డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాం అన్నమాట తరచూ వింటూనే ఉంటాం. కానీ ఈసారి ఓ యువ నటి పనిగట్టుకుని మరీ నర్స్ అవతారం ఎత్తింది. కోవిడ్-19తో ఫైట్ చేస్తున్న వైద్యులకు తనవంతు సాయం అందించేందుకు ముందుకొచ్చిన ఆవిడే శిఖ మల్హోత్రా. ప్రస్తుతం ఆమె ముంబైలో బాలాసాహెబ్ ఠాక్రే ట్రామా సెంటర్‌లో ఆసుపత్రిలో నర్సుగా సేవలందిస్తోంది. కరోనా పేషెంట్లకు తనవంతు సాయం అందించేందుకు నర్సుగా మారానని ఆమె చెప్పుకొచ్చింది. "దేశానికి సేవ చేయడానికి నేనెప్పుడూ ముందుంటాను. అది నటిగా కానీ, నర్సుగా కానీ, ఏదైనా కావచ్చు. నా ఆశయానికి మీ ఆశీస్సులు కావాలి. దయచేసి అందరూ ఇంటిపట్టునే ఉండండి. జాగ్రత్త వహించండి, ప్రభుత్వానికి మద్దతివ్వండి" అని పేర్కొంది. గృహ నిర్బంధాన్ని పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
ఆమె గతంలో ఢిల్లీలోని వర్ధమాన్ మహవీర్ మెడికల్ కళాశాల, సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో నర్సింగ్ నేర్చుకుంది. కాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కేసుల సంఖ్య భారత్‌లో 1000కి పైగా నమోదయ్యాయి. ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌లో మాట్లాడుతూ.. విపత్కర పరిస్థితుల్లో సేవలంలదిస్తున్న నర్సులకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాక వైద్యారోగ్య సిబ్బందికి రూ.20 లక్షల మేర ఇన్సూరెన్స్ పాలసీ అందించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. (కరోనా విరాళం)
Comments
Please login to add a commentAdd a comment