వెల్ తీయడానికి ముందుకొచ్చారు. ప్రముఖ రచయిత జయమోహన్‌తో కలసి ప్రముఖ రచయిత వైరముత్తు తనయుడు, యువరచయితల్లో మంచి పేరు తెచ్చుకున్న కబిలన్ వైరముత్తు రెండో భాగానికి కథ రెడీ చేసే పనిలో ఉన్నారు.
హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ చిత్రం కోసం భారీ సెట్ వేయిస్తున్నారట. ఆగస్ట్‌లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.విశేషం ఏంటంటే.. రానున్న రోజుల్లో కమల్ రెండు సీక్వెల్స్‌లో కనిపించనున్నారు. ఆల్రెడీ ‘విశ్వరూపం 2’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఆల్మోస్ట్ ఐదేళ్ల క్రితం రిపబ్లిక్‌డే టైమ్‌లో ‘విశ్వరూపం’ విడుదలైంది. కమల్‌హాసన్, రాహుల్ బోస్, పూజా కుమార్, ఆండ్రియా, జై దీప్ ముఖ్య తారలుగా నటించారు. కమల్‌హాసన్ స్వీయ దర్శకత్వంలో ఆల్మోస్ట్ 90కోట్లతో రూపొందిన ఈ సినిమా 200 కోట్ల క్లబ్‌లో చేరింది. సో.. ‘విశ్వరూపం 2’ పై అంచనాలు నెలకొన్నాయి. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. త్వరలోనే ట్రైలర్‌ను రిలీజ్ చేసి, చిత్రాన్ని ఈ ఏడాదిలో విడుదల చేయాలనుకుంటున్నారు.
విశ్వరూపం ఫస్ట్‌లుక్
రంజాన్‌కు సామి స్క్వేర్ !
పద్నాలుగేళ్లు పట్టింది.. 2003లో వచ్చిన ‘సామి’ సినిమాకు సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లేందుకు. విక్రమ్, త్రిష, వివేక్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘సామి’. దోచుకున్న వారిని దోచుకునే పోలీస్ పాత్రలో విక్రమ్ నటించారు. అప్పట్లో ఐదు కోట్లతో రూపొందిన ఈ సినిమా 30కోట్లను కలెక్ట్ చేసింది. ఈ సినిమాను తెలుగులో ‘లక్ష్మీనరసింహా’ పేరుతో బాలకృష్ణ రీమేక్ చేశారు. తెలుగులో కూడా మంచి స్పందన లభించింది.
సామి స్వే్కర్ ఆన్‌లోకేషన్
‘సామి’ సెన్సేషనల్ హిట్ సాధించడంతో ‘సామి స్వే్కర్‌పై అంచనాలు పెరిగాయి. స్క్రిప్ట్ పరంగా ఇద్దరు హీరోయిన్లకు చాన్స్ ఉన్న ఈ సినిమాలో కీర్తీ సురేశ్ లీడ్ రోల్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ స్టార్టింగ్‌లోనే క్రియేటివ్ డిఫరెన్స్‌తో హీరోయిన్ త్రిష తప్పుకున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ 80శాతం షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ సీక్వెల్‌లో కూడా విక్రమ్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. రంజాన్‌కు రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం.
సామిలో విక్రమ్
మళ్లీ రేస్ మొదలైంది
డిఫరెంట్ యాంగిల్ రౌడీయిజాన్ని ‘మారి’లో చూపించారు దర్శక–నటుడు–నిర్మాత ధనుష్. ఆయన హీరోగా బాలాజీ మోహన్ దర్శకత్వంలో కాజల్ కథానాయికగా రూపొందిన చిత్రం ‘మారి’. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. పావురాల రేసింగ్ కాన్సెప్ట్ ఈ సినిమాలో హైలెట్. ఈ ఏడాది ఈ సినిమాకు సీక్వెల్‌ను ఎనౌన్స్ చేశారు ధనుష్.
మారిలో ధనుష్
బాలాజీ మోహన్ దర్శకత్వంలోనే తెరకెక్కనున్న ఈ సినిమాలో సాయి పల్లవి, వరలక్ష్మీ శరత్‌కుమార్ నటిస్తున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. పదేళ్ల క్రితం ధనుష్ నటించిన ‘యారుడా నీ మోహిని’కి సంగీతం అందించిన యువన్ శంకర్ రాజా ఇన్నేళ్ల తర్వాత ధనుష్ ‘మారి 2’కి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 40 శాతం కంప్లీట్ అయ్యింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
మారి2 వర్కింగ్ స్టిల్
ఇదిగో వస్తా.. అదిగో వస్తా!
