ఈ ఏడాదిలో...ఆరు సినిమాలు
‘‘ఈ ఏడాది ఆరు సినిమాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇకపై నా మనసుకు నచ్చిన విభిన్న పాత్రలే చేస్తాను’’ అని డాక్టర్ రాజశేఖర్ వెల్లడించారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో పత్రికల వారితో ముచ్చటిస్తూ -‘‘నేను నటించిన ‘గడ్డం గ్యాంగ్’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో చేసిన ‘పట్టపగలు’ కూడా త్వరలోనే విడుదలవుతుంది. ‘అర్జున్’ సినిమా కూడా సిద్ధంగా ఉంది. నేను కార్పొరేషన్ స్కూలు టీచర్‌గా నటిస్తున్న ‘వందకు వంద’ సినిమా ఇప్పటికి ఎనభై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
ఇవి కాకుండా మరో రెండు సినిమాలు చేయాలనుకుంటున్నా’’ అని తెలిపారు. ‘గడ్డం గ్యాంగ్’ గురించి రాజశేఖర్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ -‘‘ ‘ఎవడైతే నాకేంటి’, ‘గోరింటాకు’ తర్వాత ఆ స్థాయి హిట్ సినిమాలు నా నుంచి రాలేదు. అందుకే రొటీన్‌గా కాకుండా విభిన్నంగా ఈ సినిమా చేశా. ఈ సినిమాకు అసలు హీరో స్క్రిప్టే. అచ్చు అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణ. జీవిత నిద్రాహారాలు పట్టించుకోకుండా ఈ చిత్రం కోసం చాలా కష్టపడింది. ఇందులో నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పాలని ప్రయత్నించా. కానీ ఎప్పటిలానే నా పాత్రకు సాయికుమార్ డబ్బింగ్ చెప్పారు’’ అన్నారు.