నాతో తేడాగా ప్రవర్తిస్తేనా...
‘‘పిరికితనం చాలా ప్రమాదకరమైనది. అది మన ఎదుగుదలను ఆపేస్తుంది. అందుకే ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి’’ అని శ్రుతీహాసన్ అంటున్నారు. ఈ మధ్య ఢిల్లీ, హైదరాబాద్.. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఆడవాళ్లపై అత్యాచారాలు జరుగుతున్నాయి కదా.. ఈ ప్రపంచంలో ఆడవాళ్లు సురక్షితంగా ఉండగలిగేదెక్కడ అనే ప్రశ్న శ్రుతీహాసన్ ముందుంచితే -‘‘నాకు తెలిసినంతవరకు అమెరికాలోని లాస్ ఏంజిల్స్. అక్కడ స్త్రీలకు స్వాతంత్య్రం ఉంటుంది. మగవాళ్లతో సమానంగా అన్ని హక్కులూ ఉంటాయి. ఇక..
భద్రత గురించి చెప్పాలంటే భేష్. చాలా బాగుంటుంది. అందుకే నాకు లాస్ ఏంజిల్స్ అంటే ఇష్టం’’ అన్నారు. మీరు స్త్రీవాదా? అనడిగితే -‘‘అవును. పక్కా ఫెమినిస్ట్‌ని. స్త్రీవాదం అంటే.. మగవాళ్లపై నోరుపారేసుకోవడం కాదు. గోరంతను కూడా కొండంత చేసేసి మగవాళ్లపై విరుచుకుపడను. మగవాళ్లను చీడపురుగుల్లా చూడను. కానీ, నాతో తేడాగా ప్రవర్తిస్తే మాత్రం నేనేంటో చెబుతా. అలాంటి సందర్భాల్లో పిరికితనంగా ఉంటే ఆడించేస్తారు. అందుకే ధైర్యంగా ఎదుర్కొంటా. మా అమ్మ (సారిక) గారి నుంచి వచ్చిన అలవాటు ఇది. ఆమె చాలా ధైర్యవంతురాలు. నాకు తెలిసి ఇప్పటివరకూ తను ఏ విషయానికీ భయపడలేదు. నేను కూడా మా అమ్మలానే’’ అని చెప్పారు.