వయసుతో పనిలేదు
వృత్తి పరంగా చూస్తే ఇతర రంగాలకు సినిమా రంగం కాస్త భిన్నం అని చెప్పక తప్పదు. ఇక్కడ ఎంత ప్రతిభ ఉన్నా అదృష్టం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అది ఎప్పుడు తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. ఇక కథానాయికల విషయానికి వస్తే అందం, అభియనం, అదృష్టం ఈ మూడు ప్రధాన అర్హతలుగా భావించాల్సి ఉంటుంది. అదే విధంగా కథానాయికలకు సినీరంగంలో రాణించేందుకు వయసు ప్రభావం కూడా పని చేస్తుంది. అందుకే సాధారణంగా హీరోయిన్లు తమ వయసు గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. పుట్టిన తేదీ, నెల చెబుతారు కానీ ఏ సంవత్సరం పుట్టారన్నది ఎక్కడా చెప్పుకోరు.
చాలా మంది పది, పదిహేనేళ్లుగా హీరోయిన్లుగా రాణిస్తున్న వారు ఉన్నారు. అలాంటి వారు తమ వయసు గురించి చెబితే ప్రేక్షకుల్లో తమపై ఆసక్తి తగ్గుతుందేమోనన్న భయం ఇందుకు ఒక కారణం కావచ్చు. అంతే కాదు కొందరైతే సినిమాల్లో తల్లిగా, హీరోకి భార్యగా నటించడానికి సందేహిస్తుంటారు. అలా మంచి అవకాశాలను కోల్పోయిన నాయికలు లేకపోలేదు. అలాంటి వారే హీరోయిన్‌గా మార్కెట్ తగ్గిన తరువాత అక్కగానో, అమ్మగానో నటించడం చూస్తున్నాం. ఇదే విషయాన్ని నటి శ్రియ వద్ద ప్రస్థావించగా తను ఎలా స్పందించారో చూద్దాం. సినిమా రంగాన్ని వేరే వృత్తులతో పోల్చకూడదు. నా విషయమే తీసుకుంటే 17 ఏళ్ల వయసులో నటిగా పరిచయం అయ్యాను.
ఇప్పుడు నా వయసు 34. ఈ విషయాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే వయసెంతైతే ఏమిటీ? 65 ఏళ్ల వరకూ సినిమాల్లో మంచి అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఉదాహరణకు బిగ్‌బీ అమితాబ్‌నే తీసుకుంటే ఆయనకు ఇప్పటికీ అద్భుతమైన పాత్రలో నటించే అవకాశాలు వస్తున్నాయి. నటినైనందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. అని అంటున్న శ్రియ ఇటీవల తెలుగులో బాలకృష్ణకు భార్యగా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో తన నటనకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా శింబుకు జంటగా అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో మరో వైవిధ్య పాత్రలో కనిపించనున్నారు.