మత్సరం లేని మంచి మనిషి | Singer Kousalya gets Emotional on Chakri Death | Sakshi
Sakshi News home page

మత్సరం లేని మంచి మనిషి

Published Mon, Dec 15 2014 11:07 PM | Last Updated on Sat, Sep 2 2017 6:13 PM

మత్సరం లేని మంచి మనిషి

మత్సరం లేని మంచి మనిషి

సంగీత దర్శకుడు చక్రి చనిపోయారన్న వార్త నాకు ఇప్పటికీ షాకింగ్ గానే ఉంది. వాళ్ళింట్లో వాళ్ళందరికీ నేను బాగా సన్నిహితురాలిని. చక్రి గారి అక్కను నేను కూడా వాణి అక్క అనే పిలుస్తాను. సోమవారం ఉదయం చక్రి గారి శ్రీమతి శ్రావణి నాకు ఫోన్ చేసి, అపోలో హాస్పిటల్‌లో ఉన్నా మంటూ వెక్కివెక్కి ఏడుస్తూ చెప్పేసరికి నాకు ఒక్క క్షణం విషయం అర్థం కాలేదు. హార్ట్‌బీట్ లేదని చెప్పారంటూ శ్రావణి చెప్పిన మాటతో హడావిడిగా అపోలోకు బయల్దేరా. ఈ లోగా చక్రి ఇక లేరనే వార్త తెలిసింది. నిశ్చేష్టురాలినయ్యా. అది నిజం కాకుండా ఉంటే బాగుండనుకున్నా.
 
 నిజానికి, గాయనిగా నన్ను వెండితెరకు పరిచయం చేసింది సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ గారు - ‘నీ కోసం’ సినిమాతో. ఆయన చిత్రాలు మూడింటికి పాడాక, చక్రి తన తొలి చిత్రం ‘బాచి’లో పాడించారు. గమ్మత్తేమిటంటే, ఆ తరువాత నుంచి ఇటీవల మూడేళ్ళ క్రితం దాకా చక్రి గారి సినిమాలన్నిటిలో నేను పాడా. ఆయన సంగీతంలో పాడిన ‘మళ్ళి కూయవే గువ్వా...’ పాట నా కెరీర్‌కు పెద్ద బ్రేక్ అయింది. ఇప్పటికి నేను 400 దాకా పాటలు పాడితే, అందులో 300 చక్రి స్వరసారథ్యంలో పాడినవే. పైగా, ఆయన సినిమాలో ఒక్క పాట పాడినా, అది పెద్ద హిట్టయ్యేది. అలాగే, గాయకుడు హరిహరన్ గారి కాంబినేషన్‌లో నేను పాడిన పాటలన్నీ చక్రి స్వరపరచినవే.
 
 వీలైనంత వరకు స్థానికులను ప్రోత్సహించాలన్నది చక్రి గారి స్థిరాభిప్రాయం. ఆ క్రమంలో ఆయన ఎంతోమంది గాయకులనూ, గీత రచయితలనూ పరిచయం చేశారు. నిజానికి, నేను ఆయనకు అభిమాన గాయనిని. ‘నేను నీ ఫ్యాన్‌ను’ అని ఎప్పుడూ అనేవారు. అయినా, ఒక దశలో మరింత మంది కొత్తవాళ్ళను ప్రోత్సహించ దలిచి, నాతో పాడించడానికి కొంత విరామం ఇచ్చారు. ఆ మాటే నాకూ చెప్పారు. అందుకే, ‘సింహా’, ‘శ్రీమన్నారాయణ’ తరువాత మూడేళ్ళుగా ఆయన చిత్రాల్లో నా గొంతు వినిపించలేదు. అయినప్పటికీ, మా మధ్య స్నేహానికి అది అడ్డు కాలేదు. ఒక సందర్భంలో ఆయనకు ఎక్కువ పాటలు పాడినా, ఇప్పుడు పాడకపోయినా ఆ తేడాలేమీ చూపించకుండా ఎప్పటి లానే ఉండడం చూసి, ఆ విషయంలో ఆయన నన్నెంతో అభిమానించారు... ఆ మాటే నాతోనూ అన్నారు.
 
  అలాగే, నేను స్వయంగా సంగీత దర్శకురాలినైనా ఆయన ఈర్ష్యపడలేదు. మత్సరం చూపలేదు. ఆయనది చాలా కూల్ మనస్త్తత్త్వం. స్నేహితులైనవారిని ఎవరినీ వదులుకోలేని మంచి గుణం. ఈ డిసెంబర్ 31న చేసే షోలో పాడాల్సిందిగా కోరారు. సరేనన్నాను. మొన్న ‘మేము సైతం’ కార్యక్రమంలో కలిసినప్పుడు ఆయన కొద్దిగా ఆయాసపడుతుండడం చూశా. కొద్దిగా డిప్రెషన్‌లో కూడా ఉన్నట్టనిపించారు. భోజనానికి అందరం వెళుతున్నామన్నా రాలేదు. తిండి తగ్గించి, ఉడకబెట్టిన కాయగూరలు తింటున్నాన న్నారు. ఇంతలోకే ఇలా జరిగింది. ఆయన మృత దేహం చూసేంత వరకు ఈ వార్త నిజం కాకుండా ఉంటే ఎంత బాగుండు అనుకున్నా. కానీ, దేవుడు నిర్దయుడు. మంచివాళ్ళను ముందే తీసుకెళ్ళిపోతాడు.
  (సంభాషణ - రెంటాల)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement