
మరోసారి గొంతు సవరించిన సిద్ధార్థ
హైదరాబాద్ : ప్రముఖ నటుడు సిద్ధార్థ మరోసారి గొంతు సవరించుకున్నాడు. సినీ గేయ రచయిత నుంచి నటుడుగా మారిన అతడి స్నేహితుడు పీ ఏ విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న స్ట్రాబెర్రీ చిత్రంలో సిద్ధార్థ ఓ గీతాన్ని ఆలపించాడు. సిద్ధార్థతో తనకు గల అనుబంధాన్ని ఈ సందర్భంగా పీఏ విజయ్ మంగళవారం విలేకర్లతో పంచుకున్నారు. సిద్ధార్థ తనకు చిన్నప్పటి నుంచి తెలుసునని తెలిపారు.
పాట పాడతావా అని అడగటమే ఆలస్యం... సిద్ధార్థ వెంటనే ఒప్పేసుకున్నాడు.... ఆ పాట సిద్ధార్థ పాడటం... రికార్డు చేయడం అంతా కేవలం ఆరు గంటల్లో అయిపోయిందని విజయ్ వెల్లడించారు. సిద్ధార్థ గొప్ప నటుడే కాదు... మంచి సింగర్ కూడా అంటూ కితాబ్ ఇచ్చారు.
స్ట్రాబెర్రీ కథను గతంలో ఎప్పుడో రాశానని ... అయితే కంపోజర్ తాజ్ నూర్, తాను మంచి స్నేహితులమని చెప్పారు. ఓ రోజు తాను ఈ చిత్ర కథపై అనుకోకుండా తాజ్తో చర్చించానని గుర్తు చేసుకున్నారు. ఆ వెంటనే అతడు పాటలు కంపోజ్ చేయడానికి సిద్ధమై పోయాడని చెప్పారు. అలా చిత్రంలోని పాటలు కంపోజింగ్ చిత్ర షూటింగ్ కంటే ముందే ప్రారంభమైందన్నారు.
ఇంతకు ముందు వచ్చిన తన చిత్రంలోని అన్ని పాటలు బాగున్నాయన్నారు. అయితే ఈ చిత్రంలోని పాటలు చాలా డిఫరేంట్గా ఉండాలని తాజ్ నూర్ తాను అనుకున్నట్లు చెప్పారు. ఈ చిత్రంలో నాలుగు పాటలు ఇచ్చాడని... ఒక్కటి మాత్రమే ఇప్పటికి పూర్తయిందని తెలిపారు. ఈ థ్రిల్లర్ కామెడి చిత్రంలో విజయ్, అవని మోదీ, సముద్రఖణి, తంబి రామయ్య కీలక పాత్రలు పోషిస్తున్నారని చెప్పారు.