రేపు తెరపైకి ఆరు చిత్రాలు
శుక్రవారం అరడజను చిత్రాలు తెరపైకి రానున్నాయి. వాటిలో మణిరత్నం, కార్తీల కాట్రువెలియిడై, చాయ, విరుదాచలం,సెంజిట్టాలే ఎన్ కాదల, 8 తట్టాక్కల్, జూలియుం 4 పేరుం చిత్రాలు ఉన్నాయి.
దర్శకుడు మణిరత్నం తాజా సృష్టి కాట్రువెలియిడై. కార్తీ, బాలీవుడ్ బ్యూటీ అతిథిరావు జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీత మాత్రికుడు ఏఆర్.రెహ్మాన్ బాణీలు అందించారు. ఈ చిత్రం చెలియ పేరుతో తెలుగులోనూ ఏక కాలంలో తెరపైకి రానుంది. కశ్మీర్ ప్రాంతంలో అధిక భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ కాట్రు వెలియిడై. ఇకపోతే సోనియా అగర్వాల్ పోలీస్ అధికారిగా పవర్‌ఫుల్ పాత్రలో నటించిన చిత్రం ఛాయ. ఈ చిత్రానికి వీఎస్.పళనివేల్ దర్శకుడు. నిజానికి ఈ చిత్రం గత నెలలోనే విడుదల కావలసి ఉంది.
థియేటర్ల కొరత కారణంగా వాయిదా పడింది.మూడో చిత్రం విరుదాచలం. లక్ష్మీఅమ్మాళ్ ఫిలింస్ పతాకంపై పి.సెంథిల్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో విరుదగిరి, శ్వేత, సమీర నాయికానాయికలుగా నటించారు. ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతల్ని రతన్‌గణపతి నిర్వహించారు. ఈ చిత్రానికి శ్రీరామ్ సంగీతాన్ని అందించారు. నాలుగవ చిత్రం చెంజిటాళే ఎన్ కాదల. ఎస్‌బీ.ఎంటర్‌టెయిన్‌మెంట్ పతాకంపై ఎస్.బాలసుబ్రయణియన్ నిర్మించిన ఈ చిత్రానికి ఎళిల్‌దురై దర్శకుడు, కథానాయకుడు మధుమిల, అభినయ కథానాయికలుగా నటించారు.
ఎఫ్.రాజ్‌భరత్ సంగీతం అందించిన ఇది విభిన్న ప్రేమ కథా చిత్రంగా తెరపైకి రానుంది. ఇక క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన చిత్రం 8 తోట్టాక్కల్. శ్రీగణేశ్ దర్శకత్వం వహించిన ఇందులో వెట్ట్రి, అపర్ణ బాలమురళి జంటగా నటించారు. ఆరవ చిత్రం జూలియుం 4 పేరుం. సువేదదేవి నిర్మించిన ఈ చిత్రానికి సతీశ్ దర్శకుడు. అమిధవన్, అల్యా మానస హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి రఘు శ్రావణ్‌కుమార్ సంగీతాన్ని అందించారు.
ఈ నెల 14న నటుడు ధనుష్ దర్శకత్వం వహించిన పవర్‌పాండి, పి.వాసు దర్శకత్వంలో లారెన్స్, రితికాసింగ్ జంటగా నటించిన శివలింగ, ఆర్య నటించిన కడంబన్ వంటి భారీ చిత్రాలు విడుదల కావడం, అదే విధంగా 28వ తేదీన రాజమౌళి చిత్రం బాహుబలి–2 చిత్రం భారీ ఎత్తున్న విడుదలకు సిద్ధం కావడంతో చిన్న చిత్రాల నిర్మాతలు తమ చిత్రాలను శుక్రవారం విడుదల చేయడానికి సిద్ధం అయ్యారన్నది గమనార్హం.