‘‘పాడుతా తీయగా’ కోసం 1996లో తొలిసారి మైక్ పట్టుకున్న క్షణం నుంచి నిన్నమొన్నటి వరకు కూడా నాలో అదే ఉత్సాహం.. ఎంజాయ్‌మెంట్ ఉన్నాయి. ఇప్పటికి కూడా ప్రతి చిన్న విషయానికి నాలో ఎగై్జట్‌మెంట్ కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్క ‘ఇండిపాప్’ నేనే అయినందుకు చాలా గర్వంగా ఉంది’’ అని గాయని, సంగీత దర్శకురాలు, నటి స్మిత అన్నారు. ఆమె సంగీత ప్రయాణం 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లో ఈ నెల 22న ‘ఎ జర్నీ 1999–2019’ పేరుతో వేడుక నిర్వహించనున్నారు. దానికి సంబంధించిన పోస్టర్‌లను విడుదల చేశారు. అనంతరం స్మిత మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో? ఎలా ఉంటుందో? తెలియకుండానే వచ్చాను.
ఆ తర్వాత నేర్చుకోవడం మొదలు పెట్టాను.. మ్యూజిక్, డ్యాన్స్‌లో మరింత శోధన చేసి ఎదిగాను. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నా ప్రయాణం ఎంతో ఆనందంగా ఉంది. 10 కంటే ఎక్కువ భాషల్లో పాటలు పాడాను. 12 ఆల్బమ్స్, 17 మ్యూజికల్ వీడియోలు, 100 కు పైగా ప్లే బ్యాక్ సాంగ్స్, 8 దేశాల్లో 200కు పైగా కాన్సర్ట్స్, ఓ ట్రోఫీ ఇంటికి తీసుకురావడం... ఇవన్నీ జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని తీపి అనుభూతులే. నేను ఇంత సాధించడానికి ఎంతో చేసిన వాళ్లందర్నీ గుర్తు చేసుకోడానికి.. వాళ్లకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకోడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నా.. కళకు నేను ఇవ్వాలనుకుంటున్న గౌరవం ఇది. అదే రోజు నా భవిష్యత్ లక్ష్యాలను చెబుతా’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment