
ఆమె గాత్రానికి పరవశించని హృదయం లేదు. తన గీతాలతో అభిమానులను ఓలలాడించం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. పాడుతా తీయగాతో కెరీర్ ప్రారంభమై, వచ్చిన అవకాశాలను విజయపు మెట్లుగా మలుచుకుంటూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని రూపొందించుకున్నారు గాయని ఉష. అయితే ఆమె పాటలు పాడటమే కాదు, డ్యాన్సులు కూడా చేయగలనంటున్నారు. ఈ మేరకు కూతురుతో కలిసి "బరేలీ కీ బర్ఫీ" సినిమాలోని బరేలీవాలె ఝుంఖే పె జియా లాల్‌చే... పాటకు చిందులేసి అందరినీ ఆశ్చర్యపర్చారు. "కరోనా కాలంలో వీకెండ్ ఫన్" అంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అద్భుతంగా డ్యాన్స్ చేశారంటూ ఆమెపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. (ఏదీ మీ వెనుక రాదు)
కాగా ఆమె శ్రీకాంత్ దేవరకొండ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పెళ్లి చేసుకుంది. వారికి బాబు అగస్త్యసాయి, కూతురు సహస్రసిద్ధి అని ఇద్దరు పిల్లలున్నారు. ఇదిలా వుండగా ఉష ఇంద్ర, పాండురంగడు, నీ స్నేహం, నువ్వు లేక నేను లేను, దిల్, చిరుత, వర్షం, మన్మథుడు, మననసంతా నువ్వే వంటి పలు సినిమాల్లో పాటలు పాడారు. అంతేకాక తెలుగుతోపాటు కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనూ పాటలు పాడారు. రెండుసార్లు ఉత్తమ నేపథ్య గాయనిగా నంది అవార్డులు అందుకున్నారు. (సల్మాన్‌ఖాన్‌తో సాన్నిహిత్యం పెరిగింది)