రజనీకాంత్ ‘2.0’ రిలీజ్ డేట్ చాలాసార్లు మారింది. కానీ అంచనాలు మాత్రం మరింత పెరిగాయి. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్ ముఖ్య తారలుగా దాదాపు 450 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఆల్మోస్ట్ ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ‘ఎందిరన్’ (తెలుగులో ‘రోబో’) సినిమాకు ఇది సీక్వెల్. ఆల్మోస్ట్ 130 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘రోబో’ భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ‘2.0’ అయితే... రిలీజ్‌కు ముందే ఆల్మోస్ట్ 150 కోట్ల బిజినెస్ చేసింది.
రోబో
అంతేకాదు ఈ సినిమాను త్రీడీ వెర్షన్‌తో పాటు, ఆల్మోస్ట్ 14 భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. కొందరైతే ఇప్పటివరకు ఇండియాలో అత్యధిక వసూళ్లు చేసిన మొదటి సినిమా ‘బాహుబలి’ రికార్డులను ‘2.0’ బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు. జనవరిలో రావాల్సిన ఈ సినిమా ఏప్రిల్‌కి వాయిదా పడింది. అదీ జరగలేదు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ చేస్తారని కొందరు, లేదు లేదు దీపావళికి రిలీజ్ చేస్తారని మరికొందరు అంచనాలు వేస్తున్నారు. మరి.. ఇదిగో వస్తా.. అదిగో వస్తా అంటున్న ‘2.0’ ఎప్పుడు వస్తుందో కాలమే చెప్పాలి.
2.0
కాంచన కమింగ్ సూన్
‘ముని’ సినిమాను తెరకెక్కించేటప్పుడు రాఘవ లారెన్స్ ఊహించారో లేదో.. ఈ సినిమాకు మూడు సీక్వెల్స్ వస్తాయని. స్వీయ దర్శకత్వంలో రాఘవ లారెన్స్ నటిస్తూ వేదిక, రాజ్ కిరణ్ ముఖ్య తారలుగా 2007లో రూపొందిన సినిమా ‘ముని’. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దాదాపు 15 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. అంతేకాదు. ఆ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా 2011లో వచ్చిన ‘కాంచన’, నాలుగేళ్ల తర్వాత 2015లో వచ్చిన ‘కాంచన 2’ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి.
కాంచన3 వర్కింగ్ స్టిల్
ఇప్పుడు ‘కాంచన 3 రూపొందుతోంది. ఈ సినిమాని కూడా స్వీయ దర్శకత్వంలో రాఘవ లారెన్స్ నటిస్తూ, నిర్మిస్తున్నారు. ఇందులో ఓవియా, వేదిక నటిస్తున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. ఎనిమిదేళ్ల క్రితం ‘ముని’ ఫస్ట్ పార్ట్‌లో నటించిన వేదిక మళ్లీ ‘కాంచన 3’లో నటిస్తున్నారు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ నుంచి ఓవియా తప్పుకున్నారన్న వార్తలు వచ్చాయి. కానీ ఓవియా ‘కాంచన 3’ షూట్‌లో జాయిన్ అవ్వడంతో ఆ వార్తలు అవాస్తవం అని తేలిపోయాయి. ‘కాంచన 3’ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
‘ముని’లో రాజ్‌కిరణ్, లారెన్స్
బరిలోకి అదే పందెంకోడి
విశాల్‌ని మంచి మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ‘పందెం కోడి’. లింగుస్వామి దర్శకత్వంలో విశాల్, మీరా జాస్మిన్ జంటగా తమిళ్‌లో రూపొందిన చిత్రం ‘సండైకోళి’ (2005) తెలుగులో ‘పందెంకోడి’గా రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘పందెం కోడి 2’ నిర్మిస్తున్నారు. స్టార్టింగ్‌లో కాస్త స్లోగా ఈ చిత్రం షూటింగ్ సా..గిం..ది. ఇప్పుడు ‘పందెం కోడి’ మంచి ఊపుమీద ఉంది. ఈ సీక్వెల్‌లో విశాల్ సరసన కీర్తీ సురేశ్, వరలక్ష్మీ శరత్‌కుమార్ నటిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేసుకుందని సమాచారం. ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
