అలా అనడానికి వాళ్ళెవరు?
‘‘పాత్ర అనేది కథను బట్టి ఉంటుంది. పాత్ర తీరుతెన్నులు దర్శకుని సృజనను బట్టి ఉంటాయి. ఒక కథను తయారు చేయడం, ఒక పాత్రను మలచడం.. సినిమా చూసి విమర్శించినంత తేలిక కాదు. ‘ఈ పాత్రను ఇంత ఘాటుగా తీయడం అవసరమా?’ అనీ, ఒకవేళ పద్ధతిగా కనిపిస్తే.. ‘ఈ పాత్ర ఇంకా మోడర్న్‌గా ఉంటే బాగుంటుంది’ అనీ తోచిన వ్యాఖ్యలు చేయడానికి బయటివాళ్లెవరు?’’ అని ఇటీవల శ్రుతీ హాసన్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. గ్లామరస్ పాత్రలతోపాటు నటనకు అవకాశం ఉన్న పాత్రలు కూడా చేస్తూ,
ముందుకు దూసుకెళుతున్నారు శ్రుతి. తెరపై తారలు చేసే పాత్రల్ని బట్టి వాళ్ల గుణాన్ని, అభిరుచులను అంచనా వేయడం సరికాదని ఆ ఇంటర్వ్యూలో శ్రుతి చెబుతూ -‘‘గ్లామరస్ పాత్రల్లో నేను కనిపించినప్పుడు, నా శరీరాన్ని వేరే దృష్టితో చూస్తే, అది చూసేవాళ్ల తప్పు. మీరెలాగైనా కనిపించండి... ఎదుటి వ్యక్తి మనసులో ఏమీ లేనప్పుడు మీ గురించి లేనిపోనివి ఊహించుకోరు. నా మటుకు నా శరీరం నాకు గుడి లాంటిది. వేరేవాళ్లు వేరే రకంగా అనుకుంటే అది నా తప్పు కాదు. అలాంటివాళ్ల గురించి ఆలోచించి నా సమయాన్ని వృథా చేసుకోను. అలాగే, తెరపై మేం చేసే పాత్రలను మా నిజజీవితానికి ఆపాదించవద్దు. తెరపై కనిపించేది పాత్రలు మాత్రమే.. మేము కాదు’’ అన్నారు.