మా నాన్నలానే అతనికీ ఆడవాళ్లంటే గౌరవం!
‘బి ద బిచ్’.. శ్రుతీహాసన్ చేసిన లేటెస్ట్ వీడియో ఇది. ‘బిచ్’ అనేది అనకూడని పదమే అయినా అలా పిలిపించుకోవడానికి తనకేం అభ్యంతరం లేదంటూనే అసలు బిచ్ అంటే ఏంటి అనే దానికి ఈ వీడియోలో శ్రుతి ఇచ్చిన కొత్త నిర్వచనం అందరికీ నచ్చింది. ‘భేష్ శ్రుతీ.. భలే చెప్పావ్’ అని వీడియోను చూసినవాళ్లందరూ ఈ బ్యూటీని అభినందిస్తున్నారు. ‘‘నాకు నచ్చినట్లు చేస్తూ.. నా బతుకు నేను బతుకుతున్నందుకే ఎవరనైనా నన్ను బిచ్ అని పిలిచారనుకోండి నాకు నో ప్రాబ్లమ్’’ అని ఈ వీడియో ద్వారా శ్రుతి స్టేట్‌మెంట్ ఇచ్చారు. ‘‘ఇలా అన్నాను కదా అని నన్ను ‘స్త్రీవాది’ అనుకుంటారేమో.. నేను కాదు’’ అని కూడా అన్నారామె.
సమాజంలో బోల్డన్ని మార్పులొచ్చినట్లుగానే ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు స్త్రీలకు గౌరవపెరిగిందనుకుంటున్నారా అనే ప్రశ్నను శ్రుతీహాసన్ ముందుంచితే - ‘‘ఈ విషయంలో నాకు పెద్ద కన్‌ఫ్యూజన్ ఉంది. మా నాన్నగారు (కమల్‌హాసన్) చాలా ఓపెన్ మైండెడ్. అమ్మా, కజిన్స్.. ఇలా చాలామంది ఆడవాళ్ల మధ్య పెరిగారాయన. అందుకే ఆడవాళ్లంటే నాన్నగారికి అభిమానం, గౌరవం. ఆడవాళ్ల గురించి మా నాన్నగారి దగ్గర టాపిక్ వచ్చిన ప్రతిసారీ వాళ్లంటే ఆయనకెంత గౌరవమో నాకర్థమైంది. కానీ, బయటి మగవాళ్లల్లో ఆడవాళ్ల పట్ల నాకా గౌరవం కనిపించలేదు. నా బెస్ట్ ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు. అతను కూడా ఆడవాళ్లను గౌరవిస్తాడు. నా మీద వీళ్లిద్దరి ప్రభావం చాలా ఉంటుంది. సమాజంలో ఆడవాళ్లకు గౌరవం పెరిగిందా? లేదా? అనే విషయానికొస్తే.. పెద్దగా పెరగలేదు. రావాల్సినంత మార్పు రాలేదు’’ అన్నారు. ఆడవాళ్లందరూ బాగా చదువుకోవాలనీ, ఉద్యోగం చేయాలనీ, ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడాలనీ ఈ సందర్భంగా శ్రుతి పేర్కొన్నారు.