కీర్తీ సురేశ్, విశాల్
నవ్వుల పందిరి
‘పెళ్లాం ఊరెళితె’ ఏం జరిగిందో థియేటర్‌లో చూశాం. ఇది తమిళ ‘చార్లీ చాప్లీన్’కి రీమేక్. శక్తి సుందర్ రాజన్ దర్శకత్వంలో ఆల్మోస్ట్ 16 ఏళ్ల క్రితం ప్రభుదేవా, ప్రభు, లివింగ్‌స్టన్, అభిరామి, గాయత్రి ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘చార్లీ చాప్లీన్’. థియేటర్స్‌లో నవ్వులతోపాటు, బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. ప్రస్తుతం ‘చార్లీ చాప్లీన్ 2’ తెరకెక్కుతోంది. శక్తి సుందర్ రాజన్ దర్వకత్వంలోనే ప్రభుదేవా, ప్రభు, ఆదా శర్మ, నిక్కి గల్రానీ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ 70 శాతం కంప్లీట్ అయ్యిందని సమాచారం. పెళ్లి బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం ఉంటుందట. పెళ్లి మండపంలో మా నవ్వుల పందరి ఏంటో సిల్వర్ స్క్రీన్‌పై చూడండి అంటున్నారు చిత్రబృందం.
ఆదా శర్మ
సుడిగాడి సందడి
సినిమా రిలీజ్‌కి ముందే లీకయ్యే పరిస్థితి ఇప్పుడు. అయితే కొన్ని కొన్ని సీన్లు లీకవుతుంటాయి. అయితే రిలీజైన మర్నాడు మొత్తం సినిమా ఆన్‌లైన్‌లో దర్శనమిస్తోంది. దీన్ని ఉద్దేశించే ‘తమిళ్ పడమ్ 2.0’ చిత్రబృందం ‘మా సినిమా మే 25న విడుదలవుతుంది. 26న ఆన్‌లైన్‌లో ఉంటుంది. చూసుకోండి’ అని సెటైరికల్‌గా అన్నారు. అన్నట్లు ఇది కూడా సెటైరికల్ మూవీనే. సీయస్ అముదాన్ దర్శకత్వంలో డిఫరెంట్ పేరడీలతో శివ, దిశా పాండే జంటగా రూపొందిన చిత్రం ‘తమిళ్ పడమ్’. ఈ సీక్వెల్ సేమ్ హీరో, సేమ్ డైరెక్టర్‌తో తెరకెక్కుతోంది. ‘తమిళ్ పడమ్’ సినిమా తెలుగులో ‘సుడిగాడు’ టైటిల్‌తో రిలీజైన సంగతి తెలిసిందే.
మరికొన్ని...
ఈ సినిమాలే కాకుండా త్రిష, అరవిందస్వామి జంటగా ‘చదురంగ వేటై్ట 2’ తెరకెక్కుతోంది. ఇది ‘చదురంగ వేటై్ట’ కి సీక్వెల్. అలాగే సముద్రఖని దర్వకత్వంలో 2009లో రూపొందిన ‘నాడోడిగల్’ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌లో నటించిన శశికుమార్‌నే రెండో పార్ట్‌లో నటిస్తున్నారు. అంతేకాదు ఎస్.ఆర్. ప్రభాకరన్ దర్శకత్వంలో శశికుమార్ హీరోగానే ‘సుందరప్పాండియన్ 2’ తెరకెక్కనుందని కోలీవుడ్ సమచారం.
రామ్‌బాలా దర్శకత్వంలో సంతానం హీరోగా రూపొందిన హారర్ చిత్రం ‘దిల్లుకు దుడ్డు’. ఇప్పుడు సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. మరికొందరి స్టార్ హీరోలతో పాటు, చిన్న హీరోలు కూడా సీక్వెల్ స్వింగ్‌లో రావడానికి చర్చలు జరుగుతున్నాయట. ఆల్రెడీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘కలకలప్పు’కి సీక్వెల్‌గా సుందర్. సి రూపొందించిన ‘కలకలప్పు 2’ విడుదలైంది. ఇప్పటికి పదికి పైగా సీక్వెల్స్ ఆన్ సెట్స్‌లో ఉన్నాయి. చూడబోతుంటే ఇది ‘సీక్వెల్ నామ సంవత్సరం’ అనాలేమో.
Comments
Please login to add a commentAdd a comment