
విజయ్‌సేతుపతి ఇంటిని ముట్టడిస్తున్న చిరువ్యాపారులు
చెన్నై, పెరంబూరు: నటుడు విజయ్‌సేతుపతి ఇంటిని మంగళవారం చిరు వ్యాపారులు ముట్టడించి ఆందోళనకు దిగారు. విజయ్‌సేతుపతి ఇటీవల మండి ఆన్‌లైన్ వ్యాపార ప్రచార యాప్‌లో నటించారు. ఆన్‌లైన్ వ్యాపారంతో చిరు వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటూ, ఆ మండి ఆన్‌లైన్ వ్యాపార ప్రకటన చిత్రంలో నటుడు విజయ్‌సేతుపతి నటించడాన్ని చిరు వ్యాపార సంఘాలు తీవ్రంగా వ్యతికేస్తున్నాయి. ఈ విషయంలో విజయ్‌సేతుపతి ఇంటిని ముట్టడించి ఆందోళనలకు దిగుతామని ఇంతకు ముందే హెచ్చరించారు.
అన్నట్లుగానే మంగళవారం స్థానిక వలసరవాక్కం, అళ్వార్ తిరునగర్‌లోని విజయ్‌సేతుపతి ఇంటిని వందలాది మంది చిరు వ్యాపారలు ముట్టడించి ఆందోళనకు దిగారు. తమిళనాడు వ్యాపార సంఘాల అధ్యక్షుడు కొలత్తూర్ రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో నటుడు విజయ్‌సేతుపతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిరు వ్యాపారులకు తీవ్ర నష్టం కలిగించే ఆన్‌లైన్ వ్యాపారాలను ప్రోత్సహించరాదన్నారు. అయితే విజయ్‌సేతుపతి ఇంటిని ముట్టడి గురించి ముందస్తు సమాచారం ఉండడంతో పోలీసులు ఆయన ఇంటికి భద్రతను ఏర్పాటు చేశారు. ఆందోళన కారులను అరెస్ట్ చేసి సమీపంలోని ఒక కల్యాణ మంటపానికి తరలించారు. కాగా ఆన్‌లైన్ వ్యాపార విధానాన్ని నిషేధించాలంటూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయనున్నట్లు కొలత్తూర్ రవి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment