జయా బచ్చన్ కు షారుక్ కౌంటర్
‘‘ఇలాంటి చిత్రాల్లో నటించాల్సి వస్తుందనే భయంతోనే నేనీ మధ్య సినిమాలకు దూరంగా ఉంటున్నా. ఈ మధ్యకాలంలో వచ్చిన అర్థరహితమైన చిత్రమంటే ఇదే. ఈ విషయాన్ని ఆ చిత్రబృందానికి చెందిన ఒకరిద్దరితో నేరుగానే చెప్పాను’’ అని నటి, అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ అన్నారు. ‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రం గురించి ఇటీవల ఆమె అలా ఘాటుగా స్పందించారు.
షారుక్ ఖాన్, అభిషేక్ బచ్చన్, దీపికా పదుకొనె తదితర భారీ తారాగణంతో ఫరా ఖాన్ దర్శకత్వంలో ‘హ్యాపీ న్యూ ఇయర్’ ఇటీవల వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, కుమారుడు అభిషేక్ నటించాడన్న పక్షపాతం చూపించకుండా జయా బచ్చన్ ఈ చిత్రంపై విమర్శల వర్షం కురిపించడం ఆమె ముక్కుసూటితనానికి నిదర్శనమని హిందీ రంగంలో చాలామంది ఆమెను అభినందిస్తున్నారు. కానీ, ఈ మాటలు అమితాబ్ బచ్చన్, అభిషేక్, ఐశ్వర్యారాయ్‌లను షాక్‌కి గురి చేశాయి. షారుక్ ఏమైనా అనుకుంటారేమోనని అమితాబ్ స్వయంగా ‘సారీ’ అంటూ మెసేజ్ పెట్టారట.
ఇక... అభి, ఐష్ క్షమాపణలు చెప్పడానికి ఏకంగా షారుక్ ఇంటికే వెళ్లిపోయారట. కానీ, ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరని భోగట్టా. ఒకపక్క జయ చేసిన వ్యాఖ్యల గురించి బాలీవుడ్‌లో వాడిగా వేడిగా చర్చ జరుగుతుంటే, మరోపక్క షారుక్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చేశారట. ‘‘మీ భర్త నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రం కూడా అర్థరహితంగా ఉండేదని అప్పట్లో వ్యాఖ్యలు వినిపించాయి. కానీ, అదే చిత్రాన్ని ఇప్పుడు క్లాసిక్ అంటున్నారు’’ అని జయాబచ్చన్ తోనే ఆయన కూల్‌గా అన్నారట. ఏది ఏమైనా జయ ముక్కుసూటితనంఅమితాబ్ బచ్చన్, ఖాన్ కుటుంబాల మధ్య మనస్పర్థలకు కారణమైందనీ, షారుక్ అంత సులువుగా జయ వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోతున్నారనీ సమాచారం.