సునీల్
‘‘నేను హీరోగా ఉన్నప్పుడు మామూలు పాత్రలు చేద్దామని అనుకున్నాను. కానీ, ‘అతను హీరో అయిపోయాడుగా.. వేరే పాత్రలు చేయడేమో?’ అని దర్శకులే ఊహించేసుకున్నారు. అలా వేరే పాత్రలు చేయడం కుదర్లేదు. హీరోగా చేసినప్పుడు హిట్, ఫ్లాప్ కౌంట్‌లోకి వస్తుంది. కానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే మన ట్రాక్ పండిందా? లేదా? అన్నది చాలు’’ అని సునీల్ అన్నారు. ‘అల్లరి’ నరేశ్, సునీల్ ముఖ్య పాత్రల్లో భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. టీజీ విశ్వప్రసాద్ సమర్పణలో కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న రిలీజ్ అవుతోంది. ఈసందర్భంగా సునీల్ పంచుకున్న విశేషాలు...
► అప్పట్లో జంధ్యాలగారు, ఈవీవీ సత్యనారాయణగారు కామెడీ సినిమాలు తీసేవారు. ఇప్పుడు కామెడీ టైమింగ్ ఉన్న దర్శకులు తగ్గారు. త్రివిక్రమ్, శ్రీనువైట్ల, వినాయక్‌గారు ఉన్నారు. అప్పటితో పోలిస్తే కామెడీ తగ్గింది. ఆడియన్స్‌ను ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ‘సిల్లీ ఫెలోస్’ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకూ ఫుల్ ఫన్‌తో ఉంటుంది. ఈ పాత్రకు నేనైతే బావుంటుందని టీమ్ డిసైడ్ అయ్యారు. సెకండ్ హాఫ్‌లో చివరి 20 నిమిషాల ట్రాక్‌కి ఆడియన్స్ సీట్లలో కూర్చోరు. అంతలా నవ్వేస్తారు.
► మా సినిమాలో హీరో నరేశే. మేం ఇంతకుముందు ‘అత్తిలి సత్తిబాబు, తొట్టిగ్యాంగ్’ సినిమాలు చేశాం. ‘సిల్లీ ఫెలోస్’లో తనకి హీరోయిన్ ఉంటుంది. నాకు ఉండదంతే.
► ‘ఖైదీ నంబర్ 150’ సినిమాలో డేట్స్ కుదరక చేయలేదు. మళ్లీ కామెడీ పాత్రల్లోకి రావడం పెద్ద మార్పేమీ అనిపించడం లేదు. అప్పుడెలా ఉండేదో ఇప్పుడూ అదే ట్రీట్‌మెంట్. హీరో అప్పుడు ఒకలా.. కమెడియన్‌గా మరోలా ట్రీట్‌మెంట్ జరుగుతుందంటే తప్పు మన బిహేవియర్‌లో ఉన్నట్టే. హీరోగా ఉన్నప్పటి కంటే ఇప్పుడే ఎక్కువ రెమ్యునరేషన్ వస్తోంది (నవ్వుతూ).
► ‘అరవింద సమేత’ సినిమా ఫస్ట్ డే షూటింగ్‌లో త్రివిక్రమ్ కూడా ‘వీడు హీరో కదా.. ఇప్పుడెలా చేస్తాడు? అనుకున్నట్టున్నాడు. మంచి పాత్ర డిజైన్ చేశాడు త్రివిక్రమ్. ‘అతడు’ సినిమాలో నేను పోషించినటువంటి పాత్రలానే ఉంటుంది. సత్య, ‘వెన్నెల’ కిషోర్, శ్రీనివాసరెడ్డి కామెడీ బాగా ఎంజాయ్ చేస్తున్నాను.
► హీరోగా రెండు కమిట్‌మెంట్స్ ఇచ్చాను. అవి చేయాలి. ‘అందాల రాముడు’ బ్లాక్‌బస్టర్ అయినప్పటికీ 5 ఏళ్ల వరకూ హీరోగా ఏ సినిమా చేయలేదు. సినిమాల్లో పని చేయాలన్నది నా లక్ష్యం. దాన్ని ఎంజాయ్ చేస్తున్నాను.
► బ్రహ్మానందంగారి స్థానాన్ని భర్తీ చేసేవాడివి అంటున్నారు. ఇక్కడ ఎవ్వరూ ఎవరి స్థానాన్ని భర్తీ చేయడం ఉండదు. యస్వీఆర్ మళ్లీ రారు. రావుగోపాలరావు రేంజ్ విలనిజం.. బ్రహ్మానందంగారి స్టైల్ కామెడీ మళ్లీ చూడలేం. కొన్ని సినిమాలు స్టార్ హీరో చేయడం కుదరదు. మేం మాత్రమే చేసే సినిమాలుంటాయి. పూర్తీగా నవ్వించే పాత్రలైతే మళ్లీ హీరోగా చేస్తా.
Comments
Please login to add a commentAdd a comment