షూటింగ్‌లో మాజీ ప్రేమజంట | Simbu Joins Ex Girlfriend Hansika on Maha Shoot | Sakshi
Sakshi News home page

షూటింగ్‌లో మాజీ ప్రేమజంట

Published Wed, May 29 2019 10:47 AM | Last Updated on Wed, May 29 2019 10:47 AM

Simbu Joins Ex Girlfriend Hansika on Maha Shoot - Sakshi

నటి నయనతారను డీప్‌గా ప్రేమించిన నటుడు శింబు ఆ తరువాత అంతగా ప్రేమించిందెవరన్నా ఉన్నారంటే అది నటి హన్సికనే. అయితే విధో మరేదో అడ్డుపడిందో గానీ శింబుతో ఈ భామలిద్దరి ప్రేమా వర్కౌట్‌ కాలేదు. ముఖ్యంగా హన్సికతో శింబు పెళ్లి, చర్చలు వరకూ వచ్చి ఆగిపోయింది. ఇంకా చెప్పాలంటే వీరి పెళ్లికి శింబు తండ్రి, దర్శక, నటుడు టి.రాజేందర్‌ కూడా పచ్చజెండా ఊపారు. అయినా ఏ కనిపించని హస్తం అడ్డుపడిందో శింబు, హన్సికల పెళ్లి కథ పీటల వరకూ సాగలేదు.

దీంతో తాజాగా నటుడు శింబును తనకు ప్రియుడిని చేయమని నటి హన్సిక దర్శకుడు జమీల్‌ను కోరిందట. ఆయన సరే అని శింబును ఆమెకు ప్రియుడిని చేసేశారు. అయితే ఇది రియల్‌ జీవితంలో కాదు సుమా.. రీల్‌లో లైఫ్‌లోనే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ క్రేజీ హీరోయిన్‌గా రాణిస్తున్న నటి హన్సిక ప్రస్తుతం మహా అనే చిత్రంలో నటిస్తున్నారు.

ఇది ఈ అమ్మడు నటిస్తున్న తొలి హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రం. అంతే కాదు హన్సిక అర్ధసెంచరీ చిత్రం కూడా కావడం విశేషం. జమీల్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్‌లుక్‌ పోస్టర్లలో వివాదాల్లో మునిగిపోయింది. తాజాగా ఈ చిత్రంలో సంచలన నటుడు శింబు చోటు చేసుకోవడంతో ఇంకా హైప్‌ను పెంచేసుకుంది. ఎందుకంటే రియల్‌ లైఫ్‌లో మాజీ ప్రేమజంట రీల్‌ లైఫ్‌లో ప్రేమికులుగా కనిపించబోతుండడమే.

అవును మహా చిత్రంలో శింబు అతిథి పాత్రలో హన్సికకు ప్రియుడిగా మెరవనున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే మహా చిత్రంలో తనకు ప్రియుడి పాత్రలో శింబును నటించడానికి ఒప్పించమని నటి హన్సికనే దర్శకుడికి చెప్పారట. శింబు కూడా పెద్ద మనసుతో తన మాజీ ప్రియురాలితో మహా చిత్రంలో ప్రియుడిగా నటించడానికి సమ్మతించేశారు.

ఈ చిత్రంలో శింబు 30 నుంచి 45 నిమిషాల పాటు కనిపిస్తాడని సమాచారం. ఇటీవలే మహా చిత్రం షూటింగ్‌లో శింబు పాల్గొన్నాడు. మరో విషయం ఏమిటంటే చెప్పిన సమయానికి షూటింగ్‌కు రాడనే అపవాదును మూట కట్టుకున్న నటుడు శింబు. అలాంటిది మహా చిత్రం విషయంలో మాత్రం చెప్పిన సమయానికి రెండు గంటల ముందే స్పాట్‌లో ఉంటున్నాడట. 

గతాన్ని మరచిపోయి శింబు, హన్సిక స్నేహంగా ఉంటున్నారట. షూటింగ్‌లో ఇద్దరూ చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారని టాక్‌. ఈ సంచలన జంట నటన చాలా ఇంప్రెస్‌ చేస్తోందని చిత్ర వర్గాలంటున్నారు. మొత్తం మీద మహా చిత్ర వ్యాపారానికి శింబు, హన్సిక జంట బాగానే వర్కౌట్‌ అయ్యేలా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement