మిస్టర్ లోకల్ చిత్రం వినోదమే ప్రధానంగా ఉంటుందని ఆ చిత్ర కథానాయకుడు శివకార్తికేయన్ తెలిపారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ.జ్ఞావేల్‌రాజా నిర్మించిన చిత్రం మిస్టర్‌లోకల్. శివకార్తికేయన్, నయనతార జంటగా నటించిన ఈ చిత్రానికి రాజేశ్.ఎం దర్శకుడు. హిప్ ఆప్ ఆది సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 17న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో చిత్ర దర్శకుడు రాజేశ్.ఎం మాట్లాడుతూ శివకార్తికేయన్ హీరోగా స్టూడియోగ్రీన్ పతాకంపై చిత్రం చేయడం నిశ్చయం అయినప్పుడు తనకు మంచి విజయవంతమైన చిత్రం ఇవ్వాలని నిర్మాత జ్ఞానవేల్‌రాజా కోరారన్నారు. ఇక నటుడు శివకార్తికేయన్ మద్యం తాగే సన్నివేశాలు, అలాంటి పాటల సన్నివేశాలు, మహిళలను కించపరచే అంశాలు లాంటివి లేకుండా వినోదాత్మక చిత్రం కావాలని అడిగారన్నారు. దీంతో అలాంటివేవీ ఈ మిస్టర్ లోకల్ చిత్రంలో ఉండవని చెప్పారు. కుటుంబ సమేతంగా చూసి ఆనందించే క్లీన్ ఎంటర్‌టెయినర్ గా మిస్టర్ లోకల్ ఉంటుందని తెలిపారు.
చిత్ర కథానాయకుడు శివకార్తికేయన్ మాట్లాడుతూ ఇది చాలా సింపుల్ కథాంశంతో కూడిన కాలక్షేప చిత్రంగా ఉంటుందని తెలిపారు. టీవీ రంగంలో ఉండగానే దర్శకుడు రాజేశ్‌తో కలిసి పనిచేయాలని ఆశ పడ్డానన్నారు. ఆయన తెరకెక్కించిన ఎస్‌ఎంఎస్ చిత్రంలో తానూ ఒక పాత్రకు డబ్బింగ్ చెప్పానని అన్నారు. ఇక రాజేశ్ సెట్ చేసి ఇచ్చిన చిత్రమే వరుత్తపడాద వాలిభర్ సంఘం అని తెలిపారు. అది తన కెరీర్‌లో చాలా ముఖ్యమైన చిత్రం అని పేర్కొన్నారు.
నయనతారతో రెండవసారి కలిసి నటించిన చిత్రం మిస్టర్ లోకల్ అని తెలిపారు. ఇంతకు ముందు వేలైక్కారన్ చిత్రంలో కలిసి నటించామని, అయితే ఆ చిత్రంలో ఆమెకు నటించడానికి పెద్దగా స్కోప్ లేకుండా పోయిందని చెప్పారు. కాగా ఈ చిత్రంలో నయనతార చిత్రం అంతా ఉంటారని తెలిపారు. ఇకపై ఆరు నెలలకొకసారి మంచి మంచి చిత్రాలతో మిమ్మల్ని కలుస్తానని శివకార్తికేయన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment