శర్వానంద్, సమంత జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘జాను’. సి. ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. తమిళనాట సంచలన విజయం సాధించిన 96 సినిమాకు ఇది రీమేక్. తమిళంలో త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించారు. అక్కడ ఈ చిత్రం క్లాసిక్‌గా నిలిచింది. ఇదే సినిమాను జాను పేరుతో రీమేక్ చేస్తున్నాడు ప్రేమ్ కుమార్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ అభిమానులను తెగ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసింది చిత్ర బృందం.
‘ఎగిసిపడే కెరటాల్లో.. ఎదురుచూసే సముద్ర తీరాన్ని నేను.. పిల్లగాలి కోసం ఎదురుచూసే నల్లమబ్బులా.. ఓరచూపు కోసం నీ దోరనవ్వు కోసం రాత్రంతా చుక్కలు లెక్కపెడుతుంది నా హృదయం.. నా వైపు ఓ చూపు అప్పు ఈయలేవా..?’ అంటూ చాలా పొయెటిక్‌గా ఈ చిత్ర ట్రైలర్ కట్ చేసాడు దర్శకుడు ప్రేమ్ కుమార్. ‘నువ్ వర్జినేనా అని సమంత అడగడం.. ఛీ ఛీ ఏం మాట్లాడుతున్నావ్ జాను’ శర్వానంద్ తెగ సిగ్గుపడిపోవడం యూత్‌కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంది.
‘ఒక్కోసారి జీవితంలో ఏమీ జరగకపోయినా.. ఏమో జరిగిపోతుందని మనసుకి మాత్రం ముందే తెలిసిపోతుంది’ అంటూ సమంత చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ‘ 10 నెలల మోసి కన్న మీ అమ్మకు నువ్వు సొంతం అయితే.. ఇనాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతమే’ అంటూ శర్వానంద్ చెప్పే డైలాగ్ మనసును తాకే విధంగా ఉంది. ఎలాంటి కుదుపులు లేకుండా హృదయాలను హత్తుకునే విధంగా, చాలా అందంగా ట్రైలర్ సాగింది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని వచ్చే నెల 7న ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృదం ప్రయత్నిస్తోంది. గోవింద్ వసంత్ సంగీతమందిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment