'మా ఇద్దరికి' పేరు మార్చింది ఆయనే! | singer and music DirectorJeeva Varshini inteview | Sakshi
Sakshi News home page

'మా ఇద్దరికి' పేరు మార్చింది ఆయనే!

Published Sat, Jan 3 2015 10:19 AM | Last Updated on Mon, Aug 20 2018 3:40 PM

'మా ఇద్దరికి' పేరు మార్చింది ఆయనే! - Sakshi

'మా ఇద్దరికి' పేరు మార్చింది ఆయనే!

- జీవా వర్షిణి
ఆమె మాట తీరులోని తమిళ స్వచ్ఛతను చూసి, అచ్చంగా తమిళ అమ్మాయే అనుకుంటారు. తమిళంలో ఆమె పాటలు విన్నా అదే అనిపిస్తుంది. కానీ, జీవా వర్షిణి అచ్చంగా తెలుగమ్మాయని తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. 2001 నుంచి తమిళంలో సినీ గీతాలు పాడుతున్న ఈ సినీ నేపథ్య గాయని ఇప్పుడు సంగీత దర్శకురాలిగా మారారు. తొలిసారిగా కొన్ని చిన్న బడ్జెట్ తెలుగు చిత్రాలకు సంగీతమిస్తూ, చిత్రసీమలో మరో మహిళా మ్యూజిక్ డెరైక్టర్‌గా రికార్డుల్లోకి ఎక్కారు. ఇటీవలే రిలీజైన ‘నారి నారి శ్రీ మురారి’కి సంగీతమందించిన ఈ వరంగల్ వనిత పరిచయం ఆమె మాటల్లోనే....
 
మాది వరంగల్ పక్కన ఉగ్గంపల్లి గ్రామం. అక్కడే పుట్టి పెరిగా. డిగ్రీ చదువు సగంలో మానేశా. మా పుట్టినింటి పేరు - శ్రీరంగరాజభట్టర్. సంప్రదాయ కుటుంబం. మా అమ్మకు మేనమామ చక్రవర్తుల పీతాంబరాచార్యులు సంగీత విద్వాంసులు. మా అమ్మ భారతికి సంగీతం వచ్చు. అలా నాకూ సంగీతం అబ్బింది.
 
పెళ్ళయ్యాక 1988లో నేను మద్రాసుకు వచ్చా. కె.ఆర్. నాథ్‌గా సుపరిచితులైన మా వారి పూర్తిపేరు - కొమండూరి రంగనాథ్. ఆయనకు కూడా సినీ, టీవీ రంగాలతో లోతైన పరిచయం ఉంది. తెలుగు, తమిళాల్లో చాలా ధారావాహికలు చేశారాయన. ఇక్కడే తమిళం నేర్చుకున్నా. సంగీతంలో నా పురోగతి వెనుక మా వారి ప్రోత్సాహం చాలా ఉంది.
 
సినీ రంగంలో సుప్రసిద్ధులైన సీనియర్ సంగీత దర్శకులైన శంకర్ - గణేశ్‌లలో ఒకరైన గణేశ్, మా వారు మంచి కుటుంబ స్నేహితులు. నా గొంతు బాగుందని ఆయన బాగా ప్రోత్సహించారు. సినీ రంగంలోకి తెచ్చారు. నేను మ్యూజిక్ డెరైక్టరవడానికీ ఆయనే కారణం.
 
నాకు తెలుగుతో పాటు తమిళం, హిందీ వచ్చు. తెలుగమ్మాయినైనా తమిళంలో పాడడం కష్టం కాలేదు. హిందీలో కూడా సినీ గీతాలు ఒకటీ, అరా పాడా. ఏ భాష పాటైనా సరే తెలుగు లిపిలో రాసుకొని పాడేస్తుంటా.
 
శంకర్ - గణేశ్ సంగీతంలో తొలిసారిగా 2002లో ‘తీండ తీండ’ సినిమాలో పాడాను. ఇప్పటికి ఓ 20 దాకా తమిళ సినీ గీతాలు పాడాను. ‘ఊట్టి మలై రోజా’, ‘మొరట్టు పైలే’ తమిళ చిత్రాల్లో, అలాగే సంగీత దర్శకుడు దేవా సారథ్యంలో పాటలు పాడా.
 
విచిత్రం ఏమిటంటే, తెలుగులో పాడడాని కన్నా ముందే నేను సంగీత దర్శకత్వం చేపట్టడం. కొత్త హీరో హీరోయిన్లతో సిద్ధమైన ‘సూరి వర్సెస్ వరలక్ష్మి’ సినిమాకు తొలిసారిగా సంగీతం అందించా.     
ఆ సినిమాలో పాట ద్వారా తెలుగులో గాయనిగా అడుగుపెడుతున్నా. ప్రస్తుతం ఏకకాలంలో తమిళ (ఇయక్కునర్), తెలుగు (నిర్దేశకుడు), హిందీ (డాన్ - డెరైక్టర్) భాషల్లో తయారవుతున్న చిత్రానికి పాటలు మొత్తం పాడాను.
 
సంగీత దర్శకురాలిగా కూడా చిన్న చిన్న అవకాశాలు వరుసగా వస్తున్నాయి. ‘సూరి వర్సెస్ వరలక్ష్మి’ దర్శక, నిర్మాతలతోనే ‘నారీ నారీ శ్రీ మురారి’ చిత్రానికి సంగీతం కూర్చాను. జై ఆకాశ్ హీరోగా తమిళంలో తయావుతున్న ‘ఆరు లిరింది ఆరు వరై’కి సంగీతం అందిస్తున్నా.
 
పాటకు తగ్గట్లుగా వాయిస్ మాడ్యులేషన్‌ను మార్చడం నాకలవాటు. అందుకు ఎస్పీబీ గారే స్ఫూర్తి.
 
నిజానికి, నా అసలు పేరు - శ్రీదేవి. కానీ, సినిమాల కోసం మూడేళ్ళ క్రితం ‘జీవా వర్షిణి’గా మార్చుకున్నా. చెన్నైలోని 100 ఫీట్ రోడ్‌లో ప్రసిద్ధ న్యూమరాలజిస్ట్ ఓం ఉలగనాథన్ నా పేరు మార్చారు. గమ్మత్తేమిటంటే, సంగీత దర్శకుడు దిలీప్‌కు ఏ.ఆర్. రెహమాన్ అని పేరు మార్చింది ఆయనే. పేరు మార్చుకున్నాకే, మూడేళ్ళుగా నాకు సినిమాల్లో అవకాశాలు పెరిగాయి. సంగీత దర్శకత్వానికి ఛాన్స్ కూడా వచ్చింది.
 
గాయనిగా నేర్పింది పాడేసి వచ్చేస్తాం. కానీ, సంగీత దర్శకత్వమనేసరికి అందరికీ మనం నేర్పించే స్థాయిలో ఉండాలి. ఇక, సినీ రంగంలో పురుషాధిక్యత ఎక్కువైనా మ్యూజిక్ డెరైక్టర్‌గా ఇబ్బందులెదుర్కోలేదు.
 
సినిమా పాటకు మనమిచ్చే బాణీ వినసొంపుగా ఉండాలే తప్ప, రాగాల ఆధారంగా సాగాల్సిన అవసరం లేదని సంగీత దర్శకులు ఎం.ఎస్. విశ్వనాథన్ చెబుతుండేవారట. ఆయన శిష్యులైన శంకర్ - గణేశ్ అంకుల్ నాకు ఆ సలహానే ఇచ్చారు. అందుకే, నా బాణీలన్నీ ఆ తరహాలోనే చేస్తున్నా. సినిమాలో అయిదు పాటలుంటే, అయిదింటినీ అయిదు రకాలుగా చేయడానికి ప్రయత్ని స్తున్నా.

- రెంటాల జయదేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement