
సాక్షి, చెన్నై : ప్రతిభకు వయసుతో పని ఉండదు. అలా సంగీతరంగంలో గాయనిగా ఎనలేని కీర్తికిరీటాలను అందుకున్నారు గానకోకిల పి.సుశీల. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హింది, సంస్కృతం, తుళు ఇలా 11 భాషల్లో 50వేలకు పైగా పాటలు పాడి గిన్నీస్ రికార్డును సాధించారు. పద్మభూషణ్ అవార్డు వరించింది. 80వ వసంతంలో అడుగిడిన ఆమె సంగీతదర్శకురాలిగా కొత్త అవతారం ఎత్తుతున్నారనే ప్రచారం సామాజిక మాద్యమాల్లో చక్కెర్లు కొడుతోంది. గాయనిగా 60 ఏళ్ల అనుభవం కారణంగానే ఆమెకు ఈ అవకాశం వచ్చినట్లు సమాచారం. నీట్ పరీక్షలకు వ్యతిరేకంగా పోరాడి ఆత్యహత్య చేసుకున్న వైద్య విద్యార్ధిని అనిత జీవిత వృత్తాంతం సినిమాగా తెరకెక్కుతోంది.
డాక్టరు ఎస్.అనిత ఎంబీబీఎస్ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనిత పాత్రను బిగ్‌బాస్ గేమ్ షో ఫేం జూలీ నటిస్తున్నారు. ఎస్.అజయ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అనిత తండ్రి పాత్రలో రాజ్‌దళపతి నటిస్తున్నారు. చిత్ర ఫస్ట్‌లక్ పోస్టర్ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రానికి ప్రఖ్యాత గాయనీమణి పీ సుశీలను సంగీతం అందించాల్సిందిగా కోరగా ముందు తనకు ఆసక్తి లేదని చెప్పారట. తరువాత చిత్రవర్గాల ఒత్తిడి, కథ ఆకట్టుకోవడంతో సంగీతాన్ని అందించడానికి సమ్మతించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదే నిజం అయితే డాక్టరు ఎస్.అనిత ఎంబీబీఎస్ చిత్రానికి పీ సుశీల సంగీతం బలంగా నిలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment